IND vs PAK: బయట ఏం జరుగుతుందో తెలియదు.. పట్టించుకోను.. సన్నద్ధతపైనే నా దృష్టి: బుమ్రా

కీలకమైన మ్యాచ్‌కు భారత్ సిద్ధమవుతోంది. అహ్మదాబాద్‌ వేదికగా శనివారం పాక్‌తో (IND vs PAK) మ్యాచ్‌ ఆడనుంది. ఈ క్రమంలో బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Updated : 13 Oct 2023 15:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అహ్మదాబాద్‌ వేదికగా భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ శనివారం జరగనుంది. ఆటగాళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇరు జట్లూ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టేశాయి. ఏ మ్యాచ్‌కు ముందు అయినా సరే బయట ఏం జరుగుతుందనేది తెలియదని, అసలు వాటి గురించి పట్టించుకోబోమని భారత స్పీడ్‌ బౌలర్ బుమ్రా వ్యాఖ్యానించాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానెల్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో టీమ్‌ఇండియా మాజీ కోచ్ సంజయ్‌ బంగర్‌తో బుమ్రా సంభాషించాడు.

‘‘నా సన్నద్ధత ఎలా ఉందనేదానిపై దృష్టిసారిస్తా. పిచ్‌ను సరిగ్గా అంచనా వేసి దానికి తగ్గట్టుగా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అదే నేను పాటించే సింపుల్‌ సూత్రం. కేవలం ఫలితాల గురించి మాత్రమే ఆలోచించను. నా నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తా. కొన్నిసార్లు బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అలాంటప్పుడు లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్‌ చేయాల్సి ఉంటుంది. అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌లో దానికే కట్టుబడి ఉన్నా. దిల్లీ పిచ్‌ బ్యాటింగ్‌కు సహకారం ఇస్తుంది. అయితే, కాస్త స్వింగ్‌ రావడంతో దానిని ఉపయోగించుకొని వికెట్లను తీయగలిగాం. అందుకే కచ్చితమైన లెంగ్త్‌తోనే బౌలింగ్‌ చేయాలని ఆరంభం నుంచే నిర్ణయించుకుని అమలు చేశాం’’

‘‘ఇక పాకిస్థాన్‌తో కీలకమైన పోరుకు సిద్ధమవుతున్నాం. బయట ఏం జరుగుతుందనేది తెలియదు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని అసలు పట్టించుకోను. మ్యాచ్‌పై దృష్టిపెట్టి నా శక్తిసామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు శ్రమిస్తా.  మ్యాచ్‌లో విజయం సాధించడమే మా తొలి ప్రాధాన్యం’’ అని బుమ్రా తెలిపాడు. ఈ వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు భారత్‌ ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్‌పై రెండు వికెట్లు తీసిన బుమ్రా.. అఫ్గాన్‌పై నాలుగు వికెట్లు తీసి తన సత్తా చాటాడు. ఇక పాక్‌తో మ్యాచ్‌లో బుమ్రా ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు