IND vs ENG: మా ఓటమికి కారణం అదే.. ఇంగ్లాండ్‌ హెడ్‌ కోచ్‌ మెక్‌కల్లమ్‌

ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌(IND vs ENG)లో ఇంగ్లాండ్‌ ఘోర ఓటమి పాలైంది. దీనిపై ఆ జట్టు కోచ్‌ మెక్‌కల్లమ్‌ స్పందించాడు.

Published : 12 Mar 2024 00:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : బజ్‌బాల్‌ ఆటను చూపిస్తామంటూ వచ్చిన ఇంగ్లాండ్‌.. టీమ్‌ ఇండియా చేతిలో ఘోర ఓటమిపాలై వెనుదిరిగింది. తమ వ్యూహాలు ఫలించక టెస్టు సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయింది. తొలి టెస్టు మినహా.. మిగతా మ్యాచ్‌ల్లో రోహిత్‌ సేన ముందు పోరాడలేక చేతులెత్తేసింది. ఈ దారుణ ఓటమిపై ఆ జట్టు హెడ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(Brendon McCullum) స్పందించాడు. ఐదో టెస్టు ముగిసిన అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు.

సిరీస్‌ కొనసాగుతున్న కొద్దీ.. పర్యటక జట్టు పిరికిగా మారిందని మెకల్లమ్‌ అంగీకరించాడు. ‘సిరీస్‌ ముందుకెళ్తున్నప్పుడు మా జట్టులో ఆత్మవిశ్వాసం లోపించింది. బంతితోనే కాకుండా బ్యాటింగ్‌తో వాళ్లు మాపై ఎంతో ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మా జట్టులోని లోపాలన్నీ బహిర్గతమయ్యాయి. కొన్నిసార్లు మనం బయటపడొచ్చు. కానీ.. ఇలాంటి ఫలితాలు వస్తున్నప్పుడు మీరు విశ్వసిస్తున్న దానికి కట్టుబడి ఉండాలంటే లోతైన ఆలోచన, సర్దుబాటు అవసరం’’ అని పేర్కొన్నాడు. తమ జట్టు కొన్నిచోట్ల మెరుగవ్వాల్సిన అవసరం ఉందని మెక్‌ల్లమ్‌ ఈసందర్భంగా ఒప్పుకొన్నాడు. మరో రెండు నెలల్లో వాటిపై దృష్టిసారించి సరిదిద్దుకుంటామని తెలిపాడు.

రెండేళ్ల కిందట కొత్త కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో కలిసి ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్.. బజ్‌బాల్ వ్యూహానికి శ్రీకారం చుట్టాడు. దీని ప్రకారం తొలి బంతి నుంచి ప్రత్యర్థిపై ఎదురుదాడి చేయడమే లక్ష్యం. బౌలింగ్‌లోనూ ఇదే దూకుడును అనుసరించింది. కానీ.. ఈ ఆట తీరుతో మొత్తం తలకిందులై అసలుకే మోసం వస్తోందని పలువురు ఆ జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని