IND vs PAK: భారత బౌలర్ల అద్భుతం.. కుప్పకూలిన పాకిస్థాన్‌.. భారత్‌ లక్ష్యం 192

కీలకమైన మ్యాచ్‌లో భారత బౌలింగ్‌ విభాగం అదరగొట్టింది. పాకిస్థాన్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేసి పట్టుబిగించేలా చేసింది. అహ్మదాబాద్‌ వేదికగా (IND vs PAK) జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్ల దెబ్బకు పాక్‌ 191 పరుగులకే ఆలౌటైంది. 

Updated : 14 Oct 2023 17:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతం చేశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను 191 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఆ జట్టులో బాబర్ అజామ్ (50) అర్ధశతకం సాధించగా.. మహమ్మద్ రిజ్వాన్ (49), అబ్దుల్లా షఫిఖ్‌ (20), ఇమామ్‌ ఉల్ హక్ (36) మాత్రమే కాస్త పరుగులు సాధించారు. మిగతా వారిలో సౌద్‌ షకీల్ (6), ఇఫ్తికార్ అహ్మద్ (4), షాదాబ్‌ ఖాన్ (2) ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్‌దీప్‌ యాదవ్, హార్దిక్‌, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

వారిద్దరు కాసేపే.. 

తొలి వికెట్‌కు అబ్దుల్లా-ఇమామ్‌ 41 పరుగులు జోడించి శుభారంభం అందించారు. వీరి జోడీని సిరాజ్‌ విడగొట్టాడు. ఆ తర్వాత కాసేపటికి ఇమామ్‌ను అద్భుతమైన డెలివరీతో హార్దిక్‌ బోల్తా కొట్టించాడు. అయితే, భారత్‌పై మంచి రికార్డు ఉన్న పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ - రిజ్వాన్ క్రీజ్‌లోకి పాతుకుపోయేందుకు ప్రయత్నించారు. మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. దీంతో 29 ఓవర్లలో పాక్‌ 150/2తో స్కోరు నిలిచింది. ప్రమాదకరంగా మారుతున్న వీరిని మళ్లీ సిరాజే దెబ్బ కొట్టాడు. అర్ధశతకం పూర్తి చేసిన బాబర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

154/2 నుంచి 191/10

బాబర్‌ అజామ్‌ను ఔట్‌ చేసిన తర్వాత భారత బౌలర్లు మరింత చెలరేగిపోయారు. ఒకే ఓవర్‌లో షకీల్, ఇఫ్తికార్‌ను కుల్‌దీప్‌ పెవిలియన్‌కు పంపారు. తొలుత షకీల్‌ను ఎల్బీ రూపంలో.. ఆ తర్వాత ఇఫ్తికార్‌ను కుల్‌దీప్‌ బౌల్డ్‌ చేశాడు. మరికాసేపటికే కీలకమైన రిజ్వాన్‌ను, షాదాబ్‌ ఖాన్‌ను తన వరుస ఓవర్లలో బుమ్రా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. కేవలం ఐదు ఓవర్ల వ్యవధిలో ఐదు వికెట్లను పాక్‌ కోల్పోయింది. తర్వాత హార్దిక్‌ వేసిన 40 ఓవర్‌లో మహ్మద్‌ నవాజ్ (4) బుమ్రాకు క్యాచ్‌ ఇచ్చాడు. చివరి రెండు వికెట్లు జడేజాకు దక్కాయి. హసన్ అలీ (12) గిల్‌కు చిక్కగా.. హారిస్ రవూఫ్‌ (2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో పాక్‌ ఆలౌటైంది. ఒకదశలో 29.3 ఓవర్లకు 154/2 స్కోరుతో మెరుగైన స్థితిలో నిలిచిన పాక్‌.. 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. కేవలం 37 పరుగుల వ్యవధిలో చివరి ఎనిమిది వికెట్లను భారత బౌలర్లు పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని