IPL: ఐపీఎల్‌ హక్కుల కోసం రిలయన్స్‌ భారీ ప్రణాళిక!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రసార హక్కులు దక్కించుకొనేందుకు రిలయన్స్‌ భారీ ప్రణాళికతో రానుందని తెలిసింది. ఈ మేరకు కార్యచరణ సిద్ధమైందని సమాచారం. ఇప్పటికే ప్రత్యర్థి బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థల నుంచి సీనియర్లను తీసుకుందని అంటున్నారు....

Published : 10 Aug 2021 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రసార హక్కులు దక్కించుకొనేందుకు రిలయన్స్‌ భారీ ప్రణాళికతో రానుందని తెలిసింది. ఈ మేరకు కార్యచరణ సిద్ధమైందని సమాచారం. ఇప్పటికే ప్రత్యర్థి బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థల నుంచి సీనియర్లను తీసుకుందని అంటున్నారు. ఈ ఏడాది ఆఖర్లో నిర్వహించే ఐపీఎల్‌ బిడ్డింగ్‌ను ఎలాగైనా గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది.

నెట్‌వర్క్‌ 18, రిలయన్స్‌ జియో సంయుక్తంగా ఐపీఎల్‌ను ప్రసారం చేసేందుకు సర్వం సిద్ధమైందని ఈ4ఎం నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఐపీఎల్‌ ప్రసార హక్కులు డిస్నీ స్టార్‌ ఇండియా వద్ద ఉన్నాయి. 2022తో ఒప్పందం ముగుస్తుంది. బిడ్డింగ్స్‌ ద్వారా కొత్త ప్రక్రియ ఈ ఏడాది ఆఖర్లో ఆరంభమవుతుంది. డిస్నీ స్టార్‌, సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌, అమెజాన్‌ ఇండియా సైతం హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ పడనున్నాయి. రిలయన్స్‌ నుంచి సరికొత్త క్రీడా ఛానల్‌ రాబోతోందని ఈ4ఎం చెబుతోంది. ఇప్పటికే ఫుట్‌బాల్‌ లీగ్‌ ‘లా లిగా’ ప్రసార హక్కుల్లో వయాకామ్‌ మెజారిటీ వాటా దక్కించుకొందని గుర్తు చేస్తోంది. ఎంటీవీ, వూట్‌లో లీగ్‌ ప్రసారం అవుతోంది.

ఐపీఎల్‌ 2018-2022 సైకిల్‌ ప్రసార హక్కులను స్టార్‌ ఇండియా రూ.16,347 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు 24 కంపెనీలు హక్కుల కోసం పత్రాలు తీసుకున్నాయి. ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ట్విటర్‌, యాహూ, రిలయన్స్‌ జియో, సోనీ పిక్చర్స్‌, డిస్కవరీ, స్కై, బ్రిటిష్ టెలికామ్‌, ఈఎస్‌పీఎన్‌ డిజిటల్‌ మీడియా బిడ్‌ పత్రాలు తీసుకొన్నాయి. కేవలం డిజిటల్‌ హక్కుల కోసమే రిలయన్స్‌ జియో రూ.3075 కోట్లకు బిడ్‌ వేయడం గమనార్హం. అయితే అప్పుడు మొత్తంగా స్టార్‌కే హక్కులు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని