IND v ENG: ఉప్పల్‌ గుట్టు ఏమిటో?

‘‘ఉప్పల్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించొచ్చు. భారత్‌లో పరిస్థితులు ఇంగ్లాండ్‌కు సవాలే’’

Updated : 24 Jan 2024 06:42 IST

‘‘ఉప్పల్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించొచ్చు. భారత్‌లో పరిస్థితులు ఇంగ్లాండ్‌కు సవాలే’’

 టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

‘‘భారత్‌లో సవాళ్లను ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నాం’’

ఇంగ్లాండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌


ఈనాడు - హైదరాబాద్‌

భారత్‌, ఇంగ్లాండ్‌ (IND v ENG) మధ్య అయిదు మ్యాచ్‌ టెస్టు సిరీస్‌కు ముందు ఇరు జట్ల శిబిరాల నుంచి దూసుకొచ్చిన మాటల అస్త్రాలివి! సొంతగడ్డపై సంప్రదాయ పిచ్‌లపై ఎదురులేని భారత్‌.. ‘బజ్‌బాల్‌’ ఆటతో హోరెత్తిస్తున్న ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు పోరు రసవత్తరంగా సాగడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు వేదికగా నిలువనున్న ఉప్పల్‌ స్టేడియం పిచ్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఉప్పల్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుందా? బౌన్స్‌తో కూడిన పేస్‌కు సహకరిస్తుందా? అన్న చర్చ మొదలైంది.

టెస్టుల్లో టీమ్‌ఇండియాకు కలిసొచ్చిన వేదికల్లో హైదరాబాద్‌ ఒకటి. ఉప్పల్‌ స్టేడియంలో అయిదు టెస్టులాడిన భారత్‌.. నాలుగింట్లో గెలుపొందింది. 2010లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టు డ్రా కాగా.. అనంతరం వరుసగా కివీస్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌లపై భారత్‌ విజయాలు నమోదు చేసింది. 2018లో ఉప్పల్‌లో చివరి సారిగా విండీస్‌తో టెస్టు జరిగింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లతో విజృంభించిన పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో భారత స్పిన్‌ త్రయం రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా  కలిసి 10 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు భారత్‌ గెలిచిన మూడు మ్యాచ్‌ల్లో మాత్రం స్పిన్నర్లదే సంపూర్ణ ఆధిపత్యం. మరీ ముఖ్యంగా ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌! 2010లో మొదటి టెస్టు మినహాయిస్తే.. తర్వాత జరిగిన నాలుగింట్లోనూ అశ్విన్‌ ఆడటం.. అన్నింట్లోనూ భారత్‌ గెలవడం విశేషం. ఉప్పల్‌లో తిరుగులేని రికార్డు అశ్విన్‌ సొంతం. ఇక్కడ నాలుగు మ్యాచ్‌లాడిన అశ్విన్‌ మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు. చెరో 15 వికెట్లతో రవీంద్ర జడేజా, ఉమేశ్‌ యాదవ్‌ తర్వాతి స్థానంలో ఉన్నారు. ప్రజ్ఞాన్‌ ఓజా (9), హర్భజన్‌సింగ్‌ (7) కూడా ప్రభావం చూపారు.

మొత్తంగా ఉప్పల్‌ పిచ్‌పై స్పిన్‌ ఆధిపత్యం స్పష్టం. మొదటి రెండ్రోజులు బ్యాటర్లు, పేసర్లకు మధ్య మంచి పోరాటం కనిపిస్తుంది. కానీ మూడో రోజు నుంచి స్పిన్నర్లకు స్వర్గధామంగా మారుతుంది. ఇప్పటి వరకు ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లే ఇందుకు నిదర్శనం. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. 2017 టెస్టులో బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌటవగా.. అశ్విన్‌, జడేజా నాలుగేసి వికెట్లతో తిప్పేశారు. 2013లో ఆసీస్‌ 131 పరుగులకే కుప్పకూలడం గమనార్హం. అశ్విన్‌ 5, జడేజా  3 వికెట్లతో చెలరేగారు. 2012లో కివీస్‌దీ అదే పరిస్థితి. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ 164 పరుగులకే కుప్పకూలగా.. అశ్విన్‌ (6/54), ఓజా (3/48) ప్రత్యర్థి పతనంలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో గురువారం భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ప్రారంభమయ్యే తొలి టెస్టులోనూ స్పిన్నర్లదే హవా అనడంలో సందేహం లేదు. ఉప్పల్‌లో అత్యంత విజయవంతమైన అశ్విన్‌.. జడేజా ద్వయంతో పాటు కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ జట్టులో ఉన్నారు. సొంతగడ్డపై భారత్‌ ఎక్కువ శాతం ముగ్గురు స్పిన్నర్ల వైపే మొగ్గుచూపుతుంది. అశ్విన్‌, జడేజాతో పాటు కుల్‌దీప్‌ లేదా అక్షర్‌ బరిలో దిగడం దాదాపు ఖాయమే! ‘బజ్‌బాల్‌’తో పేసర్లపై విరుచుకుపడే ఇంగ్లాండ్‌ బ్యాటర్లను అడ్డుకోవాలంటే స్పిన్నాస్త్రమే సరైందని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ కూడా భావిస్తోంది. మరి ఉప్పల్‌ వేదికగా ‘బజ్‌బాల్‌ × స్పిన్నాస్త్రం’ పోరాటంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని