బీసీల ఉద్యమానికి మద్దతు

బీసీలకు మహిళా రిజర్వేషన్లలో వాటా, చట్టసభల్లో రిజర్వేషన్లు, కులగణన చేపట్టాలన్న డిమాండ్లతో తెలంగాణలోని బీసీ సంఘాలు నిర్వహించనున్న సదస్సుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

Updated : 24 Sep 2023 06:34 IST

చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాల్సిందే
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
భారాస నేతతో ఆర్‌.కృష్ణయ్య భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: బీసీలకు మహిళా రిజర్వేషన్లలో వాటా, చట్టసభల్లో రిజర్వేషన్లు, కులగణన చేపట్టాలన్న డిమాండ్లతో తెలంగాణలోని బీసీ సంఘాలు నిర్వహించనున్న సదస్సుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బలహీనవర్గాలవారి సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారన్నారు. బీసీల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమానికి భారాస అండగా ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య శనివారం కవితతో ఆమె నివాసంలో సమావేశమై బీసీల డిమాండ్లు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ కమిషన్‌ అధ్యక్షుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, భారాస ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్‌ కవిత, వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, కార్పొరేషన్ల ఛైర్మన్లు జూలూరు గౌరీశంకర్‌, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, బాలరాజు యాదవ్‌, ఆంజనేయగౌడ్‌, రవికుమార్‌గౌడ్‌, ప్రవీణ్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, బీసీ కమిషన్‌ సభ్యులు కిశోర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన మొదటి శాసనసభ సమావేశాల్లోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై తీర్మానం చేశాం. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు కులగణన చేపట్టాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. బీసీ బంధు పథకం అమలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్లలో వాటా, ప్రత్యేక రిజర్వేషన్లు, న్యాయమైన డిమాండ్ల సాధనలో బీసీలకు అండగా ఉంటాం’’ అని పేర్కొన్నారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, జనగణన అనే మూడు డిమాండ్లతో ఈ నెల 26న జలవిహార్‌లో రాష్ట్రంలోని అన్ని బీసీ కుల సంఘాలు, నాయకులతో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామన్నారు. మహిళా బిల్లు కోసం పోరాడినందుకు కవితను అభినందించారు. అనంతరం కవితతో భారాస బీసీ నేతలు సమావేశమై జలవిహార్‌ సదస్సు నిర్వహణ, ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని