IND vs PAK: దాయాదుల పోరు.. భారత అభిమానులెవరూ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయొద్దు: గంభీర్

భారత్ - పాకిస్థాన్‌ జట్ల (IND vs PAK) మధ్య జరుగుతున్న మ్యాచ్‌ సందర్భంగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ కీలక విజ్ఞప్తి చేశాడు.

Published : 14 Oct 2023 16:12 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్ జరుగుతోంది. టాస్‌ నెగ్గిన టీమ్ఇండియా బౌలింగ్‌ ఎంచుకోగా.. పాకిస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్‌ సందర్భంగా భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌ (Gautham Gambhir) కీలక సూచనలు చేశాడు. భారత అభిమానులు ఎవరూ ప్రత్యర్థి పాక్‌ను అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేయొద్దని కోరాడు. అతిథిగా వచ్చినవారి పట్ల గౌరవభావం చూపించాలని పేర్కొన్నాడు. 

‘‘వరల్డ్‌ కప్‌ ఆడేందుకు ఇక్కడికి వచ్చిన పాక్‌ జట్టు పట్ల అగౌరవంగా ప్రవర్తించొద్దు. మీకిష్టమైన టీమ్‌ఇండియాకు మద్దతు ఇవ్వండి. ఇందులో ఎలాంటి తప్పులేదు. కానీ, భారత్‌కు వచ్చిన పాక్‌ ఆటగాళ్లపై మాత్రం అసభ్యకర వ్యాఖ్యలు చేయకండి. వారంతా మనకు అతిథులు. కాబట్టి ఆటపరంగా వారికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. ఇవాళ ఈ స్టార్‌ ఓపెనర్‌ 42వ బర్త్‌డే కావడం విశేషం.

జెర్సీ మార్చుకొచ్చిన విరాట్

భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ సందర్భంగా ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. టాస్ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకోవడంతో భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుని ఫీల్డింగ్‌ కోసం మైదానంలోకి అడుగు పెట్టింది. అయితే, విరాట్ కోహ్లీ కూడా మిగతా వారితో కలిసి వచ్చాడు. తాను వేసుకున్న జెర్సీకి సహచరుల జెర్సీకి తేడా గమనించిన విరాట్ వెంటనే డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి పరిగెత్తాడు. కాసేపటికి భుజంపై మూడు రంగుల స్ట్రిప్‌ కలిగిన జెర్సీతో తిరిగివచ్చాడు. దీంతో విరాట్ ధరించిన పాత, కొత్త జెర్సీలతో ఫొటోలు నెట్టింట్‌ హల్‌చల్‌ చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని