Rachin Ravindra: ప్రపంచకప్‌లో సచిన్‌ రికార్డును బ్రేక్ చేసిన రచిన్ రవీంద్ర

ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర (Rachin Ravindra) సూపర్‌ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై శతకాలు బాదిన రచిన్.. తాజాగా పాకిస్థాన్‌పై కూడా సెంచరీ చేశాడు.

Published : 04 Nov 2023 22:00 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర (Rachin Ravindra) సూపర్‌ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై శతకాలు బాదిన రచిన్.. తాజాగా పాకిస్థాన్‌పై కూడా సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో (108; 94 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్‌) శతకం చేయడం ద్వారా పలు రికార్డులు నమోదు చేశాడు.  

  • ఆడిన మొదటి ప్రపంచకప్‌లోనే అత్యధిక (3) సెంచరీలు బాదిన ఆటగాడిగా రచిన్ రికార్డుల్లోకెక్కాడు. 
  • ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన న్యూజిలాండ్‌ ఆటగాడిగానూ నిలిచాడు. అంతేకాదు వరల్డ్ కప్‌లో కివీస్‌ తరఫున ఎక్కువ శతకాలు చేసింది కూడా రచినే.
  • ప్రపంచకప్‌లో 25 ఏళ్ల వయసు కంటే ముందు ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రచిన్‌ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్ (రెండు సెంచరీలు, 1996)) పేరిట ఉండేది. తాజాగా ఆ రికార్డును రచిన్ బ్రేక్ చేశాడు. 
  • ఒక ప్రపంచకప్‌లో 25 ఏళ్లలోపు అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ (523 పరుగులు, 1996) పేరిట ఉంది. తాజాగా ఆ రికార్డును రచిన్ సమం చేశాడు. ఈ ప్రపంచకప్‌లో కివీస్ లీగ్ దశలో మరో మ్యాచ్‌ ఆడనుండటంతో రచిన్ మరిన్ని పరుగులు చేసే అవకాశముంది.

ఇక, కివీస్, పాక్ మ్యాచ్‌ విషయానికొస్తే.. డక్‌వర్త్ లూయిస్‌ ప్రకారం పాకిస్థాన్‌ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో పాకిస్థాన్ దీటుగా బదులిచ్చింది. 21.3 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత వరుణుడు శాంతించడంతో పాక్‌ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 341కి కుదించి ఆటను కొనసాగించారు. 25.3 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి పాకిస్థాన్‌ 200/1 స్కోరు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాక్‌ 25.3 ఓవర్లకు 179 పరుగులు చేయాలి. ఈ లెక్కన పాకిస్థాన్‌ అప్పటికే 21 పరుగుల ముందంజలో ఉండటంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని