Team India: ఆ పర్యటనకు ఇప్పట్నుంచే సన్నద్ధత అవసరం: సునీల్ గావస్కర్

విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు నేరుగా ప్రధాన జట్టుతో కాకుండా.. ఆ దేశ పిచ్‌లపై ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడితే బాగుంటుందని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్ వ్యాఖ్యానించాడు.

Updated : 06 Jan 2024 14:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియాతో భారత్‌ (AUS vs IND) టెస్టు సిరీస్‌ ఆడనుంది. అక్కడికి వెళ్లాక ఫస్ట్‌క్లాస్‌ టెస్టు మ్యాచ్‌లు లేదా వార్మప్‌ మ్యాచ్‌లు ఆడితే మంచిదని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మరోసారి సూచించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో సెంచూరియన్ టెస్టులో ఓటమి తర్వాత పుంజుకుని కేప్‌ టౌన్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. 

‘‘సెంచూరియన్‌ ఓటమిని సేనా దేశాల్లో పర్యటనలకు ఓ నమూనాగా తీసుకోవాలి. సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఎందుకు ఓడాం? ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయాలపై చర్చించుకోవాలి. ఆ ఓటమి సిరీస్‌పై  ప్రభావం చూపుతుంది. అందుకే, వచ్చేసారి నుంచి ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా ఎక్కువగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాలి. ఈ ఏడాది చివర్లో ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ ఉంది. దాన్ని సొంతం చేసుకోవాలంటే ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లను సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ మధ్య ఆడాల్సి ఉంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవడానికి ఇవన్నీ చాలా కీలకం.

ఆసీస్‌కు వెళ్లాక నేరుగా మ్యాచ్‌లు ఆడితే భారత్‌కు ప్రయోజనం ఉండదు. సెంచూరియన్‌లో ఓటమి తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. అలాంటి మ్యాచుల్లో ఆయా జట్లు ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను పంపిస్తాయని.. మందకొడి పిచ్‌లను సిద్ధం చేస్తారని చెప్పాడు. అది నిజమే అయినప్పటికీ.. వారి దేశంలో మన జట్టు ఆటగాళ్లు లయను అందుకోవడానికైనా ఆ మ్యాచ్‌లు పనికొస్తాయి కదా. కేవలం బ్యాటర్లు పరుగులు చేయడమే కాదు.. బౌలర్లకూ సాధన అవసరం’ అని గావస్కర్ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని