Ruturaj - Utkarsha: సీఎస్‌కే అభిమానుల కోసం రుతురాజ్‌ దంపతుల స్పెషల్‌ సర్‌ప్రైజ్!

కొత్తగా పెళ్లైన రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) చేసిన ఓ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదీ సీఎస్‌కే, చెన్నై నగర అభిమానుల కోసం ప్రత్యేకంగా పోస్టు పెట్టాడు.

Published : 13 Jun 2023 16:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) యువ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) పది రోజుల కిందట వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. ఐపీఎల్‌ 2023 సీజన్‌ విజేతగా నిలిచిన సీఎస్‌కే జట్టులో కీలక పాత్ర పోషించిన రుతురాజ్‌ జూన్ 3న  తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో సీఎస్‌కే అభిమానుల కోసం రుతురాజ్‌ దంపతులు తీసుకున్న నిర్ణయంపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వచ్చాయి. 

‘‘ఉత్కర్ష నా జీవితంలోకి అడుగు పెట్టింది. ఇప్పటి నుంచి మళ్లీ కొత్త జీవితం ప్రారంభం కానుంది. నా లైఫ్‌లో ఇదే అత్యంత ముఖ్యమైనది. ఈ క్రమంలో ఉత్కర్ష ఓ నిర్ణయం తీసుకుంది. నా జీవితంలో కీలకంగా మారిన చెన్నై నగరం, సీఎస్‌కే అభిమానుల కోసం... మహారాష్ట్ర సంప్రదాయంలో జరిగిన వేడుకలను చెన్నై ప్రజలకు, దక్షిణాది సంస్కృతికి అంకితం చేయాలని నిర్ణయించుకుంది. నిజంగా ఇది ఎంతో ప్రత్యేకమైంది. ఐ లవ్‌యూ ఉత్కర్ష’’ అని శుభకార్యానికి సంబంధించిన ఫొటోలతోపాటు క్యాప్షన్‌ను జోడించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. రుతురాజ్‌ షేర్‌ చేసిన పోస్టుకు స్వల్ప వ్యవధిలోనే 13 లక్షలకుపైగా లైకులు వచ్చాయి. 

ఉత్కర్ష పవార్‌ కూడా మహారాష్ట్ర తరఫున క్రికెట్‌ ఆడింది. అయితే, ఉన్నత చదువుల కోసం క్రికెట్‌కు విరామం తీసుకొంది. ఇక రుతురాజ్‌ గైక్వాడ్‌ నిలకడగా ఆడుతూ చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో 590 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధశతకాలు కూడా ఉన్నాయి. గుజరాత్‌పై తొలి లీగ్‌ మ్యాచ్‌లోనే 92 పరుగులు చేసి అదరగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని