WI vs IND: అలా చేసినా నష్టం లేదు.. ఇక్కడెవరికీ గర్వం లేదు: జడేజా

భారత జట్టులో (Team India) ప్రయోగాలపై సర్వత్రా ఆందోళన నెలకొన్న వేళ.. స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే కపిల్‌ దేవ్ చేసిన ‘ఆటగాళ్లలో గర్వం’ వ్యాఖ్యలపైనా జడ్డూ స్పందించాడు.

Updated : 01 Aug 2023 12:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ (WI vs IND) విజేతను తేల్చే కీలక పోరుకు టీమ్‌ఇండియా (Team India) సిద్ధమైంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం..) మ్యాచ్‌ జరగనుంది. గత రెండు వన్డేల్లో బ్యాటింగ్‌ విభాగంలో ప్రయోగాలు చేసిన భారత్ మిశ్రమ ఫలితాలను సాధించింది. తొలి వన్డేలో శ్రమించి విజయం సాధించగా.. రెండో వన్డేలో బొక్కబోర్లా పడింది. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) లేకుండానే రెండో వన్డేలో భారత్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌ ఆర్డర్‌లోనూ భారీగా మార్పులు చేసింది. తాజాగా ఇదే అంశంపై టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పందించాడు. ఇలాంటి మార్పులు చేయడం వల్ల పెద్దగా నష్టం ఉండదని పేర్కొన్నాడు. అదే విధంగా క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ చేసిన ఆటగాళ్లలో ‘గర్వం’ వ్యాఖ్యలపైనా స్పందించాడు. 

హెచ్‌సీఏ పెద్దలకు షాక్‌.. 57 క్లబ్‌లపై వేటు

‘‘ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ముందు మేం ఆడే చివరి వన్డే సిరీస్‌ ఇదే. దీనిని ప్రయోగాలకు వేదికగా చేసుకోవాల్సి వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో మార్పులు చేశాం. మెగా టోర్నీల్లో ఎక్కువగా ప్రయోగాలు చేసే ఆస్కారం ఉండదు. అలా చేయలేం. రెండో వన్డేలో సీనియర్లు ఇద్దరు లేకుండానే బరిలోకి దిగాం. ఫలితం ఎలా ఉన్నా.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసేందుకు ప్రయత్నించాం. అయితే, ఈ కారణంగా మ్యాచ్‌ ఓడిపోయినా నష్టం ఏమీ ఉండదు. మెగా టోర్నీల్లో ఎలాంటి కాంబినేషన్‌తో వెళ్లాలనే దానిపై ఓ అవగాహన వస్తుంది. ఈ విషయంలో ఏం చేయాలనేది మేనేజ్‌మెంట్, కెప్టెన్‌కు తెలుసు. కాబట్టి, ఎలాంటి గందరగోళం లేదు. ఆటగాడిగా ప్రతి మ్యాచ్‌ ఆడాలని నాకూ ఉంటుంది. అయితే, జట్టు అవసరాలనుబట్టి కొత్త ప్లేయర్‌ను తీసుకోవాలని అనుకుంటే.. దానిని అమలు చేయడానికి సిద్ధంగా ఉంటా. 

బుమ్రా వచ్చేశాడు.. ఐర్లాండ్‌తో టీ20లకు సారథ్యం

వెస్టిండీస్‌ జట్టులో ఎక్కువ మంది యువ క్రికెటర్లు ఉన్నారు. నిరంతరం నేర్చుకుంటూ మెరుగవుతున్నారు. ఎక్కువగా ఆడుతూ ఉంటే మరింత నాణ్యమైన జట్టుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. వారిలో అద్భుతమైన నైపుణ్యం ఉంది. టీమ్‌ఇండియా నుంచి తప్పకుండా మరిన్ని విషయాలను నేర్చుకుంటారు. మంచి భవిష్యత్తు ఉంది. టీమ్‌ఇండియాలోని ప్రతి ఆటగాడు చాలా శ్రమిస్తాడు. ఎవరూ కూడా సునాయాసంగా అవకాశం వచ్చిందని భావించరు. వందశాతం కష్టపడతారు. అయితే,  ఓడిపోయినప్పుడే వారి ప్రదర్శనపై ప్రశ్నలు వస్తాయి. ఇక కపిల్ దేవ్‌ ఎప్పుడు మాట్లాడారో నాకు తెలియదు. అయితే, క్రికెట్ దిగ్గజం తన అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంది. అయితే జట్టులో ఎవరికీ గర్వం లేదని మాత్రం చెప్పగలను’’ అని జడేజా తెలిపాడు. వన్డేల్లో 200 వికెట్ల మైలురాయి చేరుకునేందుకు జడేజాకు ఆరు వికెట్లు అవసరం. అలాగే కపిల్‌ తర్వాత వన్డేల్లో 2000 పరుగులతో పాటు 200 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా జడేజా నిలుస్తాడు. ప్రస్తుతం 176 వన్డేల్లో 2,552 పరుగులు, 194 వికెట్లతో కొనసాగుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని