Kohli నన్ను స్లెడ్జింగ్‌ చేయడం సంతోషం

గతేడాది ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ తనను స్లెడ్జింగ్‌ చేయడం సంతోషమేనని సూర్యకుమార్‌ యాదవ్‌ అన్నాడు. బాగా ఆడుతున్నా కాబట్టే అతడలా...

Published : 25 May 2021 22:08 IST

సూర్యకుమార్‌ యాదవ్‌

ముంబయి: గతేడాది ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ తనను స్లెడ్జింగ్‌ చేయడం సంతోషమేనని సూర్యకుమార్‌ యాదవ్‌ అన్నాడు. బాగా ఆడుతున్నా కాబట్టే అతడలా చేశాడని తెలిపాడు. మ్యాచ్‌ ముగిశాక తాము మామూలుగానే మాట్లాడుకున్నామని వివరించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో సూర్యకుమార్‌ మాట్లాడాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ గత సీజన్‌ యూఏఈలో జరిగింది. తటస్థ వేదికలు కావడంతో జట్లన్నీ పోటాపోటీగా ఆడాయి. ముంబయి ఇండియన్స్‌ తిరుగులేని విజయాలు సాధించింది. అబుదాబి వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ మాత్రం ఆసక్తి రేకెత్తించింది. ఆర్‌సీబీ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని రోహిత్‌ సేన ఛేదించింది. అందులో సూర్యకుమార్‌ యాదవ్‌ కీలకంగా ఆడాడు. 43 బంతుల్లో 10 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేశాడు. అతడలాగే ఆడితే విజయం కష్టమని భావించిన కోహ్లీ స్లెడ్జింగ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

‘నన్నేకాదు.. ప్రత్యర్థి జట్టులో ఎవరు బాగా బ్యాటింగ్‌ చేసినా కోహ్లీ అలాగే చేస్తాడు. అతడు స్లెడ్జింగ్‌ చేసినందుకు సంతోషించా. ఎందుకంటే నేను బ్యాటింగ్‌ చేస్తే ముంబయి గెలుస్తుందని విరాట్‌కు తెలుసు. ఒకవేళ నేను ఔటైతే పరుగుల వేగం తగ్గి గెలిచేందుకు వారికి అవకాశాలు రావొచ్చు. పిచ్‌పై నేనెప్పుడూ ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేస్తాను. వివాదాల జోలికి వెళ్లను. అబుదాబిలో మాత్రం కోహ్లీ వైపు చూశా. ఆ మ్యాచ్‌ ముగిశాక అంతా మామూలుగానే ఉన్నాం. విరాట్‌ అందరినీ పలకరించాడు. కాకపోతే మ్యాచులో అలా జరిగిపోయింది. ఎందుకంటే ప్రత్యర్థి జట్టులో కీలక ఆటగాడెవరో అతడికి తెలుసు’ అని సూర్య కుమార్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని