Virat Kohli: టీ20 ప్రపంచ కప్‌.. కోహ్లీని పక్కనపెడతారా?

Virat Kohli -  T20 World Cup: టీమ్‌ఇండియా కింగ్‌ విరాట్ కోహ్లీని పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేసే అవకాశాలు లేవా? యువ ఆటగాళ్ల కోసం అతడిని పక్కనపెడతారా?

Published : 13 Mar 2024 00:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ టోర్నీ  (T20 Worlcup 2024) మరికొన్ని నెలల్లో జరగనుంది. ఈక్రమంలో జట్టులో ఎవరుంటారు, ఎవరుండరు అనే విషయంలో చర్చలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. గత కొంతకాలంగా టీమ్‌ఇండియా (Team India)కు, ముఖ్యంగా టీ20లకు దూరంగా ఉన్న మాజీ సారథి విరాట్‌ కోహ్లీ (Virat Kohli)ని జట్టులోకి తీసుకుంటారా? లేదా? అనేదే ఇప్పుడు చర్చ. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడం కోసం విరాట్‌ను పక్కనపెడతారన్న కథనాలు వినిపిస్తున్నాయి.

టీమ్‌ఇండియా సీనియర్లు కెప్టెన్‌ రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ దాదాపు ఏడాదిపాటు అంతర్జాతీయ టీ20లు ఆడలేదు. ఈ ఏడాది ఆరంభంలో అఫ్గానిస్థాన్‌లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టులో చేరారు. టోర్నీలో రోహిత్‌ శతకంతో అదరగొట్టగా.. కోహ్లీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. అఫ్గాన్‌తో తొలి టీ20కి దూరమైన విరాట్‌.. రెండో మ్యాచ్‌లో 29 పరుగులు చేశాడు. మూడో గేమ్‌లో గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. దీంతో పొట్టి ప్రపంచకప్‌లో వీరిద్దరికి చోటు కల్పించడంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి.

రోహిత్‌ శర్మ సారథ్యంలోనే టీమ్‌ఇండియా ప్రపంచకప్‌లో తలపడుతుందని చెప్పిన బీసీసీఐ కార్యదర్శి జై షా.. కోహ్లీ గురించి స్పష్టత ఇవ్వలేదు. దీని గురించి తర్వాత చర్చిస్తామని అన్నారు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో విరాట్‌ స్థానంపై సందిగ్ధం నెలకొంది. ఈక్రమంలోనే తుది నిర్ణయాన్ని అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని ఎంపిక కమిటీకి బీసీసీఐ వదిలేసినట్లు తెలుస్తోంది.

అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌ సమయంలో కోహ్లీతో అగార్కర్‌ మాట్లాడినట్లు సమాచారం. టీ20ల్లో మరింత దూకుడుగా ఆడాలని అతడికి సూచించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడం కోసం రాబోయే ప్రపంచకప్‌లో విరాట్‌ను పక్కనపెట్టాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కోహ్లీకి నచ్చజెప్పే బాధ్యతను అగార్కర్‌కు బోర్డు అప్పగించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఒకవేళ, కోహ్లీని జట్టులోకి తీసుకోకపోతే.. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, రింకూ సింగ్‌, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే వంటి వారిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి.

ఐపీఎల్‌పై ఆధారపడి..

కోహ్లీపై ఎంపిక కమిటీ ఇప్పుడే తుది నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఐపీఎల్‌లో అతడి ప్రదర్శనపై ఆధారపడి ఉందని సమాచారం. గతేడాది ఐపీఎల్‌లో కోహ్లీ 639 పరుగులు చేశాడు. గత కొంతకాలంగా జట్టుకు దూరమైన అతడు.. త్వరలోనే ఆర్సీబీ క్యాంప్‌లో చేరతాడని తెలుస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో 4,037 పరుగులతో కోహ్లీనే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత 3,974 పరుగులతో రోహిత్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని