England set new record: ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల విధ్వంసం.. 498 పరుగులతో ప్రపంచ రికార్డు!

విధ్వంసక ఆటతో ఇప్పటికే వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన ఇంగ్లాండ్‌.. మరో కొత్త రికార్డును నెలకొల్పింది.

Updated : 17 Jun 2022 20:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విధ్వంసకర ఆటతో ఇప్పటికే వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన ఇంగ్లాండ్‌.. మరో కొత్త రికార్డును నెలకొల్పింది. ఆమ్‌స్టెల్‌వీన్‌ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో 498/4 పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి తన రికార్డును తానే అధిగమించింది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌ చేసిన 481 పరుగులే వన్డేల్లో అత్యధిక స్కోరు. ఒక్క ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లోనే మొత్తం 26 సిక్సర్లు, 36 ఫోర్లు నమోదయ్యాయంటే విధ్వంసం ఏ రీతిన సాగిందో అర్థం చేసుకోవచ్చు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా  మొదటి వన్డేలో నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్‌ మొదట్లో ఇంగ్లాండ్‌ ఓపెనర్‌ రాయ్‌(1) పెవిలియన్‌ చేరాడు. ఇదొక్కటే నెదర్లాండ్స్‌కు ఊరట నిచ్చే అంశం. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లంతా దూకుడుగానే ఆడారు. మరో ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్  122 (93) చెలరేగి ఆడి తన తొలి వన్డే సెంచరీని సాధించాడు. డేవిడ్ మలన్ 125 (109)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. తరవాత వచ్చిన జాస్ బట్లర్ 162*(70) ఆకాశమే హద్దుగా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మోర్గాన్ ‌(0) అవుట్‌ అయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్ 66*(22) సైతం విరుచుకుపడ్డాడు. దీంతో ఓ దశలో జట్టు స్కోరు 500 దాటేలా కనిపించింది. చివరికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. వన్డేల్లో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక స్కోర్లైన 498/4 (ఈ మ్యాచ్‌లో), 481/6 (ఆస్ట్రేలియాపై), 444/3(పాకిస్థాన్‌పై) అన్నీ ఇంగ్లాండ్‌ పేరిటే నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని