Rajasthan X Gujarat: రాజస్థాన్‌కు షాక్‌.. ఉత్కంఠ పోరులో గుజరాత్‌ విజయం

 రాజస్థాన్‌ జైత్రయాత్రకు అడ్డుపడింది. జైపుర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ నెగ్గింది. 

Updated : 11 Apr 2024 00:18 IST

జైపుర్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ (Rajasthan) జైత్రయాత్రకు బ్రేక్‌పడింది. జైపుర్‌ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 7 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ చివరి బంతికి విజయం సాధించింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా, రషీద్‌ ఖాన్‌ (24: 11 బంతుల్లో 4 ఫోర్లు) ఫోర్‌ కొట్టి జట్టును గెలిపించాడు. కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ (72: 44 బంతుల్లో  6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో చెలరేగగా, ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (35: 29 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌), తెవాతియా (22) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్‌ బౌలర్లలో కుల్దీప్‌ సేన్‌ 3, చాహల్‌ 2 వికెట్లు తీశారు. 

చివరి ఓవర్‌ సాగిందిలా..

  • గుజరాత్ విజయానికి చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. మొదటి మూడు బంతుల్లో రషీద్‌ ఖాన్‌ రెండు ఫోర్ల సాయంతో పది పరుగులు రాబట్టాడు. 
  • 3 బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన దశలో రషీద్ ఖాన్ సింగిల్ తీశాడు. 
  • ఐదో బంతికి రాహుల్ తెవాటియా రెండు పరుగులు పూర్తి చేసుకుని మూడో రన్‌కు పరుగెత్తి రనౌటయ్యాడు. 
  • చివరి బంతికి రెండు పరుగులు అవసరం ఉండగా.. రషీద్ ఖాన్‌ బౌండరీ బాదాడు. దీంతో రాజస్థాన్‌కు ఈ టోర్నీలో తొలి ఓటమి ఎదురైంది.  

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (24) బట్లర్‌ (8) విఫలమైనప్పటకీ.. కెప్టెన్‌ శాంసన్‌ (68*: 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), రియాన్‌ పరాగ్‌ (76: 48 బంతుల్లో 5 సిక్స్‌లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించారు. 42 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌ను.. వీరిద్దరూ దూకుడుగా ఆడి మూడో వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హెట్‌మయర్‌ (13*) పరుగులు చేశాడు. గుజరాత్‌ బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ తలో వికెట్‌ తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని