Joe Root: ప్రస్తుత తరంలో ఈ ఇద్దరు భారత క్రికెటర్లే అత్యుత్తమం: జో రూట్

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు ఎవరు? అని అడిగితే ఫలానా తమకిష్టమైన ఆటగాడి పేరును అభిమానులు చెబుతారు. అదే ఓ స్టార్‌ ప్లేయర్‌ను ఇదే ప్రశ్న అడిగితే ఏం చెబుతాడు? అనేది ఆసక్తికరం. ఇంగ్లాండ్‌ ఆటగాడు జో రూట్‌కు ఈ ప్రశ్న ఎదురవగా దానికి సమాధానం ఇచ్చాడు.

Updated : 08 Feb 2024 15:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్లపై ఇంగ్లాండ్‌ ఆటగాడు జోరూట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యుత్తమ ఆటగాళ్లని వ్యాఖ్యానించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో విరాట్ కోహ్లీ ఆడలేదు. మిగతా టెస్టులకూ అందుబాటులో ఉండటం కష్టమే. ప్రస్తుతం ఇంగ్లాండ్ ప్లేయర్లు ప్రాక్టీస్‌ కోసం అబుదాబి వెళ్లారు. మూడో టెస్టు ఫిబ్రవరి 15న రాజ్‌కోట్‌ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జో రూట్ మాట్లాడాడు. 

‘‘టెస్టు సిరీస్‌లో భారత్‌ కూడా దూకుడుగానే ఆడుతోంది. విరాట్ కోహ్లీ జట్టులో లేకపోయినా టీమ్‌ఇండియా బలంగానే ఉంది. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో కోహ్లీ, రోహిత్ అత్యుత్తమ ఆటగాళ్లు. అందులో ఎలాంటి సందేహం లేదు. జట్టులో సీనియర్లు అయిన వీరిద్దరూ మిగతావారికి ఆదర్శంగా నిలుస్తారు. వారు భారీ స్కోర్లు చేయకుండా ఆపేందుకు ఎల్లవేళలా ప్రయత్నిస్తాం. త్వరగా ఔట్‌ చేయగలిగితే దాదాపు మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. వారు ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకుంటే ఆపడం చాలా కష్టం’’ అని వ్యాఖ్యానించాడు. 

మిగతా టెస్టులకు విరాట్ లేకపోవడం లోటే: నాజర్ హుస్సేన్

‘‘తర్వాత మ్యాచ్‌లకు కూడా విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదనే వార్తలు వస్తున్నాయి. అయితే, ఇది తప్పకుండా భారత్‌కు నష్టమే అవుతుంది. కేవలం ఈ సిరీస్‌కు మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్‌కే లోటు. ఐదు టెస్టుల సిరీస్‌ ఎంతో ప్రత్యేకమైంది. ఇప్పటికే తొలి రెండు టెస్టులు ఎలా జరిగాయో మనం చూశాం. కనీసం చివరి టెస్టుకైనా కోహ్లీ వస్తాడని ఆశిస్తున్నా. దాదాపు 15 ఏళ్ల నుంచి క్రికెట్‌ ఆడుతున్న అతడికి వ్యక్తిగత జీవితం కోసం కొంత సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది’’ అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్‌ హుస్సేన్‌ తెలిపాడు. 

భారత పేస్‌ బౌలింగ్‌పై కోహ్లీ ప్రభావం ఎక్కువ: ఫిలాండర్

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తొమ్మిది వికెట్లతో అదరగొట్టాడు. ఇటీవల భారత్‌ పేస్‌ దళం బలంగా మారింది. దీనికి విరాట్ కోహ్లీ కూడా కారణమేనని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు వెర్నన్ ఫిలాండర్‌ వ్యాఖ్యానించాడు. ‘‘భారత్ ఎప్పుడు దక్షిణాఫ్రికాకు వెళ్లినా సరే మెరుగైన బౌలింగ్‌ ఎటాక్‌తో బరిలోకి దిగేది. ఉపఖండంలో వారి స్పిన్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. అలాంటిది ఇక్కడ పేస్‌ బౌలింగ్‌కూ ఆదరణ రావడానికి కోహ్లీ నాయకత్వమే కారణం. ఉత్తమంగా రాణించేందుకు తన బౌలర్లలో ఎప్పుడూ స్ఫూర్తినింపుతుంటాడు’’ అని ఫిలాండర్ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని