Jayawardene - Rohit: రోహిత్‌ ఫామ్‌ గురించి ఆందోళన చెందట్లేదు: జయవర్దెనె

ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌ గురించి ఆందోళన చెందట్లేదని ఆ జట్టు కోచ్‌ మహేలా జయవర్దెనె వెల్లడించాడు. సమయం వస్తే అతడే చెలరేగుతాడని చెప్పాడు...

Updated : 14 Apr 2022 17:19 IST

                                           (Rohit Instagram Photo)

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌ గురించి ఆందోళన చెందట్లేదని ఆ జట్టు కోచ్‌ మహేలా జయవర్దెనె వెల్లడించాడు. సమయం వస్తే అతడే చెలరేగుతాడని చెప్పాడు. ఈ సీజన్‌లో హిట్‌మ్యాన్‌ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి 21.60 సగటుతో కేవలం 108 పరుగులే చేశాడు. దీంతో అతడు భారీ ఇన్నింగ్స్‌ ఆడలేక ఇబ్బందులు పడుతున్నాడు. గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 28 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలోనే అతడి బ్యాటింగ్‌ తీరుపై స్పందించిన జయవర్దెనె సమయం వస్తే హిట్‌మ్యాన్‌ భారీ ఇన్నింగ్స్‌లు ఆడతాడని అభిప్రాయపడ్డాడు.

‘ఇదివరకు రోహిత్‌ 14-15 ఓవర్ల దాకా ఆడి పెద్ద స్కోర్లు సాధించడం మనం చూశాం. అతడో నాణ్యమైన, అత్యుత్తమ ఆటగాడు. అతడి ఫామ్‌ గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదు’ అని పేర్కొన్నాడు. అనంతరం సూర్యకుమార్‌ను ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో పంపించడంపై మాట్లాడుతూ.. ‘పంజాబ్‌తో పోరులో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ ఉండటంతో మేం ప్రయోగాలు చేద్దామనుకున్నాం. ఈ గేమ్‌లో ఎలాగైనా గెలవాలనే ప్రణాళికతో బరిలోకి దిగాం. సూర్యను ఫినిషర్‌గా పంపిస్తే బాగుంటుందని భావించి ఆ నిర్ణయం తీసుకున్నాం. అతడికి మించిన మేటి ఫినిషర్‌ లేడు. పవర్‌ప్లేలోనే రెండు వికెట్లు పడిపోయిన పరిస్థితుల్లో సూర్యను బ్యాటింగ్‌కు పంపిస్తే ప్రత్యర్థులు బంతిని స్వింగ్‌ చేసి ఇబ్బందులు పెడతారనే నేను తనని నాలుగో స్థానంలో పంపలేదు. మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లాలనుకున్నాం. అందుకే అతడిని ఐదో స్థానంలో పంపించాం’ అని జయవర్దెనె చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని