Shaheen - Ravi shastri: ఆసీస్‌తో టెస్టు సిరీస్‌.. పాక్‌ పేసర్‌ షహీన్‌కు అదే అసలైన సమస్య: రవిశాస్త్రి

ఆసీస్‌తో జరుగుతున్న (AUS vs PAK) తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పాక్‌ పేసర్ షహీన్‌ గొప్ప గణాంకాలను నమోదు చేయలేదు. 

Published : 16 Dec 2023 13:40 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో (AUS vs PAK) పాకిస్థాన్‌ స్టార్‌ పేసర్ షహీన్‌ అఫ్రిది (Shahhen Afridi) తొలి ఇన్నింగ్స్‌లో  కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. తొలి ఓవర్‌లోనే 14 పరుగులు సమర్పించాడు. ఆసీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం 27 ఓవర్లు వేసిన షహీన్‌ 96 పరుగులు ఇచ్చాడు. ఇందులో ఏడు మెయిడిన్లు ఉన్నాయి. షహీన్‌కు జోడీగా యువ ఆటగాడు, అరంగేట్ర మీడియం పేసర్‌ ఖుర్రమ్‌ తొలి స్పెల్‌ను వేశాడు. ఆసీస్‌ పిచ్‌లు పేస్‌కు అనుకూలంగా ఉంటాయి. అయితే, సరైన పేస్‌ పార్ట్‌నర్‌ లేకపోవడం వల్ల షహీన్‌పై ఒత్తిడి పెరిగిందని.. అదంతా అతడి బౌలింగ్‌పై ప్రభావం చూపించిందని భారత మాజీ ప్రధాన కోచ్‌, క్రికెట్ వ్యాఖ్యాత రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు.

‘‘షహీన్‌కు ఇదే అసలైన సమస్య అని నేను భావిస్తున్నా. ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఉండే ఒత్తిడిని తట్టుకోవడానికి సరైన భాగస్వామి అవసరం. పాక్‌ పేస్‌ ఎటాక్‌ను షహీన్‌తోపాటు పంచుకోవడానికి మరో స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఒక ఎండ్‌ నుంచి షహీన్‌ బౌలింగ్‌ వేస్తుంటే.. మరో వైపు కూడా అదేస్థాయిలో ఒత్తిడి తెచ్చే పేసర్ ఉండాలి. షహీన్‌ కాకుండా.. 140 కి.మీ వేగంతో బంతులను విసిరే బౌలర్లు ఈ టెస్టులో పాక్‌కు లేరు. దీంతో షహీన్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. దాని ప్రభావం స్పష్టంగా అతడి బౌలింగ్‌ ప్రదర్శనపై పడింది’’ అని రవిశాస్త్రి తెలిపాడు. ఆసీస్‌-పాక్‌ తొలి టెస్టుకు రవిశాస్త్రి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఆసీస్‌- పాకిస్థాన్‌ తొలి టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆట కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 487 పరుగులు చేయగా.. పాక్‌ మాత్రం 271 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఇమామ్‌ ఉల్‌ హక్‌ (69) అర్ధశతకం సాధించాడు. అబ్దుల్లా షఫీక్‌ (42), షాన్‌ మసూద్ (30), బాబర్‌ అజామ్ (21), సౌద్ షకీల్ (28), అఘా సల్మాన్‌ (28) పెద్దగా రాణించలేదు. ఆసీస్‌ బౌలర్లు నాథన్‌ లైయన్ 3, మిచెల్‌ స్టార్క్‌ 2, ప్యాట్ కమిన్స్ 2.. మిచెల్‌ మార్ష్‌, హేజిల్‌వుడ్, ట్రావిస్‌ హెడ్‌ తలో వికెట్‌ తీశారు. ప్రస్తుతం ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ హీరో డేవిడ్‌ వార్నర్‌ ఈసారి మాత్రం డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని