Eoin Morgan: ధోనీ, మోర్గాన్‌ కెప్టెన్సీలో పెద్ద తేడా లేదు: మొయిన్‌ అలీ

ఇంగ్లాండ్‌ వన్డే ప్రపంచకప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అందరిచేతా ప్రశంసలు పొందుతున్నాడు...

Published : 01 Jul 2022 02:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ వన్డే ప్రపంచకప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆయన ఆటతీరును గుర్తు తెచ్చుకుంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.  తాజాగా ఆ జట్టు ఆటగాడు మొయిన్‌ అలీ సైతం మోర్గాన్‌ నాయకత్వాన్ని మెచ్చుకున్నాడు. టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ కెప్టెన్సీకి, అతడి కెప్టెన్సీకి పెద్ద తేడా లేదని చెప్పాడు. భారత టీ20 లీగ్‌లో చెన్నై తరఫున ఆడే మొయిన్‌ అలీ తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘నేను ఇద్దరి సారథులతో ఆడాను. కెప్టెన్సీలో ఇద్దరి మధ్య పెద్ద తేడాలేం లేవు. ఇద్దరూ ప్రశాంతంగా ఉంటూనే ఆటగాళ్లకు పూర్తి సహకారం అందిస్తారు. వారిద్దరు గొప్ప నాయకులు, గొప్ప ఆటగాళ్లు. అలాగే మోర్గాన్‌ ఇంగ్లాండ్‌ జట్టును చీకటిలో నుంచి వెలుతురులోకి తెచ్చాడు. ఇంతకుముందు ఇంగ్లాండ్‌ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బాగా ఆడేదికాదు. దాంతో మోర్గాన్‌ ఆటగాళ్ల ఆలోచనా దృక్పథాన్ని మార్చేశాడు. మరోవైపు మేం ఇప్పుడు టెస్టు క్రికెట్‌ ఆడే విధానం కూడా మారిపోయింది. అది కూడా అతడి వల్లే సాధ్యమైంది. మనకు స్పష్టమైన ఆలోచనా విధానం ఉంటే భయంలేని క్రికెట్‌ ఆడొచ్చని తెలియజేశాడు. ఇంతకుముందెన్నడూ ఇంగ్లాండ్‌ టీమ్‌ ఇలాంటి గొప్ప సారథిని చూడలేదు’ అని మొయిన్‌ అలీ చెప్పుకొచ్చాడు.

కాగా, మోర్గాన్‌ తొలుత 2006 నుంచి 2009 వరకు ఐర్లాండ్‌ తరఫున ఆడగా.. తర్వాత ఇంగ్లాండ్‌ జట్టుకు మారిపోయాడు. అక్కడ గొప్ప ఆటగాడిగా తయారై.. అనంతరం ఇంగ్లాండ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీంతో ఆ జట్టు ఆటతీరునే మార్చేశాడు. తన సారథ్యంలో ఇంగ్లాండ్‌ 2019 వన్డే ప్రపంచకప్‌ గెలవడమే కాకుండా 2016 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు వెళ్లింది. అలాగే 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో సెమీఫైనల్స్‌కు చేరింది. మరోవైపు గతేడాది జరిగిన 2021 టీ20 ప్రపంచకప్‌లోనూ సెమీఫైనల్స్‌ వరకు వెళ్లింది. అయితే, మోర్గాన్‌ కొంతకాలంగా బ్యాట్స్‌మన్‌గా సరిగ్గా ఆడలేక విఫలమవుతున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని