Published : 04 Sep 2021 01:20 IST

Praveen Kumar: గూగుల్‌లో శోధించి.. పారాలింపిక్స్‌లో రజతం ముద్దాడి..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాల్యం నుంచీ ఆటలే ప్రాణంగా పెరిగాడు. వైకల్యం ఉందని తెలిసినా ముందుకే సాగాడు. ఆటల్లో రాణించగలడా తన బడిలో అనుమానించినా పట్టుదల ప్రదర్శించాడు. గూగుల్లో పారాలింపిక్స్‌ గురించి తెలుసుకొని నేడు రజత పతకం పొందాడు. అతడే పారా హైజంపర్‌ ప్రవీణ్‌ కుమార్‌. 18 ఏళ్లకే పతకం ముద్దాడి సరికొత్త ఘనత అందుకున్నాడు.

దిల్లీలోని గౌతమబుద్ధనగర్‌ జిల్లాలోని జెవర్‌ సమీప గ్రామంలో ప్రవీణ్‌ కుమార్‌ జన్మించాడు. అతడి తండ్రి రైతు. వారిది పేద కుటుంబం. చిన్నప్పటి నుంచీ ప్రవీణ్‌కు ఆటలంటే ప్రాణం. వైకల్యం ఉన్నప్పటికీ అందులోనే ఆనందం వెతుక్కొనేవాడు. అలాంటిది ఇప్పుడు టీ64/టీ44 విభాగంలో పురుషుల హైజంప్‌లో 2.07మీ మీటర్లు దూకి ఏకంగా రజతం ముద్దాడాడు.

‘నేను బడికెళ్లే రోజుల్లో ఆటలే ప్రాణంగా బతికాను. కానీ ఈ స్థాయికి వస్తానని మాత్రం ఊహించలేదు. మొదట్లో నేను పాఠశాలలో వాలీబాల్‌ ఆడేవాడిని. ఆ తర్వాత పారా అథ్లెటిక్స్‌ గురించి తెలుసుకొని హై జంప్‌ ఎంచుకున్నాను. నిజానికి గూగుల్‌లో శోధించిన తర్వాతే పారాలింపిక్స్‌ గురించి తెలుసుకున్నాను’ అని ప్రవీణ్‌ అన్నాడు.

తాను ఈ స్థాయికి రావడానికి గురువులే కారణమని ప్రవీణ్‌ పేర్కొన్నాడు. ‘నేను జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనప్పుడు అశోక్‌ సైని సర్‌ను కలిశాను. ఆయన నాకు సత్యపాల్‌ సర్‌ ఫోన్‌ నంబర్‌ ఇచ్చారు. ఆయనను కలిశాక నేను ఏ విభాగంలో పోటీపడొచ్చో వివరించారు. నన్ను శిష్యుడిగా స్వీకరించారు. ఇదంతా 2018లో జరిగింది’ అని అతడు తెలిపాడు.

అంతర్జాతీయ క్రీడల్లో ప్రవీణ్‌ రెండేళ్ల కిందటే అరంగేట్రం చేశాడు. అతడు విశ్వ వేదికల్లో పోటీపడతానంటే చదువుకున్న పాఠశాల వారే నమ్మలేదు. 2019, జూనియర్‌ పారా అథ్లెటిక్స్‌ ప్రపంచ ఛాంపియన్‌లో రజతం గెలిచాక వారు అండగా నిలిచారు. ఈ ఏడాది దుబాయ్‌లో పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రిలో స్వర్ణం గెలిచాడు.

శుక్రవారం పారాలింపిక్స్‌ హైజంప్‌ చేసేటప్పుడు ఆత్మవిశ్వాసం కాస్త తగ్గినట్టు అనిపించిందని ప్రవీణ్‌ తెలిపాడు. ‘రెండో దఫాలో 1.97 మీటర్లు ఎగిరినప్పుడు నా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంది. 2.01 మీటర్లు దూకిన తర్వాత పుంజుకున్నాను. ఏదేమైనా అత్యుత్తమంగా ఆడాలని అనుకున్నాను. 2.10 మీటర్లు ఎగిరినప్పుడు ఒత్తిడికి గురయ్యా. ల్యాండింగ్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి’ అని అతడు పేర్కొన్నాడు.

కరోనా మహమ్మారి వల్ల ప్రవీణ్‌ ఇబ్బందులు పడ్డాడని కోచ్‌ సత్యపాల్‌ తెలిపాడు. హైజంప్‌లో ల్యాండయ్యే సమయంలో భారీ దిండ్లు అవసరమని పేర్కొన్నాడు. స్టేడియాలు మూసేయడంతో సాధన సరిగ్గా చేయలేకపోయాడని వెల్లడించాడు. పైగా కరోనా బారిన పడ్డాడని వివరించాడు. ప్రవీణ్‌ పొడగరి కావడం, ఒక కాల్లో కండరాలు బలంగా ఉండటం కలిసొచ్చిందని పేర్కొన్నాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డులో స్వర్ణం సాధించడమే తమ తర్వాతి లక్ష్యమని ఆయన ప్రకటించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని