మణిపుర్‌ నుంచి మహారాష్ట్ర వరకు.. భారత్‌ న్యాయ్‌ యాత్ర

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ కాంగ్రెస్‌ మరో మహాయాత్రకు సన్నద్ధమైంది. భారత్‌ జోడో యాత్ర తరహాలో కొత్తగా ‘భారత్‌ న్యాయ్‌ యాత్ర’ను చేపట్టనుంది.

Published : 28 Dec 2023 03:42 IST

జనవరి 14న ఇంఫాల్‌లో ప్రారంభించనున్న రాహుల్‌గాంధీ
మార్చి 20న ముంబయిలో ముగింపు
14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా 6,200 కిలోమీటర్ల ప్రయాణం
బస్సుల్లో, కాలినడకన కొనసాగనున్న యాత్ర

ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ కాంగ్రెస్‌ మరో మహాయాత్రకు సన్నద్ధమైంది. భారత్‌ జోడో యాత్ర తరహాలో కొత్తగా ‘భారత్‌ న్యాయ్‌ యాత్ర’ను చేపట్టనుంది. పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ దీనికి నేతృత్వం వహించనున్నారు. జోడో యాత్ర రాహుల్‌ నాయకత్వంలో దక్షిణాది నుంచి ఉత్తరాదికి సాగింది. న్యాయ్‌ యాత్ర మణిపుర్‌ నుంచి మహారాష్ట్ర వరకు.. అంటే తూర్పు నుంచి పశ్చిమ భారత్‌కు సాగుతుంది. జనవరి 14న మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి దీన్ని ప్రారంభిస్తారు. మార్చి 20న ముంబయిలో ముగుస్తుంది. అరవై ఏడు రోజులపాటు మొత్తం 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా.. దాదాపు 6,200 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగుతుంది. అయితే ‘జోడో’ పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్‌ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుంది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శులు కె.సి.వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌ దిల్లీలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ మేరకు కీలక వివరాలు వెల్లడించారు.

ఘర్షణల గాయాలు మాన్పేందుకే మణిపుర్‌ నుంచి..

జోడో యాత్రకు కొనసాగింపుగా తూర్పు భారత్‌ నుంచి పశ్చిమానికి రాహుల్‌గాంధీ రెండో దశ యాత్ర మొదలుపెట్టాలని ఈ నెల 21న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించిన సంగతిని కె.సి.వేణుగోపాల్‌ గుర్తుచేశారు. జాతుల మధ్య ఘర్షణలతో అతలాకుతలమైన మణిపుర్‌ నుంచి న్యాయ్‌ యాత్రను మొదలుపెట్టడం ద్వారా అక్కడి గాయాలను మాన్పే ప్రక్రియను ప్రారంభించాలని రాహుల్‌గాంధీ భావిస్తున్నట్లు చెప్పారు. మణిపుర్‌, నాగాలాండ్‌, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రల్లో ఈ యాత్ర ఉంటుందని వివరించారు. ఇందులో భాగంగా మహిళలు, యువత, అణగారిన వర్గాల ప్రజలతో రాహుల్‌ మాట్లాడతారని చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 136 రోజులపాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4,500 కిలోమీటర్ల మేర జోడో యాత్ర సాగిన సంగతి గమనార్హం.

న్యాయం కోసం పోరాటం

ప్రజలకు అన్ని రకాల న్యాయం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ఈ యాత్రను చేపడుతున్నట్లు జైరాం రమేశ్‌ తెలిపారు. జోడో యాత్ర ద్వారా ఆర్థిక అసమానతలు, విభజన, నియంతృత్వంలాంటి సమస్యలను రాహుల్‌గాంధీ ప్రస్తావించారని.. న్యాయ్‌ యాత్రతో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం పోరాడనున్నారని చెప్పారు. ఈ యాత్రలో విపక్ష ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు పాలుపంచుకునే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. దానిపై కసరత్తు చేస్తామని వేణుగోపాల్‌ చెప్పారు. జోడో యాత్రలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారని జైరాం రమేశ్‌ గుర్తుచేశారు.

నినాదాలతో ప్రజలను మోసం చేయలేరు: భాజపా

భారత్‌ న్యాయ్‌ యాత్రను చేపట్టడం ద్వారా కాంగ్రెస్‌ సాధించేదేమీ ఉండదని భాజపా ఎద్దేవా చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు దేశ ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చూస్తోందని.. తద్వారా అందరికీ న్యాయం చేస్తోందని కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత మీనాక్షీ లేఖి పేర్కొన్నారు. అనేక ఏళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ 1984 నాటి సిక్కు అల్లర్ల బాధితులకు న్యాయం చేయలేకపోయినవారు దేశ ప్రజలందరికీ ఎలా న్యాయం చేయగలరని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.


రెజ్లర్లను కలిసిన రాహుల్‌గాంధీ

భారత రెజ్లింగ్‌ సమాఖ్య వివాదాల్లో కూరుకున్నవేళ వేళ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హరియాణాలో పలువురు రెజ్లర్లను కలిశారు. ఝజ్జర్‌ జిల్లాలోని వీరేందర్‌ అఖాడాకు బుధవారం ఉదయం వెళ్లిన ఆయన.. ప్రముఖ రెజ్లర్‌ బజరంగ్‌ పునియా సహా పలువురు మల్లయోధులతో మాట్లాడారు. రాహుల్‌ తమ రెజ్లింగ్‌ సాధన చూసేందుకు వచ్చారని.. తమతో కాసేపు మల్లయుద్ధం కూడా చేశారని పునియా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని