MS Dhoni : ధోనీ బటర్‌ చికెన్‌ ఎలా తింటాడంటే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఉతప్ప

మహేంద్ర సింగ్‌ ధోనీ(MS Dhoni)కి సంబంధించిన ఆహారపు అలవాట్ల గురించి మాజీ క్రికెటర్‌ ఉతప్ప(Robin Uthappa) ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తినే విషయంలో కొన్ని కచ్చితమైన నియమాలు పాటించేవాడని తెలిపాడు.

Updated : 20 Mar 2023 16:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni).. ఫిట్‌నెస్‌ కోసం ఎంత కష్టపడతాడో తెలిసిందే. 41 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు. ఈ ఐపీఎల్‌(IPL) సీజన్‌ కోసం ధోనీ చెపాక్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. కాగా.. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప(Robin Uthappa).. ధోనీ ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. బటర్‌ చికెన్‌(Butter Chicken)ను ఆర్డర్‌ చేసి.. దానిని ఎలా తినేవాడో వివరించాడు.

‘రైనా, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఆర్పీ సింగ్‌, పియూష్‌ చావ్లా, మునాఫ్‌ పటేల్‌, ధోనీ, నేను.. మేమంతా ఓ గ్రూప్‌. అప్పుడప్పుడూ అందరం కలిసి హోటల్‌కు వెళ్లి తినేవాళ్లం. దాల్‌ మఖనీ, బటర్‌ చికెన్‌, జీరా ఆలూ, గోబీ, రోటీలు ఆర్డర్‌ చేసే వాళ్లం. అయితే.. ధోనీ మాత్రం తినే విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడు. బటర్‌ చికెన్‌ ఆర్డర్‌ చేసి.. చికెన్‌ తినకుండా కేవలం గ్రేవీ మాత్రమే తినేవాడు. ఒక వేళ చికెన్‌ తినాలనుకుంటే.. రోటీలను పక్కనపెట్టేవాడు. తినే విషయంలో తాను కాస్త విచిత్రంగా ఉండేవాడు’ అని ఉతప్ప ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించాడు.

ఇక సహచర ఆటగాళ్లతో ధోనీ(MS Dhoni) ఏంతో ఫ్రేండ్లీగా ఉంటాడని.. తనను మహీ అని పిలవాలని.. మహీ భాయ్‌ అనాల్సిన అవసరం లేదని చెప్పిన విషయాన్నీ ఉతప్ప గుర్తు చేసుకున్నాడు.

ధోనీ ఆ విషయాల్లో ముక్కుసూటిగా ఉంటాడు..

ఇక 14వ ఎడిషన్‌ ఐపీఎల్‌కు ముందు ధోనీతో తనకు జరిగిన ఓ ఘటనను ఉతప్ప గుర్తు చేసుకున్నాడు. తన సహచర ఆటగాళ్లతో కొన్ని విషయాలను ధోనీ ఎలాంటి మొహమాటం లేకుండా నేరుగానే చెబుతాడని తెలిపాడు. ‘‘ధోనీ చాలా ఓపెన్‌గా ఉంటాడు. మీకు బాధ కలిగించినా.. నిజాలు తెలియజేయడంలో వెనుకాడడు. వేలంలో చెన్నై జట్టు నన్ను తీసుకున్నప్పుడు.. ధోనీ నన్ను పిలిచాడు. ‘మీకు ఆడే అవకాశం లభిస్తుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే సీజన్‌ ఇంకా చాలా దూరంలో ఉంది. నేను దాని గురించి ఆలోచించడం లేదు. మీరు తుది జట్టులో ఉంటే.. నేను మీకు తెలియజేస్తాను’’ అని ధోనీ నాతో అన్నాడు. ఐపీఎల్‌లో 13 సంవత్సరాలు విజయవంతంగా ఆడిన అనుభవం నాకు ఉంది. అయినప్పటికీ.. ధోనీ తాను ఏం చేయాలనుకుంటున్నాడో నా ముఖం మీదే చెప్పాడు. అందుకు ధోనీని నేను ఇప్పటికీ అభినందిస్తున్నాను’ అని ఉతప్ప వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు