IND vs PAK: లక్ష గళాలు ఒక్కటై...

జాతీయ గీతం ఆలపిస్తుంటే సహజంగానే ఉద్వేగం పొంగుకొస్తుంది. అదే.. సుమారు లక్ష మంది కలిసి ‘జనగణమన’ అంటూ గొంతు కలిపితే.. ఆ శబ్దం చెవుల నుంచి నరాల్లోకి పారి రక్తాన్ని పరుగులు పెట్టిస్తుంటే.. శరీరం ఊగిపోతుంది.

Updated : 15 Oct 2023 08:12 IST


అహ్మదాబాద్‌

జాతీయ గీతం ఆలపిస్తుంటే సహజంగానే ఉద్వేగం పొంగుకొస్తుంది. అదే.. సుమారు లక్ష మంది కలిసి ‘జనగణమన’ అంటూ గొంతు కలిపితే.. ఆ శబ్దం చెవుల నుంచి నరాల్లోకి పారి రక్తాన్ని పరుగులు పెట్టిస్తుంటే.. శరీరం ఊగిపోతుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. హృదయం ఉప్పొంగిపోతుంది. శనివారం అదే జరిగింది. అటు నరేంద్ర మోదీ స్టేడియంలో జాతీయ గీతాలాపన చేస్తున్న ప్రేక్షకులు.. ఇటు టీవీల ముందు కూర్చున్న అభిమానులు ఇదే అనుభూతికి లోనయ్యారు. ప్రపంచంలోనే పెద్దదైన స్టేడియం వైపే అహ్మదాబాద్‌ దారులన్నీ. భారత్‌- పాక్‌ మెగా పోరును వీక్షించాలనే ఆత్రుతే అందరిలోనూ. దేశంలో ప్రపంచకప్‌ జరుగుతున్న వేళ.. అహ్మదాబాద్‌ క్రికెట్‌ జ్వరంతో ఊగిపోయింది. టీమ్‌ఇండియా జెర్సీలు, టోపీలతో స్టేడియం నీలి సంద్రంగా మారిపోయింది. త్రివర్ణ పతాకాలు సగర్వంగా రెపరెపలాడాయి. పాకిస్థాన్‌ వికెట్లు పడ్డప్పుడు.. మన బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు బాదినప్పుడు స్టేడియం హోరెత్తింది. ‘భారత్‌ మాతా కీ జై’, ‘ఇండియా ఇండియా’ అనే నినాదాలతో మార్మోగింది. ‘‘ప్రపంచకప్‌ ఫైనల్‌ కంటే ప్రతిష్ఠాత్మకమైన ఈ మ్యాచ్‌ కోసం చండీగఢ్‌ నుంచి వచ్చాం. ఇది గెలిస్తే చాలు.. ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ ఓడినా పట్టించుకోం. ఈ గెలుపుతో ఇప్పుడే దీపావళి చేసుకుంటాం. 2011 మాయను మరోసారి భారత జట్టు పునరావృతం చేస్తుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని డీపీ సింగ్‌ అనే అభిమాని చెప్పాడు. ‘‘నేను రాహుల్‌ ద్రవిడ్‌ వీరాభిమానిని. నాకు క్రికెట్‌పై ఉన్న ప్రేమను ఇష్టపడే ద్రవిడ్‌.. నాకు టికెట్లు ఇప్పించాడు’’ అని కోల్‌కతాకు చెందిన మనోజ్‌ జైస్వాల్‌ పేర్కొన్నాడు.

భారతీయులు, ఎన్నారైలతో పాటు అమెరికా, న్యూజిలాండ్‌ తదితర దేశాల అభిమానులు కూడా స్టేడియంలోకి అడుగుపెట్టేందుకు ఉదయం నుంచే ఆత్రుతగా ఎదురు చూశారు. ఈ మ్యాచ్‌ కోసం విదేశీయుల కూడా భారీ సంఖ్యలో తరలిరావడం భారత్‌- పాక్‌ పోరుకు ఉన్న విశిష్టతను చాటేదే. ‘‘భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం న్యూజిలాండ్‌ నుంచి వచ్చాం. శుక్రవారమే ఇక్కడికి చేరుకున్నాం. మ్యాచ్‌లో భారత్‌కే మా మద్దతు. అందుకు టీమ్‌ఇండియా జెర్సీలు వేసుకున్నాం’’ అని ప్యాట్రిక్‌ అనే విదేశీయుడు చెప్పాడు. ఈ మ్యాచ్‌కు అయిదుగురు పాకిస్థాన్‌ పాత్రికేయులు కూడా హాజరయ్యారు. మ్యాచ్‌కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా హోటల్‌ గదులు ఒక్క రాత్రి కోసం రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు వసూలు చేశాయి. మరోవైపు మ్యాచ్‌ జరిగిన అహ్మదాబాద్‌లో కాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో కూడా భారత్‌- పాక్‌ సందడి కనిపించింది. పెద్ద తెరలు ఏర్పాటు చేసి మ్యాచ్‌ను ప్రసారం చేయడంతో అభిమానులు ఈ పోరును మరింతగా ఆస్వాదించారు. అలాగే క్రికెటర్ల పేర్ల మీద ఆహార పదార్థాలు, పాకిస్థాన్‌ వికెట్‌ పడ్డప్పుడల్లా ఉచితంగా మద్యం, ఆహారం.. భారత్‌ గెలవడంతో బిల్లులో పది శాతం రాయితీ లాంటివి అందజేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని