IND vs NZ: ఉమ్రాన్‌ ఇంకా నేర్చుకోవాలి.. మణికట్టు మాంత్రికుడు ఉండాల్సిందే: వసీమ్ జాఫర్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న (IND vs NZ) టీ20 సిరీస్‌లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పేసర్లు పెద్దగా రాణించలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్‌ భారీగానే పరుగులు సమర్పించారు. ఉమ్రాన్‌ కేవలం ఒక్క మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. 

Published : 01 Feb 2023 14:31 IST

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో సీనియర్‌ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు తప్పకుండా అవకాశం కల్పించాలని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు వసీమ్ జాఫర్ అన్నాడు. పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. పేస్‌తోపాటు లైన్‌ అండ్ లెంగ్త్‌ చాలా కీలకమని చెప్పాడు. క్లిష్టమైన సమయంలో జాగ్రత్తగా బౌలింగ్‌ చేయాలని సూచించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భారత్ - కివీస్‌ చెరొక విజయంతో సమంగా నిలిచాయి. అహ్మదాబాద్ వేదికగా ఇవాళ మూడో మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో తుది జట్టు ఎంపికతోపాటు ఉమ్రాన్ మాలిక్‌పై వసీమ్‌ జాఫర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘స్పిన్‌ బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ ఇబ్బంది పడుతోంది. అందుకే యుజ్వేంద్ర చాహల్‌ను మూడో మ్యాచ్‌లోనూ కొనసాగించాలి. మణికట్టు మాంత్రికుడు ఉన్నప్పుడు కచ్చితంగా వినియోగించుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఉమ్రాన్ మాలిక్‌ టీ20 ఫార్మాట్‌లో ఇబ్బంది పడుతున్నాడు. బంతులను విభిన్నంగా సంధించడంపై ఇంకా కసరత్తు చేయాలి. టీ20ల్లో బౌలింగ్‌ వేరియేషన్‌ కచ్చితంగా ఉండాలి. కివీస్‌పై చాహల్‌ను ఆడించడం అత్యుత్తమ ఎంపిక అవుతుంది. అలాగే బ్యాటింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ కాస్త తడబాటుకు గురవుతున్నాడు. అందుకే అతడి స్థానంలో పృథ్వీషా వైపు ఆలోచిస్తే బాగుంటుంది. పృథ్వీ పొట్టి ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతాడు. తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన ఇషాన్‌ కిషన్, రాహుల్‌ త్రిపాఠి ఆటతీరు పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదు’’ అని జాఫర్ వెల్లడించాడు. గిల్‌ మొదటి రెండు మ్యాచుల్లో తక్కువ స్కోరుకే (7, 11) పరిమితమై నిరాశపరిచాడు. ఇక షా.. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను జులై 2021లో ఆడటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని