Finn Allen: పాకిస్థాన్‌పై ఫిన్‌ అలెన్ మెరుపు శతకం.. టీ20ల్లో ఆ రికార్డు సమం

పాకిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్‌ అలెన్ (Finn Allen) (137; 62 బంతుల్లో) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 

Updated : 17 Jan 2024 17:37 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు పరాజయ పరంపర కొనసాగుతోంది. ఆస్ట్రేలియా చేతిలో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌ వాష్‌కు గురై న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్‌.. ఇక్కడా వరుసగా మూడో ఓటమి చవిచూసింది. దీంతో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను కోల్పోయింది. ఓపెనర్‌ ఫిన్ అలెన్ (Finn Allen) (137; 62 బంతుల్లో 5 ఫోర్లు, 16 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అలెన్‌ 48 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. హారిస్ రవూఫ్‌ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు రాబట్టాడు.

ఒకే ఇన్నింగ్స్‌లో 16 సిక్స్‌లు బాది అజ్రతుల్లా జజాయ్‌ (అఫ్గాన్‌) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. జజాయ్‌ 2019లో ఐర్లాండ్‌పై 16 సిక్స్‌లు కొట్టాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగానూ ఫిన్ అలెన్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు బ్రెండన్ మెక్‌కల్లమ్ (123 పరుగులు, 2012లో బంగ్లాదేశ్‌పై) పేరిట ఉంది.

ఇక, మ్యాచ్‌ విషయానికొస్తే న్యూజిలాండ్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్‌ 179/7కు పరిమితమైంది. దీంతో 45 పరుగుల తేడాతో కివీస్‌ ఘన విజయం సాధించింది. బాబర్ అజామ్ (58; 37 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా మూడో మ్యాచ్‌లో అర్ధ శతకం బాదాడు. మిగతా బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని