IND vs PAK: భారత్ X పాక్‌ మ్యాచ్‌.. ఇది ఐసీసీ ఈవెంట్‌లా మాత్రం లేదు: మికీ ఆర్థర్

నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌- పాక్‌ (IND vs PAK) మెగా పోరును వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. టీమ్‌ఇండియాకు మద్దతుగా దాదాపు లక్షకుపైగా ఫ్యాన్స్‌ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో పాక్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌ మ్యాచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Updated : 15 Oct 2023 10:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచకప్‌లోని (ODI World Cup 2023) హైఓల్టేజీ మ్యాచ్‌లో భారత్ విజయ కేతనం ఎగరవేసింది. పాక్‌ను చిత్తు చేసి (IND vs PAK) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. తొలుత భారత బౌలర్లు.. ఆ తర్వాత బ్యాటర్లు విజృంభించడంతో పాక్‌ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. దాదాపు 1.10లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించిన ఈ మ్యాచ్‌ సరికొత్త రికార్డులనూ సృష్టించింది. దాదాపు 99 శాతం అభిమానులు బ్లూ జెర్సీలతోనే కనిపించారు. ఈ క్రమంలో మ్యాచ్‌లో ఓటమి అనంతరం పాక్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌ను చూస్తుంటే ఐసీసీ ఈవెంట్‌ జరిగినట్లు లేదని.. బీసీసీఐ ఈవెంట్‌ వాతావరణం కనిపించిందని వ్యాఖ్యానించాడు. 

‘‘ఇది ఐసీసీ ఈవెంట్‌లా నాకు అనిపించలేదు. బీసీసీఐ కార్యక్రమం మాదిరిగానే ఉంది. ఇలా చెప్పలేదంటే నేను అబద్దం ఆడినట్లే. ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడినట్లు ఉంది. మ్యాచ్‌ సందర్భంగా ఒక్కసారి కూడా పాకిస్థాన్‌ జట్టుకు అనుకూలంగా మద్దతు లభించలేదు. కనీసం ఒక్కసారి కూడా ‘దిల్ దిల్ పాకిస్థాన్‌’ మ్యూజిక్‌ను విన్నట్టు కూడా లేదు. ఇది కూడా మా జట్టు ఓటమికి ఓ కారణం కావచ్చు. కానీ, అదే కీలకమైందని మాత్రం చెప్పను. ఎందుకంటే మా ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాం. మా ఆటగాళ్ల ప్రదర్శన తీవ్ర నిరుత్సాహపరిచింది. ఇంకాస్త దూకుడుగా ఆడితే బాగుండేది. అయితే, తర్వాతి మ్యాచులకు మళ్లీ సిద్ధమై విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని ఆర్థర్ తెలిపాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో భారత త్రివర్ణ పతాకాలు సగర్వంగా రెపరెపలాడాయి. పాకిస్థాన్‌ వికెట్లు పడ్డప్పుడు.. మన బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు బాదినప్పుడు స్టేడియం హోరెత్తింది. ‘భారత్‌ మాతా కీ జై’, ‘ఇండియా ఇండియా’ అనే నినాదాలతో మార్మోగింది.

కుల్‌దీప్‌ను ఎదుర్కొనేందుకు మీ ప్రణాళికలు ఏంటి?: వసీమ్‌

ఇది ఐసీసీ ఈవెంట్‌లా లేదు.. ద్వైపాక్షిక సిరీస్‌లా ఉందని వ్యాఖ్యానించిన పాక్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌పై పాక్‌ మాజీ పేసర్ వసీమ్‌ అక్రమ్ విమర్శలు గుప్పించాడు. ‘‘అతడు ఎందుకు ఇలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడో అర్థం కాలేదు. కుల్‌దీప్‌ లేదా ఇతర భారత బౌలర్ల బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మీ వద్ద ప్రణాళికలు ఏంటి? అదే మేం వినాలనుకుంటాం. అంతేకానీ, చెత్త విషయాలను కాదు. ఒకవేళ మీరు చెప్పలేకపోతే ఇక్కడుండటం అనవసరం. గెలుపోటములు సహజమే. కానీ, ఎందుకు ఓడిపోయామనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత సరిదిద్దుకోవాలి’’ అని అక్రమ్‌ వ్యాఖ్యానించాడు. 

వసీమ్‌ వ్యాఖ్యలకు మద్దతుగా మరో మాజీ ఆటగాడు మొయిన్‌ ఖాన్‌ స్పందించాడు. ‘‘అతడు (మికీ) ఈ ఓటమిని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. భావోద్వేగ వ్యాఖ్యలు చేయడం వల్ల సానుభూతి పొందాలని చూస్తున్నట్లుంది. అతడు తన కోచింగ్‌ వృత్తిపై దృష్టిసారిస్తే బాగుంటుంది. అతడు చెప్పింది నిజమే కావచ్చు. కానీ, కోచ్‌గా ఇలాంటి విషయాలపై మాట్లాడకూడదు’’ అని మొయిన్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని