IND vs PAK: విభిన్న జెర్సీతో పాక్‌పై భారత్‌ బరిలోకి దిగనుందా..? బీసీసీఐ ఏం చెప్పిందంటే?

టీమ్‌ఇండియా (Team India) జెర్సీ బ్లూ. కానీ, వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మరొక జెర్సీతో బరిలోకి దిగనుందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిపై బీసీసీఐ అధికారికంగా స్పందించడం గమనార్హం.

Updated : 09 Oct 2023 13:27 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లోనే (ODI World Cup 2023) అత్యంత ప్రజాదరణ కలిగిన మ్యాచుల్లో దాయాదుల పోరు కచ్చితంగా ఉంటుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు టీమ్‌ఇండియా సరికొత్త జెర్సీతో బరిలోకి దిగుతుందనే చర్చ సోషల్‌ మీడియాలో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత బ్లూ జెర్సీతో మ్యాచ్‌లను ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రాక్టీస్‌ సందర్భంగా డచ్‌ ఆరెంజ్‌ రంగులోని జెర్సీని భారత ఆటగాళ్లు ధరిస్తూ ఉన్నారు. పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఇదే జెర్సీతో టీమ్ఇండియా ఆడుతుందనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా ఇలాంటి వాటిపై బీసీసీఐ అధికారికంగా కీలక ప్రకటన జారీ చేసింది. అవన్నీ రూమర్లేనని కొట్టిపారేసింది.

‘‘వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగిన భారత్‌ జట్టు ఒక మ్యాచ్‌ కోసం ప్రత్యామ్నాయ కిట్‌ను ధరించడం ఉండదు. ఇలాంటి సోషల్ మీడియా కథనాలను ఖండిస్తున్నాం. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా.. ఊహాగానాలతో పోస్టులు చేయడం సరైంది కాదు. ‘ది మెన్‌ ఇన్‌ బ్లూ’ భారత క్రీడారంగానికి సంబంధించిన రంగు. ఐసీసీ వరల్డ్‌ కప్‌లోనూ ఇదే జెర్సీతో ఆడతాం’’ అని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే, ఐసీసీ 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యామ్నాయ జెర్సీతో భారత్‌ ఆడింది. అప్పుడు ఇరు జట్లవీ బ్లూ కలర్‌లోనే ఉండేవి. దీంతో భారత్‌ బ్లూ డార్క్‌ షేడ్ షర్ట్‌కు ఆరెంజ్‌ స్లీవ్‌తో కూడిన జెర్సీతో బరిలోకి దిగింది. ఇప్పుడు టీమ్‌ఇండియా - పాక్‌ మ్యాచ్‌కు అలాంటి అవకాశాలు లేవు. 

చెన్నైలో జార్వో ప్రత్యక్షం..

భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జార్వో ప్రత్యక్షమయ్యాడు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అయిన డేనియల్ జార్విస్‌ ఇంగ్లాండ్ - భారత్ టెస్టు సిరీస్‌ సందర్భంగా బ్యాటర్‌ అవతారం ఎత్తి టీమ్‌ఇండియా జెర్సీతో క్రీజ్‌లోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. వరల్డ్‌ కప్‌ కోసం ఇక్కడికి రావడమే కాకుండా వీఐపీ ప్రదేశంలో కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా ఇదే అంశంపై ఐసీసీ అధికారిక ప్రతినిధి స్పందించారు. ‘‘ఈ టోర్నీలో మిగతా మ్యాచ్‌లకు హాజరు కాకుండా అతడిపై నిషేధం విధించాం. ఇప్పుడంతా భారత అధికారుల చేతుల్లోనే ఉంది. జార్వోను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది’’ అని వెల్లడించారు. జార్వోపై ఇప్పటికే ఇంగ్లాండ్‌ క్రికెట్ మైదానాల్లో రాకుండా బ్యాన్‌ విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని