IND vs AUS: జడేజా స్పెల్‌ అద్భుతం.. కానీ ఆసీస్‌ ఓటమికి అసలైన కారణం మరొకటి: మాజీ సెలెక్టర్

వరల్డ్‌ కప్‌లో (ODI World Cup 2023) ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ (IND vs AUS) విజయం సాధించి అద్భుత బోణీ కొట్టింది. ఆసీస్ మాత్రం తన స్థాయి దూకుడును ప్రదర్శించడంలో విఫలమైందని మాజీ సెలెక్టర్‌ వ్యాఖ్యానించారు. 

Published : 09 Oct 2023 14:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) తొలి మ్యాచ్‌లో భారత్‌ విజయానికి విరాట్ కోహ్లీ - కేఎల్ రాహుల్‌ (Virat Kohli - KL Rahul) బ్యాటింగ్‌ ప్రదర్శన కీలకం. అంతకుముందు ఆస్ట్రేలియాను (IND vs AUS) భారత బౌలర్లు సమష్ఠిగా రాణించి అడ్డుకున్నారు. మరీ ముఖ్యంగా రవీంద్ర జడేజా అద్భుతమైన స్పెల్‌తో ఆసీస్‌ను కట్టడి చేశాడు. టీమ్‌ఇండియా గెలవడానికి కొన్ని కారణాలను వెల్లడించిన మాజీ సెలెక్టర్‌ సబా కరీం.. ఆసీస్ ఓడిపోవడానికి కూడా ఆ జట్టు దృక్పథమే కారణమని వ్యాఖ్యానించాడు. భారత్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఫలితంపై విశ్లేషించాడు. 

రోహిత్ శర్మ కెప్టెన్సీ బాగుంది..

భారత సారథి రోహిత్ శర్మ తన బౌలర్లను అద్భుతంగా వినియోగించుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో సరైన సమయంలో బౌలింగ్‌ వేయించి ఫలితం రాబట్టాడు. రవీంద్ర జడేజా స్పెల్‌ మరింత స్పెషల్. లెంగ్త్‌, వేరియేషన్, లైన్‌కు కట్టుబడి బంతులను సంధించాడు. చాలా రోజుల వన్డే క్రికెట్‌లోకి అడుగు పెట్టిన అశ్విన్‌కు ఇది చాలా కీలకమైన మ్యాచ్‌. తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ముగ్గురు స్పిన్నర్లతో కూడిన బౌలింగ్‌ ఎటాక్‌ను రోహిత్ నడిపించిన తీరు బాగుంది. 

బుమ్రాను మరవొద్దు

ముగ్గురు స్పిన్నర్ల గురించి మాట్లాడుకున్నాం. కానీ స్టార్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా  కూడా కీలక పాత్ర పోషించాడు. మిచెల్‌ మార్ష్‌ను ఔట్ చేసిన బుమ్రా భారత్‌కు శుభారంభం అందించాడు. విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌తో పునారగమనం చేసిన బుమ్రా తక్కువ వ్యవధిలోనే సెట్ అయిపోయాడు. అయితే, అతడి పని ఒత్తిడిని తట్టుకొనేలా చూడాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌పై ఉంది. అతడి శరీరంపై అధికంగా భారం మోపకుండా చూడాలి. టోర్నీ ఆసాంతం బుమ్రా ఇదే ఊపును కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. 

మరీ రక్షణాత్మకంగా ఆసీస్‌ బ్యాటింగ్‌

ఆస్ట్రేలియా ఓడిపోవడానికి ప్రధాన కారణం మాత్రం వారి ఆటతీరే. వన్డే ప్రపంచకప్‌లో అదీనూ భారత్‌పై ఆడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో దూకుడును ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ, ఆసీస్‌ ఆటగాళ్ల ఆటలో రక్షణాత్మక ధోరణి ఎక్కువైంది. డిఫెన్సివ్‌ గేమ్‌ ముఖ్యమే కానీ శ్రుతిమించిన డిఫెన్సివ్‌ ఆటతీరును ప్రదర్శించారు. చెన్నై పిచ్‌ గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురైనట్లు అనిపించింది. ఒకవేళ వారు కాస్త దూకుడుగా ఆడినా కనీసం 260-270 పరుగులైనా చేసేవారే. అప్పుడు మ్యాచ్‌ ఇంకాస్త ఆసక్తికరంగా మారేది’’ అని సబా కరీం వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని