Virat-Anushka: ‘పెద్ద పొరపాటు చేశా’.. విరుష్క జోడీకి రెండో సంతానం కామెంట్లపై ఏబీడీ

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ చేసిన కామెంట్లు మరోసారి వైరల్‌గా మారాయి. గతంలో విరాట్ కోహ్లీ ‘రెండో సంతానం’పై చేసిన వ్యాఖ్యలపై యూటర్న్‌ తీసుకోవడం గమనార్హం.

Updated : 09 Feb 2024 11:23 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో (IND vs ENG) తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరమైన విరాట్ కోహ్లీ (Virat Kohli) .. మిగతా టెస్టులకూ అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. దీనిపై ఇప్పటి వరకూ విరాట్‌ లేదా టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ స్పందించలేదు. అయితే, విరుష్క జోడీ తమ రెండో బిడ్డను స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నారని దక్షిణాఫ్రికా స్టార్‌ ప్లేయర్, ఆర్‌సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఇటీవల వ్యాఖ్యానించాడు. కుటుంబం కోసం టెస్టులకు దూరమైనట్లు పేర్కొన్నాడు. తీరా, ఇప్పుడు ఏబీడీ యూటర్న్‌ తీసుకొని.. తన యూట్యూబ్‌ ఛానల్‌లో చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పడంతో అభిమానుల్లో అయోమయం మొదలైంది.

‘‘కొన్నిసార్లు కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, గత వీడియోలో పెద్ద పొరపాటు చేశా. నాకు అందిన సమాచారమంతా తప్పే. అందులో ఎలాంటి నిజం లేదు. దీనిపై విరాట్ కుటుంబమే స్పష్టత ఇస్తుందని భావిస్తున్నా. అక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. అతడు త్వరగా జట్టులోకి రావాలని కోరుకుంటున్నా. విరామం తీసుకోవడానికి కారణమేదైనా సరే.. మరింత దృఢంగా తిరిగి రావాలి’’ అని ఏబీడీ వ్యాఖ్యానించాడు. 

అంతకుముందు ఏబీడీ ఏం చెప్పాడంటే? 

ఐదు రోజుల కిందట యూట్యూబ్ లైవ్‌లో ఏబీ డివిలియర్స్‌ అభిమానులతో ముచ్చటించాడు. విరాట్ కోహ్లీతో మాట్లాడారా? అతను బాగున్నారా? అని ఓ అభిమాని ఆయన్ని అడిగాడు. ‘‘ఇటీవల అతడితో చాటింగ్ చేశా. ఎలా ఉన్నావు అని అడిగా. క్షేమంగా ఉన్నానని చెప్పాడు. అతను తన కుటుంబంతో కొంత సమయం గడుపుతున్నాడు. అందుకే ఇంగ్లాండ్‌తో మొదటి రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడని అనుకుంటున్నా. కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్న మాట వాస్తవమే. ఇప్పుడు అతడు తన కుటుంబంతో ఉండటం ముఖ్యం’’ అని ఏబీడీ తెలిపాడు.

ఇప్పుడు ఏబీడీ తాజా వ్యాఖ్యలతో.. కోహ్లీ జట్టుకు దూరంగా ఉండటానికి గల కారణాలేంటో తెలియడం లేదు. అతడి తల్లి ఆరోగ్యం సరిగా లేదనే వార్తలూ వచ్చాయి. కానీ, వాటిని కోహ్లీ కుటుంబ సభ్యులు కొట్టిపడేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని