Sunil Gavaskar: 23 ఓవర్లకే అలసిపోతారా..

కొన్ని రోజుల క్రితం సెంట్రల్‌ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఊహించినట్లుగానే రంజీ ట్రోఫీలో ఆడలేదనే కారణంతో శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌కు ఆ జాబితాలో చోటు ఇవ్వలేదు.

Updated : 04 Mar 2024 13:59 IST

సునీల్‌ గావస్కర్‌

కొన్ని రోజుల క్రితం సెంట్రల్‌ కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఊహించినట్లుగానే రంజీ ట్రోఫీలో ఆడలేదనే కారణంతో శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌కు ఆ జాబితాలో చోటు ఇవ్వలేదు. రంజీల్లో జార్ఖండ్‌కు ఇషాన్‌ ఎందుకు ఆడలేదన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడు సెమీస్‌ కోసం ముంబయి జట్టుతో శ్రేయస్‌ చేరాడు. భారత జట్టు మేనేజ్‌మెంట్‌ సూచన మేరకు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందూ అతను రంజీ మ్యాచ్‌ ఆడాడు. అంటే రంజీల్లో ఆడేందుకు అతనెప్పుడూ నిరాకరించలేదు. క్వార్టర్స్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు సరే.. కానీ అతను వెన్నెముక నొప్పితో ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులోనూ ఆడలేనని చెప్పాడు. ఎన్‌సీఏలోని శిక్షకులు మాత్రం శ్రేయస్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌తోనే ఉన్నాడని పేర్కొన్నారు. ఇదే అతనికి ప్రతికూలంగా మారినట్లు కనిపిస్తోంది. నొప్పి తీవ్రత అనేది వ్యక్తిగతమైంది. దీన్ని ఏ శిక్షకుడు కూడా నిర్ధరించలేడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 15, రెండో ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లే వేసినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా రాంచి మ్యాచ్‌కు బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. రెండో, మూడో టెస్టుకు మధ్య 9 రోజులు విరామం వచ్చిందనే విషయం మర్చిపోవద్దు. దీని తర్వాత టెస్టులో 23 ఓవర్లే వేయడం అంటే అలసిపోయినట్లు కానేకాదు. మరి అలాంటప్పుడు బుమ్రాకు ఎందుకు విశ్రాంతినిచ్చారు? నాలుగో టెస్టు తర్వాత చివరి మ్యాచ్‌కు ముందు మరో 8 రోజుల వ్యవధి ఉంది. అత్యుత్తమ ఫిట్‌నెస్‌తో ఉన్న అథ్లెట్లకు తిరిగి కోలుకుని, దేశం కోసం ఆడేందుకు సిద్ధమవడానికి ఈ సమయం సరిపోతుంది. నాలుగో టెస్టు కూడా కీలకమైందే. ఇందులో ఇంగ్లాండ్‌ గెలిచి ఉంటే సిరీస్‌ ఫలితం నిర్ణయాత్మక పోరుకు మళ్లేది. విశ్రాంతి తీసుకోవాలనే నిర్ణయం ఎన్‌సీఏ లేదా బుమ్రా.. ఎవరు తీసుకున్నా ఇది భారత జట్టు ఆసక్తికి సంబంధించింది కాదు. యువ పేసర్‌ ఆకాశ్‌దీప్‌ అద్భుత బౌలింగ్‌తో బుమ్రా లేని లోటు లేకుండా చేశాడు. పెద్ద ఆటగాళ్లు ఆడకపోయినా యువ క్రికెటర్లు సంతోషంగా బాధ్యతలు తీసుకుంటారని మరోసారి చాటాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెప్పినట్లు.. భారత్‌కు ఆడాలనే ఆకలితో ఉండాలి. ఆ గౌరవం కోసం ఎంతటి భారమైనా మోయాలి. ఇక ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ఇప్పటివరకూ అద్భుతంగా సాగింది. అమోఘమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ ప్రదర్శనలతో ఇది క్రికెట్‌పై ఆసక్తి పెంచింది. ఇంగ్లాండ్‌ దూకుడైన బ్యాటింగ్‌, ఎదురుదాడితో సాగుతోంది. భారత్‌ మాత్రం సంప్రదాయ బ్యాటింగ్‌తో రాంచి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగుల ఆధిక్యమే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌, ధ్రువ్‌ జూరెల్‌ సంకల్పంతో భారత్‌ సిరీస్‌లో 3-1తో ఆధిక్యం సంపాదించింది. భారత్‌లో క్రికెట్‌ నైపుణ్యాలకు కొదవలేదనే దానికి రాంచి టెస్టే రుజువు. 2021 బ్రిస్బేన్‌ టెస్టులో మాదిరే రాంచి టెస్టులోనూ పెద్ద ఆటగాళ్లు లేకుండానే భారత్‌ ఆడింది. ఏ బాధ్యతలైనా తీసుకుంటామని, ఎంతటి భారమైనా మోస్తామని యువ ఆటగాళ్లు చాటారు. అనుభవం లేని ఆటగాళ్లతో కూడిన జట్టును నడిపించిన నాయకులకూ ఘనత దక్కాలి. ప్రధాన ఆటగాళ్ల ఖాళీలను యువ క్రికెటర్లు భర్తీ చేసేలా ప్రోత్సహించడంతో పాటు వీళ్లపై నమ్మకముంచారు. అంచనాలకు మించి రాణించిన ఈ ఆటగాళ్లు చిరస్మరణీయ విజయాలు సాధించారు. ఒత్తిడితో కంటే ఆస్వాదిస్తూ ఆడటంతో విజయాలు దక్కుతాయి. బ్రిస్బేన్‌, రాంచిలో జరిగిన సిరీస్‌ల్లోని నాలుగో టెస్టు మ్యాచ్‌లు భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిదగినవి. దేశంపై ప్రేమ.. సవాళ్లను ఎలా అధిగమించిదనేందుకు ఈ విజయాలు నిదర్శనం. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మరో మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది. అక్కడి (ధర్మశాల) పరిస్థితులు భారత్‌ కంటే ఇంగ్లాండ్‌కే నప్పేలా ఉన్నాయి. బంతి ఎక్కువగా స్వింగ్‌, సీమ్‌ అవుతుంది. ఇప్పటికే సిరీస్‌ దక్కించుకున్న నేపథ్యంలో ఈ నామమాత్రమైన మ్యాచ్‌ను భారత్‌ తేలికగా తీసుకోవచ్చనే ఆలోచనలున్నాయి. కానీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ప్రతి మ్యాచ్‌నూ గెలుస్తూ, పాయింట్లు సాధించడం ముఖ్యం. కాబట్టి ఈ మ్యాచ్‌ను తేలికగా తీసుకునే ఛాన్స్‌ లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని