Bumrah: పాక్‌తో మ్యాచ్‌కు ముందు మా అమ్మను కలుస్తా: బుమ్రా

బుమ్రా సొంత మైదానం అహ్మదాబాద్‌లో భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ జరగనుంది. అయితే అంతకుముందే తన తల్లిని చూసేందుకు వెళ్తానని స్టార్‌ పేసర్ పేర్కొన్నాడు.

Published : 12 Oct 2023 14:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శనివారం భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. దాదాపు 1,32,000 మంది ప్రేక్షకకులు ప్రత్యక్షంగా చూస్తారని అంచనా. ఇప్పటికే టీమ్ఇండియా, పాక్‌ జట్లు అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి. ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. వరుసగా రెండేసి విజయాలతో కొనసాగుతున్న ఇరు టీమ్‌లు హ్యాట్రిక్‌పై కన్నేశాయి. సొంత మైదానంలో భారత పేసర్ బుమ్రా కీలకంగా మారతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్‌కు రావడంపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్‌తో మ్యాచ్‌ కంటే ముందు తన తల్లిని చూసేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తానని బుమ్రా పేర్కొన్నాడు. 

‘‘కొన్ని రోజులుగా అమ్మకు దూరంగా ఉన్నా. ఇప్పుడు మళ్లీ అమ్మను చూసేందుకు అహ్మదాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ కంటే ముందు  అమ్మను చూసేందుకు వెళ్లొస్తా. ఇదే నేను ఇవ్వాల్సిన తొలి ప్రాధాన్య అంశం. అహ్మదాబాద్‌లో నేను వన్డే మ్యాచ్‌ ఆడలేదు. కానీ, టెస్టు ఆడిన అనుభవం ఉంది. మ్యాచ్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. భారీ సంఖ్యలో క్రికెట్‌ అభిమానులు వస్తారు. తప్పకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా’’ అని బుమ్రా తెలిపాడు. బుమ్రా ఐదు ఏళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి అతడి తల్లి దల్జీత్‌ పెంచి క్రికెటర్‌గా తీర్చిదిద్దారు.

ఆ సంబరం వెనుక.. 

అఫ్గాన్‌ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్‌ను ఔట్ చేసిన తర్వాత బుమ్రా తన చూపుడు వేలిని కణత మీద పెట్టి సంబరాలు చేసుకున్నాడు. ఫుట్‌బాల్‌ క్లబ్‌ మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్‌ అయిన బుమ్రా ఆ క్లబ్‌ స్ట్రైకర్‌ మార్కస్ రష్‌ఫోర్డ్‌ మాదిరిగా చేసినట్లు అభిమానులు భావించారు. అయితే అలాంటిదేమీ లేదని, ఆ సమయంలో అలా చేయాలని అనిపించిందని బుమ్రా వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని