Anand Mahindra: ఐపీఎల్‌ ఫైనల్‌పై వైరల్‌గా మారిన ఆనంద్‌ మహీంద్రా ట్వీట్!

ఐపీఎల్‌ (IPL 2023) ఫైనల్‌ మ్యాచ్‌ గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సైతం తమ అభిమాన జట్లకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

Published : 29 May 2023 16:15 IST

ముంబయి: ఐపీఎల్‌ 16 (IPL 2023)లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరగాల్సిన ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా వాయిదా పడింది. దీంతో మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో సీఎస్‌కే, జీటీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ గురించి సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఎంతో మంది అభిమానులు తమ ఫేవరెట్‌ జట్టు, ఆటగాళ్లకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. వాటిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) చేసిన ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రెండు టీమ్‌లలో ఏ జట్టుకు మీరు మద్దతు ప్రకటిస్తారని మహీంద్రాను అడగ్గా ఆయన చెప్పిన సమాధానం ఎంతో బావుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ మహీంద్రా ఏ జట్టుకు మద్దతు తెలిపారంటే..?

‘‘ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నేను ఏ జట్టుకు మద్దతు ప్రకటిస్తానని చాలా మంది నన్ను అడుగుతున్నారు. శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ప్రతిభపై నాకు విశ్వాసం ఉంది. ఈ రోజు తన ఆటతో మరోసారి అలరించాలని కోరుకుంటున్నా. కానీ, నేను ధోని (MS Dhoni)కి పెద్ద అభిమానిని. ఈ రోజు ఆయన మరో మైలు రాయిని అందుకుంటాడని ఆశిస్తున్నా. కాబట్టి, రెండింటిలో అత్యుత్తమ జట్టు గెలవాలి’’ అని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ సమాధానం చూసిన నెటిజన్లు తమ అభిమాన జట్ల గురించి చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. రెండు జట్లు అద్భుతమైనవి అని కొందరు కామెంట్ చేయగా, ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం మరోసారి అడ్డంకి కాకూడదని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

ఆదివారం భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తడంతో ఫైనల్‌ మ్యాచ్‌ను వాయిదా వేయక తప్పలేదు. రిజర్వ్‌ డే అయిన సోమవారం మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. మరి, ఈ ఆసక్తికర పోరులో ఐపీఎల్‌ 16 సీజన్‌ విజేత ఎవరనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని