
IPL 2021: చెన్నై x దిల్లీ: చివరి ఓవర్‌లో ధోనీ షాట్లు చూశారా?
ఇంటర్నెట్‌డెస్క్: దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ (18*) మునుపటి ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో అతడి అభిమానులు సంతోషంలో మునిగితేలారు. చివరి ఓవర్‌లో అతడు మూడు బౌండరీలు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో దిల్లీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై ఆఖరి ఓవర్‌లో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు చెన్నై ఒక దశలో 111/1తో పటిష్ఠంగా నిలిచి తేలిగ్గా మ్యాచ్‌ను కైవసం చేసుకునేలా కనిపించింది. కానీ, ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ధోనీసేన ఆరు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న ఉతప్ప(63), శార్దూల్ ఠాకూర్(0), అంబటి రాయుడు (1) వెనువెంటనే పెవిలియన్ చేరడంతో పాటు తర్వాత దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి రన్‌రేట్‌ను పెంచారు.
ఇక చివరి రెండు ఓవర్లలో చెన్నైకి 24 పరుగులు అవసరమైన వేళ అవేష్ ఖాన్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి రుతురాజ్ (70) ఔటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన ధోని తర్వాత ఐదో బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో చివరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 13 పరుగులు కావాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో అంతగా ఫామ్‌లో లేకపోవడంతో చెన్నై సారథి ఎలా ఆడతాడో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టామ్‌కరన్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి మొయిన్ అలీ(16) ఔటయ్యాడు. దీంతో ఆ జట్టుపై మరింత ఒత్తిడి పెరిగింది. సరిగ్గా ఇక్కడే ధోనీ తనలోని పాత ఫినిషర్‌ను బయటికి తీశాడు. ధనాధన్ షాట్లతో మూడు ఫోర్లు సంధించి దిల్లీ ఆశలపై నీళ్లు చల్లాడు. టామ్ వేసిన రెండో బంతిని ఎక్స్‌ట్రా కవర్లో ఫోర్ బాదిన మహీ.. ఆఫ్‌స్టంప్ ఆవల పడిన తర్వాతి బంతిని కూడా ఇన్‌సైడ్ ఎడ్జ్‌తో బౌండరీ దాటించాడు. దీంతో సమీకరణం 3 బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన స్థితికి మారింది. అప్పుడే టామ్ వైడ్ వేయగా తర్వాతి బంతిని ధోనీ డీప్ స్క్వేర్ లెగ్‌లో మూడో బౌండరీకి తరలించి జట్టును ఫైనల్‌కి చేర్చాడు. మీరూ ఆ వీడియో చూసి ఆస్వాదించండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.