IND vs PAK: భారత్‌ X పాక్‌ మ్యాచ్ హీట్‌.. వీరి మధ్య పోరే హైలైట్‌!

వన్డే సంగ్రామంలో భారత్ కీలక మ్యాచ్‌ ఆడేందుకు (IND vs PAK) సిద్ధమైంది. దాయాది దేశం పాక్‌తో తలపడనుంది. గత ఆసియా కప్‌లో పాక్‌ను చిత్తు చేసిన అనుభవం భారత్ సొంతం. ఇప్పటికే వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో పాక్‌పై ఏడుసార్లు విజయం సాధించిన భారత్‌ ఇప్పుడు ‘8’పై కన్నేసింది.

Updated : 14 Oct 2023 09:40 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) మరింత ఊపు తెచ్చే మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ వేదిక కానుంది. శనివారం భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ప్రపంచకప్‌లోనే హైఓల్టేజీ మ్యాచ్‌ అయిన ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పోరు ఇంకా రసవత్తరంగా ఉండటం ఖాయం.  

భారత ఓపెనర్లు X షహీన్ అఫ్రిది

భారత్, పాక్‌ మ్యాచ్‌ అనగానే మన బ్యాటింగ్‌కు వారి పేస్‌ దళానికి పోరాటంగానే చూస్తాం. ఇప్పుడు కూడా అదే పునరావృతమవుతుందని అంతా భావిస్తున్నారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడితోపాటు ఈసారి ఓపెనర్‌గా గిల్ వస్తాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డెంగీ కారణంగా గిల్ గత రెండు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. ఒకవేళ గిల్ ఆడలేకపోతే ఇషాన్‌ కిషన్‌ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో అఫ్గాన్‌పై భారీ సెంచరీ చేసిన రోహిత్‌ను షహీన్ ఏమాత్రం అడ్డుకోగలడో చూడాలి. గతేడాది టీ20 వరల్డ్‌ కప్‌లో భారత బ్యాటింగ్‌ లైనప్‌ను షహీన్‌ బెదరగొట్టాడు. కానీ, ఇటీవల ఆసియా కప్‌లో పాక్‌పై 356/2 భారీ స్కోరు చేసిన భారత్‌.. పాక్‌ను 128 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్‌లో షహీన్‌ బౌలింగ్‌లో భారత్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. పది ఓవర్లలో వికెట్‌ మాత్రమే తీసి 79 పరుగులు సమర్పించాడు. 

విరాట్ కోహ్లీ X హారిస్ రవూఫ్‌

విరాట్, హారిస్‌ మధ్య పోరంటే మనకు గతేడాది టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ గుర్తుకు రావడం సహజమే. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో రవూఫ్‌ను కోహ్లీ రఫ్పాడించాడు. పేస్‌కు అనుకూమైన ఆ పిచ్‌పైనా కీలకమైన సమయంలో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టడం చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆసీస్‌పై వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. కాబట్టి, ఈసారి కూడా రవూఫ్‌కు చెక్‌ పెట్టే సత్తా కోహ్లీకి ఉంది. వన్‌డౌన్‌లో వచ్చే కోహ్లీ సహజంగానే పాక్‌ బౌలింగ్‌లో శివాలెత్తుతాడు. 

భారత పేస్‌ X బాబర్‌ అజామ్‌-రిజ్వాన్

భారత స్టార్‌ పేసర్‌ బుమ్రా ఈసారి వరల్డ్‌ కప్‌లో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీసిన బుమ్రా మరోసారి పాక్‌పైనా అదే దూకుడును కొనసాగించాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇక ఆ జట్టులో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌, రిజ్వాన్‌ కీలక బ్యాటర్లు. వారితోపాటు సౌదీ షకిల్, అబ్దుల్లా కూడా ధాటిగా ఆడుతున్నారు. వీరిని ఎదుర్కోవాలంటే బుమ్రాతోపాటు సిరాజ్‌ లేదా షమీ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయాలి. మిడిల్‌ ఓవర్లలో పాండ్య కీలకం కానున్నాడు. 

కుల్‌దీప్‌ X ఇఫ్తికార్‌-సౌద్‌ షకీల్‌

పాకిస్థాన్‌ టాప్‌ ఆర్డర్‌ను భారత పేసర్లు అడ్డుకోగలిగితే మ్యాచ్‌పై సగం పట్టు సాధించినట్లే. ఇక కీలకమైన మిడిలార్డర్‌ వంతు తేల్చాల్సిందే స్పిన్నర్లే. మంచి ఫామ్‌లో ఉన్న షకిల్‌తోపాటు ఇఫ్తికార్‌ అహ్మద్‌ను త్వరగా ఔట్‌ చేస్తే మ్యాచ్‌ భారత్‌ వశం కావడం సులువు కానుంది. గత ఆసియా కప్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో పాక్‌ నడ్డి విరిచిన కుల్‌దీప్‌ యాదవ్‌ మరోసారి కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అతడితోపాటు రవీంద్ర జడేజా, అశ్విన్‌ కూడా తమవంతు భాగస్వామ్యం అందించాలి. పాక్‌ మిడిలార్డర్‌ బ్యాటర్ ఇఫ్తికార్‌ అహ్మద్‌ను క్రీజ్‌లో కుదురుకోనీయకుండా చేయాలి. అప్పుడే పాక్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది.

భారత మిడిలార్డర్ X పాక్‌ స్పిన్నర్లు

భారత మిడిలార్డర్‌ ఎంత పటిష్ఠంగా ఉందో గత రెండు మ్యాచుల్లో తెలిసింది. మరీ ముఖ్యంగా ఆసీస్‌పై టాప్‌ ఆర్డర్‌లోని ముగ్గురు బ్యాటర్లు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరినా జట్టును విజయపథంలో నడిపించారు. దీనికి కారణం కేఎల్ రాహుల్‌ నిలకడైన ఆటతీరు. అతడితోపాటు శ్రేయస్‌ కూడా అఫ్గాన్‌పై ఫామ్‌లోకి రావడం భారత్‌కు శుభసూచికం. కానీ, అహ్మదాబాద్‌ కాస్త స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి  పాక్‌ స్పిన్నర్లు నవాజ్, షాదాబ్‌ ఖాన్‌తోపాటు పార్ట్‌టైమ్‌ బౌలర్ ఇఫ్తికార్ అహ్మద్‌ను ఎదుర్కోవడంలో జాగ్రత్త తీసుకోవాలి. వీరంతా భారత్‌తో మ్యాచ్‌ అంటేనే తమ పూర్తిస్థాయి శక్తియుక్తులను కూడదీసుకొని మరీ ఆడతారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని