INDvsENG: ఇంగ్లాండ్‌ను కఠినమైన జట్టుగా భావించను: రవీంద్ర జడేజా

ఇంగ్లాండ్‌ను కఠినమైన జట్టుగా పరిగణించనని, మొదటి టెస్టులో కొన్ని పొరపాట్లు చేయకుంటే ఓడిపోయే వాళ్లం కాదని భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అన్నాడు. 

Published : 14 Feb 2024 19:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తొలి టెస్టులో చిన్న చిన్న పొరపాట్లు చేయకుంటే సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం సాధించేదని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (jadeja) అన్నాడు. అత్యంత కఠినమైన జట్లలో ఒకటిగా ఇంగ్లాండ్‌ను పరిగణించడాన్ని అతడు ఖండించాడు. హైదరాబాద్‌లో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 190 పరుగుల ఆధిక్యం సాధించినా 28 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 

‘‘కఠినమైన జట్లలో ఇంగ్లాండ్‌ ఒకటి అంటే నేను ఒప్పుకోను. భారత పిచ్‌లపై ఆడటం ఇతర జట్లకు అంత సులభం కాదు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో  కొన్ని చిన్న చిన్న పొరపాట్లు లేకుంటే మనం ఓడిపోయే వాళ్లం కాదు’’అని జడేజా వ్యాఖ్యానించాడు. 

రాజ్‌కోట్‌ పిచ్‌ గురించి మాట్లాడుతూ ఇది స్పిన్నర్లకు స్వర్గధామం కాదని పిచ్‌లో పగుళ్లు ఏర్పడటానికి ఇంకా సమయం పడుతుందని అన్నాడు. ‘‘ఇక్కడ పిచ్‌ చదునుగా, గట్టిగా ఉంటుంది. కానీ మ్యాచ్‌కు ముందు వారు సిద్ధం చేసిన దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మూడు రోజుల్లోనే 37 వికెట్లు పడొచ్చు. ప్రతి మ్యాచ్‌కు పిచ్ మారుతుంది. కొన్నిసార్లు చదునుగా ఉంటే కొన్ని సార్లు బంతి తిరుగుతుంది.  ఒక్కోసారి రెండు రోజులు బాగుంటే తరువాత నుంచి బంతి తిరుగుతుంది.’’ అని జడేజా అన్నాడు. 

గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన జడేజా తిరిగి జట్టులో చేరాడు. మూడో టెస్టు జరగనున్న రాజ్‌కోట్‌లో 2018లో కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లాండ్‌తో మొదటి టెస్టులో ఓటమిపాలైన భారత్‌ రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో గెలిచి 1-1తో సిరీస్‌ను సమం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని