IND vs PAK: దాయాదుల పోరులో అదే తేడా.. రోహిత్ ముందు పాక్‌ గేమ్‌ ప్లాన్‌ ఫట్‌: మాజీ సెలెక్టర్‌

టీమ్‌ఇండియా విజయం సాధించడానికి.. పాక్‌ చిత్తుగా ఓడిపోవడానికి గల కారణాలను భారత మాజీ సెలెక్టర్‌ సబా కరీమ్‌ తనదైన శైలిలో విశ్లేషించారు. రోహిత్ నాయకత్వం అద్భుతంగా ఉందని కొనియాడారు.

Published : 15 Oct 2023 14:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) పాకిస్థాన్‌పై అన్ని విభాగాల్లో రాణించి భారత్‌ (IND vs PAK) సూపర్ విక్టరీ సాధించింది. రోహిత్ నాయకత్వంలోని భారత్ గేమ్‌ ప్లాన్‌కు పాకిస్థాన్‌ జట్టు బోల్తా పడిందని మాజీ సెలెక్టర్, మాజీ ఆటగాడు సబా కరీం వ్యాఖ్యానించాడు. రోహిత్‌ ఎదుట పాకిస్థాన్‌ ప్రణాళికలు పారలేదని పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడి ఉండే ఇలాంటి మ్యాచుల్లో దానిని అధిగమించి విజయం సాధించడం ఎవరికైనా కష్టమేనని తెలిపాడు. భారత్‌ మాత్రం అలవోకగా పాక్‌ను చిత్తు చేసిందని చెప్పాడు.

‘‘భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటేనే హై ఓల్టేజీ గేమ్‌ అని అందరికీ తెలుసు. మ్యాచ్‌ను వీక్షించే అభిమానుల్లోనే భారీగా ఉత్కంఠ ఉంటుంది. అలాంటిది మైదానంలో బరిలోకి దిగే ఆటగాళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి మ్యాచ్‌లో ఎవరు ఒత్తిడిని తట్టుకొని రాణించగలరో వారిదే విజయం. ఈ లాజిక్‌ను భారత్‌ ఒడిసిపట్టింది. టీమ్‌ఇండియాలోని అన్ని విభాగాలు సమతూకంగా ఉండటం కూడా కలిసొచ్చింది. ఇక పాక్‌ జట్టులో ఇలాంటి దూకుడైన ఆటతీరు కనిపించలేదు. సరైన గేమ్‌ ప్లాన్‌ లేకుండానే బరిలోకి దిగింది. ఓ పక్క రోహిత్ శర్మ తన నాయకత్వ పదునుతో భారత్‌ను అద్భుతంగా నడిపించాడు. 

Team India: పాక్‌ను ఒత్తిడికి గురిచేసి.. ఉచ్చులోకి లాగిందిలా..!

భారత బౌలర్లు ఎటాకింగ్‌ బౌలింగ్‌తో ప్రారంభించారు. కాసేపు పాక్‌ ఓపెనర్లు అడ్డుకోగలిగారని అనిపించినా.. రోహిత్ బౌలింగ్‌ మార్పులు చేస్తుండటంతో పాక్‌ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. ఎప్పుడు వికెట్‌ అవసరమైతే అప్పుడు తీసి తమ జట్టుకు భారత బౌలర్లు బ్రేక్ అందించారు. బాబర్‌ అజామ్‌, రిజ్వాన్‌ను ఔట్‌ చేయడంతో మ్యాచ్‌పై పట్టు సాధించారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. సిరాజ్‌, బుమ్రాను వినియోగించిన తీరు అద్భుతం. పాక్‌ను 50 ఓవర్లపాటు ఆడించకుండా ఉండాలనేదే రోహిత్ లక్ష్యం. అందులో విజయవంతమయ్యాడు. ఆ తర్వాత పాక్‌ బౌలర్లపై రోహిత్‌ ఎదురు దాడి చేశాడు. ఓ పక్క తక్కువ లక్ష్యం కావడంతో పాక్‌ బౌలర్లు కూడా పెద్దగా ప్రతిఘటన చేయలేకపోయారు. 

ఈసారి వరల్డ్‌ కప్‌లో భారత్‌కు అద్భుతమైన ఆరంభం దక్కింది. కేఎల్, శ్రేయస్, బుమ్రా గాయాల నుంచి కోలుకుని వచ్చి కీలక పాత్ర పోషించడం కూడా కలిసొచ్చే అంశం. ప్రపంచకప్‌ సన్నద్ధత కూడా బాగా చేసుకుంది. ఇలాగే తమ బలాలను మెరుగుపర్చుకుంటూ టోర్నీలోని మిగతా మ్యాచుల్లోనూ గెలవాలి. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికాతో సవాల్‌ ఉంటుంది. అయితే, ఇలాంటి వాటిని భారత్ అధిగమిస్తుందని భావిస్తున్నా’’ అని సబా కరీమ్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని