Babar Azam: కెప్టెన్సీ నుంచి బాబర్‌ దిగిపోవాలన్న మాలిక్.. ఈ కామెంట్లు ఇప్పుడెందుకంటూ మరో దిగ్గజం ఆగ్రహం!

ఒకే ఒక్క ఓటమి (IND vs PAK) పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తేలా చేసింది. కొందరు అతడికి మద్దతుగా మాట్లాడుతుంటే.. మరికొందరు సారథ్యం నుంచి దిగిపోవాలనే డిమాండ్‌ చేస్తున్నారు.

Updated : 17 Oct 2023 14:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌లో (ODI World Cup 2023) భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ను కెప్టెన్సీ నుంచి దిగిపోవాలని మాజీ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ సూచించగా.. మరో దిగ్గజ ఆటగాడు మహమ్మద్‌ యూసఫ్‌ మాత్రం ఇలాంటి కామెంట్లు చేయడం సరైంది కాదని కొట్టిపడేశాడు. అదే సమయంలో వసీమ్‌ అక్రమ్‌ తీరును కూడా యూసఫ్‌ తప్పుబట్టాడు. పాకిస్థాన్‌ ఓటమిపై వేర్వేరు క్రీడా ఛానళ్లలో వీరిద్దరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

బ్యాటింగ్‌పైనే బాబర్ దృష్టిపెట్టాలి: మాలిక్

‘‘బాబర్‌ అజామ్‌ తక్షణమే కెప్టెన్సీని వదులుకోవాలి. ఇదే విషయాన్ని ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూల్లోనూ చెప్పా. ఇలా చెప్పడానికి కూడా కారణం ఉంది. బ్యాటర్‌గా బాబర్‌ అజామ్‌ అద్భుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్‌ వల్ల వ్యక్తిగతంగా, జట్టుకూ ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే, కెప్టెన్సీని వదిలిపెట్టేసి బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలి. ఒకవేళ బాబర్‌ తన సారథ్య బాధ్యతలకు రాజీనామా చేస్తే తర్వాత పాక్‌ వన్డే జట్టుకు షహీన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయాలి. అయితే, ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దాని కోసం చాలా గ్రౌండ్‌ వర్క్‌ చేయాల్సి ఉంటుందని తెలుసు. కానీ, జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. నాయకుడిగా బాబర్‌ దూకుడైన నిర్ణయాలు తీసుకోవడం విఫలమవుతున్నాడు. బ్యాటింగ్‌ నైపుణ్యాలతో తన నాయకత్వ పటిమను కలపడంలోనూ తేలిపోయాడు. చాలా కాలంగా కెప్టెన్సీ చేస్తున్నా ఇంకా మెరుగు కాలేకపోయాడు’’ అని వ్యాఖ్యానించాడు. 

వరల్డ్‌ కప్‌ మధ్యలో ఇలాంటివి ఎందుకు?: యూసఫ్‌

షోయబ్‌ మాలిక్‌ చేసిన వ్యాఖ్యలపై మహమ్మద్‌ యూసఫ్ స్పందించాడు. వరల్డ్‌ కప్‌ మధ్యలో ఇలాంటి కామెంట్లు చేయడం మంచిది కాదని.. అక్కడే వసీమ్‌ అక్రమ్‌ కూడా షోయబ్‌ను అడ్డుకోకపోవడం తనకు షాకింగ్‌గా అనిపించిందని వ్యాఖ్యానించాడు. ఇదే క్రమంలో మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్‌ను ఉదాహరణగా పేర్కొన్నాడు. 

‘‘వరల్డ్‌ కప్‌ వంటి మెగా టోర్నీ జరుగుతున్నప్పుడు కెప్టెన్‌ను నిరుత్సాహపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదు. మాజీ సారథి ఇమ్రాన్‌ నాయకత్వంలో పాక్‌ 1992లో విజేతగా నిలిచింది. అయితే, అంతకుముందు రెండుసార్లు (1983, 1987లో) విఫలమైన సంగతి గుర్తుంది కదా. ఇమ్రాన్‌ కూడా మూడో ప్రయత్నంలో పాక్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. నాణ్యమైన ఆటగాడిని సుదీర్ఘకాలం కెప్టెన్‌గా కొనసాగించడం ఉత్తమం. బాబర్‌ అద్భుతమైన సారథి. అతడిలో ఆ నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నాయి. పీసీబీ ఛైర్మన్‌కు బంధువు కావడం వల్ల అతడేమీ కెప్టెన్‌గా ఎంపిక కాలేదు. బాబర్‌ మంచి సారథి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భారత్‌తో  మ్యాచ్‌ అంటేనే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఓటమి గురించే మాట్లాడాలి. కానీ, కెప్టెన్సీ నుంచి దిగిపోవాలని చెప్పడం ఏంటి? వసీమ్‌ అక్రమ్ అక్కడే ఉన్నా.. షోయబ్‌ వ్యాఖ్యలకు అడ్డు చెప్పకపోవడం నన్ను మరింత షాక్‌కు గురి చేసింది’’ అని యూసఫ్‌ తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని