హుద్‌హుద్‌ కంటే ప్రమాదకరమైన వైపరీత్యం జగన్‌: పురందేశ్వరి

ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలా.. ఎప్పుడెప్పుడు వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపుదామా అనే కసితో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఇంతమంది వచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం లోక్‌సభ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

Published : 11 Apr 2024 05:40 IST

ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలా.. ఎప్పుడెప్పుడు వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపుదామా అనే కసితో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి ఇంతమంది వచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం లోక్‌సభ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. హుద్‌హుద్‌, మిగ్‌జాం వంటి ప్రకృతి వైపరీత్యాల కంటే వైకాపా వైపరీత్యంతోనే రాష్ట్రం అన్ని విధాలా కుదేలైందన్నారు. అభివృద్ధి లేదని.. పరిశ్రమలు రాక పిల్లలకు ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను తలలేని మొండెంలా.. రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారన్నారు. ‘ప్రజాహితే హితం రాజ్యః.. ప్రజానాంచు సుఖేసుఖం.. నాత్మప్రియం హితం రాజ్యః.. ప్రజానాంచ సుఖేసుఖం అని పెద్దలు చెప్పారు. రాజు తనకు ఇష్టమైన పరిపాలన కాదు. ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన అందించాలి. అలాంటి పాలన రావాలి’ అని పురందేశ్వరి అన్నారు. బీసీ కమిషన్‌కు కేంద్రం చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్రంలో కల్పించకుండా వైకాపా బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. నరేంద్రమోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్‌కల్యాణ్‌ శక్తి ఈ సభలో కనిపిస్తున్నాయని చెప్పారు. మే 13న మన సత్తా వైకాపాకు చూపించాలని కోరారు. తాను చాలా అదృష్టవంతురాలినని.. ఎంతో విశేషమైన రాజమహేంద్రవరం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా నిలబడ్డానని ఆమె తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని