IND vs PAK: పాకిస్థానా.. పసికూనా?

కానీ శనివారం పాక్‌ ఇంత ఘోరంగా ఆడుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ మ్యాచ్‌కు రెండు జట్లూ పక్కా ప్రణాళికతోనే సిద్ధమై ఉంటాయి. కానీ ఆ ప్రణాళికల్ని అనుకున్న ప్రకారం మైదానంలో అమలు చేయడం, ఒత్తిడిని జయించడం కీలకం. ఈ విషయంలో రోహిత్‌ సేనకు నూటికి నూరు మార్కులు పడతాయి.

Updated : 15 Oct 2023 06:46 IST


ఈనాడు క్రీడావిభాగం

పాకిస్థాన్‌తో పోలిస్తే బలహీనంగా ఉన్న రోజుల్లోనూ ప్రపంచకప్‌లో ఆ జట్టును ఓడించింది భారత్‌. 1992, 1996, 1999, 2003.. ఈ ప్రపంచకప్‌లు వేటిలోనూ భారత్‌.. పాక్‌ను ఓడిస్తుందని మ్యాచ్‌లకు ముందు మన అభిమానుల్లో ధీమా ఉండేది కాదు. కానీ ఆయా సమయాల్లో అన్నీ కలిసొచ్చి, కొందరు ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలతో విజయాలు మన సొంతమయ్యాయి. కానీ 2011 నుంచి ప్రతిసారీ పాక్‌తో ప్రపంచకప్‌ మ్యాచ్‌ అంటే మనోళ్లే ఫేవరెట్లు. 2011లో కొంత పోటీ ఇచ్చిన చిరకాల ప్రత్యర్థి తర్వాతి రెండు టోర్నీల్లో భారత్‌ జోరును తట్టుకోలేకపోయింది. ప్రస్తుత మ్యాచ్‌లో అయితే రోహిత్‌ సేన ముందు బాబర్‌ బృందం ఓ పసికూనలా మారిపోయింది. రెండేళ్ల కిందట టీ20 ప్రపంచకప్‌లో పది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన పాకిస్థాన్‌ జట్టుకు, ప్రస్తుత జట్టుకు పెద్ద తేడా ఏమీ లేదు.

కానీ శనివారం పాక్‌ ఇంత ఘోరంగా ఆడుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ మ్యాచ్‌కు రెండు జట్లూ పక్కా ప్రణాళికతోనే సిద్ధమై ఉంటాయి. కానీ ఆ ప్రణాళికల్ని అనుకున్న ప్రకారం మైదానంలో అమలు చేయడం, ఒత్తిడిని జయించడం కీలకం. ఈ విషయంలో రోహిత్‌ సేనకు నూటికి నూరు మార్కులు పడతాయి. పాక్‌ ఇక్కడే తడబడి.. కుప్పకూలిపోయింది. మ్యాచ్‌ను ఆరంభించిన తీరు.. సగం వరకు ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు చూస్తే.. భారత్‌ను ఎదుర్కోవడానికి బాగానే సన్నద్ధమైనట్లు కనిపించింది. ఇక ఒత్తిడంతా భారత్‌ మీదే అన్న భావన కలిగింది ఒక దశలో. కానీ ఇన్నింగ్స్‌కు ఇరుసులా వ్యవహరించిన బాబర్‌ ఔటవ్వగానే ఆ జట్టు కుదేలైపోయింది. బాబర్‌, రిజ్వాన్‌ల భాగస్వామ్యం విడిపోయే వరకు ఓపిగ్గా ఎదురు చూసిన భారత్‌.. ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది. వికెట్‌ పడ్డ ఊపులో దాడిని తీవ్రతరం చేసి పాక్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. గొప్పగా బౌలింగ్‌ చేసిన కుల్‌దీప్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం పాక్‌కు తగిలిన అతి పెద్ద దెబ్బ. ఇక ఆరంభం నుంచి డాట్‌ బాల్స్‌తో పాక్‌ను ఒత్తిడిలోకి నెడుతూ వచ్చిన బుమ్రా.. రెండో స్పెల్‌లో రెండు మెరుపు బంతులతో చేయాల్సిన నష్టం చేసేశాడు. సరైన సమయంలో సిరాజ్‌కు రెండో స్పెల్‌కు దించి బాబర్‌ వికెట్‌ తీయడం.. ఆ వెంటనే బుమ్రాను రంగంలోకి దించి పాక్‌ను దెబ్బ కొట్టడం.. రోహిత్‌ నాయకత్వ పటిమకు రుజువులు. మూడో వికెట్‌ పడ్డాక భారత్‌ ముప్పేట దాడి చేసింది. నీలిరంగు జెర్సీలతో నిండిపోయిన స్టేడియాన్ని చూసి భారత జట్టు ఉత్తేజితమైతే.. పాక్‌ ఆ వాతావరణాన్ని చూసి మరింత ఒత్తిడిలో పడినట్లే కనిపించింది. తర్వాతి బ్యాటర్లలో ఒకరిద్దరు నిలబడి ఓ భాగస్వామ్యం నెలకొల్పి ఉంటే.. మళ్లీ పాక్‌ పుంజుకునేదే. కానీ ఒత్తిడికి చిత్తయి ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌ చేరిపోవడంతో ఆ జట్టుకు అవకాశమే లేకపోయింది. కెప్టెన్సీతోనే కాక బ్యాటింగ్‌తోనూ ఎదురుదాడి మంత్రమే పఠించిన రోహిత్‌.. పాక్‌ కథ ముగించి ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని