Cricket: అత్యంత చెత్త బంతికి వికెట్‌.. క్రికెట్‌ చరిత్రలో తొలిసారేమో!

క్రికెట్‌లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. సోషల్‌ మీడియా వచ్చాక విపరీతమైన ట్రోలింగ్‌కు గురి కావడం సహజంగా మారింది. ఇలాంటిదే పాక్‌ దేశీయ క్రికెట్‌లో చోటు చేసుకుంది. ఇప్పుడది నెటిజన్ల ట్రోలింగ్‌కు గురి కావడం విశేషం.

Updated : 30 Mar 2023 16:27 IST

ఇంటర్నెట్ డెస్క్: బ్యాటర్‌ను ఔట్‌ చేయడానికి బౌలర్‌ యత్నిస్తాడు. ఒక వేళ అద్భుతమైన బంతితో క్లీన్‌బౌల్డ్‌ చేయొచ్చు లేదా ఎల్బీగా వికెట్ల ముందు అడ్డుకోవచ్చు. బ్యాటర్ భారీ షాట్‌ ఆడి క్యాచ్‌గా పెవిలియన్‌కు చేరొచ్చు. ఇలా ఔట్ కావడం క్రికెట్‌లో సర్వసాధారణమే. కానీ, ఇప్పుడు మీరు చూడబోయే వికెట్ ఇప్పటి వరకు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి అవుతుందేమో. మరి అలా ఔటైన.. ఆ విధంగా అద్భుతమైన చెత్త బంతిని విసిరి మరీ వికెట్‌ పడిన మ్యాచ్‌ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోపై న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు జిమ్మీ నీషమ్ స్పందించడం విశేషం. క్రికెట్‌ చరిత్రలో చట్టబద్ధంగా ఇలాంటి చెత్తబంతికి వికెట్‌ రావడం అద్భుతమని ట్వీట్‌ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌ జరిగింది ఇప్పుడు కాదు సుమా.. నాలుగేళ్ల కిందట జరిగిన ఈ వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది. జాతీయ టీ20 కప్‌ సందర్భంగా పాకిస్థాన్‌ ఆటగాడు మహమ్మద్ ఇలియాస్‌ అత్యంత చెత్త బంతికి వికెట్‌ తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

బ్యాటర్ జియాన్ అబ్బాస్ ఆడుతుండగా ఇలియాస్ లెగ్‌సైడ్‌ భారీ వైడ్‌ వేశాడు. అయితే అబ్బాస్‌ మాత్రం ఆ బంతిని వెంటాడి మరీ కీపర్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ కావడం విచిత్రం. కీపర్ ఏమాత్రం తడబాటుకు గురి కాకుండా క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. దీంతో నెటిజన్లు సదరు బ్యాటర్‌ను కామెంట్లతో ట్రోల్‌ చేశారు. ఇలాంటి చెత్త బంతికి కూడా ఔట్‌ కావడం అత్యంత దారుణమని వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని