అక్టోబరులోనే కాంగ్రెస్‌ తొలి జాబితా

కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా అక్టోబరు మొదటి వారంలో విడుదల కానుంది. ఇప్పటికే  80కిపైగా నియోజకవర్గాలపై రాష్ట్ర స్క్రీనింగ్‌ కమిటీలో స్పష్టత రావడంతో ప్రాథమిక జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)కి పంపారు.

Updated : 24 Sep 2023 06:44 IST

ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా అక్టోబరు మొదటి వారంలో విడుదల కానుంది. ఇప్పటికే  80కిపైగా నియోజకవర్గాలపై రాష్ట్ర స్క్రీనింగ్‌ కమిటీలో స్పష్టత రావడంతో ప్రాథమిక జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)కి పంపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్‌ ఇతర ముఖ్యనేతలతో కూడిన సీఈసీ ఈనెల 29న భేటీ అయ్యే అవకాశముంది. అక్కడ అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తు చేస్తారు. ఏమైనా మార్పుచేర్పులు చేయాల్సి ఉంటే, ముగించేసి, అభ్యర్థుల పేర్లను తొలి విడత జాబితాలో ప్రకటిస్తారు. మిగిలిన అభ్యర్థుల ఎంపికపై వివిధ నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం కుదిరినా సామాజిక సమతౌల్యం, మహిళలు, మైనారిటీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తుండడంతో కసరత్తును కొనసాగిస్తున్నారు. పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బలమైన మహిళా నేతలు లేకపోవడంతో మంచిర్యాల స్థానంలో ప్రేమ్‌సాగర్‌రావుకు బదులు ఆయన భార్య కొక్కిరాల సురేఖ, చెన్నూరు(ఎస్సీ) స్థానంలో నల్లాల ఓదేలుకు బదులు ప్రస్తుత జడ్పీ ఛైర్‌పర్సన్‌, ఓదేలు సతీమణి భాగ్యలక్ష్మి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీల్లోని ఉపవర్గాలను గమనంలోకి తీసుకుని... వారి జనాభా, ప్రాబల్యం ఆధారంగా టికెట్లను కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీల్లోనూ బాగా వెనుకబడిన కులాలకు అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే దాదాపు 30 స్థానాలను ప్రస్తుతం పక్కన పెట్టినట్లు తెలిసింది. ఈ కసరత్తు పూర్తయ్యాక రెండో విడత జాబితాను విడుదల చేయనున్నారు.

గాంధీభవన్‌ వేదికగానే చేరికలు

కాంగ్రెస్‌లో చేరికల కార్యక్రమాన్ని దిల్లీలో కాకుండా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ వేదికగానే చేపట్టాలని అధిష్ఠానం నిర్ణయించింది. భారాసకు రాజీనామా చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతోపాటు భారాస, భాజపాల నుంచి చేరే వారిని రానున్న మంగళ, గురువారాల్లో గాంధీభవన్‌లోనే చేర్చుకోవాలని నిర్ణయించారు. పార్టీలో చేరాలనుకునే వారు దిల్లీకి వచ్చి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్‌లతో సమావేశమై, చర్చించాక హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. ఈ క్రమంలోనే నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం దిల్లీకి వచ్చినా హైదరాబాద్‌లోనే చేరిక ఉంటుందని తెలిపారు. ఆయన వెంట వచ్చిన కొందరు అనుచరుల విన్నపంతో ఏఐసీసీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గాంధీభవన్‌లో చేరికలు చేపడితేనే పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు రావడానికి వీలుంటుందని, ప్రజల్లోకి సానుకూల వాతావరణం పోతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇవే వివరాలపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే శనివారం సాయంత్రం దిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

ఆఖరి ప్రయత్నాల్లో ఆశావాహులు

దాదాపు 80కిపైగా స్థానాల్లో వడపోత ముగిసిందని, మిగిలిన వాటికీ సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తారని నాయకులు చెబుతున్నా ఆశావహులు తమ ప్రయత్నాలు మానడం లేదు. దిల్లీలో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల ఫ్లాట్‌లున్న యమున అపార్ట్‌మెంట్‌ ఎదుట, లోధి రోడ్డులోని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంటి ఎదుట బారులు తీరుతున్నారు. వారికి సర్దిచెప్పేందుకు నాయకులకు శక్తికి మించిన పని అవుతోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు నలుగురు ఆశావహులు, నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు వస్తుండటంతో పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. సమీపంలోని ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో గదుల లభ్యత లేకుండా పోయింది.


ఆరు గ్యారంటీలు.. కాంగ్రెస్‌ సిక్సర్లు

సోనియా గాంధీ తుక్కుగూడ సభలో ప్రకటించిన 6 గ్యారంటీలు కాంగ్రెస్‌ కొట్టిన సిక్సర్లుగా రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. ఈ సిక్సర్ల తర్వాత కాంగ్రెస్‌కే ఓటు వేయాలని ప్రజలు అనుకుంటున్నారని, దీంతో ఇతర పార్టీల నేతలు చాలామంది కాంగ్రెస్‌లో చేరాలని ఉత్సాహంగా ఉన్నారన్నారు. దిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో ఆయన శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థుల జాబితా విడుదల కాకముందే కొందరు టికెట్లు వచ్చాయని సంతోషిస్తుండగా, మరికొందరు రాలేదని వేదనకు గురవుతున్నారని.. రెండూ సరికాదని చెప్పారు. టికెట్లు రానివారికి అధికారంలోకి వచ్చాక సముచిత ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలంగాణలో భారాస గెలుపు కోసం భాజపా-భారాసలు కొత్త నాటకానికి తెరలేపాయన్నారు. దిల్లీ మద్యం కేసులో కవితను జైలుకు పంపి సానుభూతి పొందాలని భారస ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల చేయగానే దానిపై చర్చ జరగకుండా ఉండేందుకు కవితకు నోటీస్‌లు ఇవ్వాలని ఆ రెండు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. భాజపా, భారాస, మజ్లిస్‌లు ఒక్కటేనని, ఈ నెల 17, 18, 19 తేదీల్లో తెలంగాణలో తాము కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. అప్పుడే ఆ పార్టీలూ పెట్టాయని మండిపడ్డారు. తనను విమర్శించే ముందు సొంత పార్టీ నేతల ప్రశ్నలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమాధానమివ్వాలని ఆయన సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని