INDW vs SAW: టీమ్‌ఇండియాకు షాక్‌.. ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమణ

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు షాక్‌ తగిలింది. లీగ్‌ దశలో దక్షిణాఫ్రికాతో ఆడిన చివరి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దీంతో సెమీస్‌ పోరుకు అర్హత సాధించలేక ఇంటి ముఖం పట్టింది...

Updated : 27 Mar 2022 16:56 IST

క్రైస్ట్‌చర్చ్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు షాక్‌ తగిలింది. లీగ్‌ దశలో దక్షిణాఫ్రికాతో ఆడిన చివరి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దీంతో సెమీస్‌ పోరుకు అర్హత సాధించలేక ఇంటి ముఖం పట్టింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ఆఖరి బంతికి ఛేదించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు రాణించారు. లారా వోవార్డ్‌ (80; 79 బంతుల్లో 11x4), లారా గూడల్‌ (49; 69 బంతుల్లో 4x4), కెప్టెన్‌ సున్‌ లూస్‌ (22; 27 బంతుల్లో 1x4), మిగ్నాన్‌ డు ప్రీజ్‌ (52 నాటౌట్‌; 63 బంతుల్లో 2x4), మారిజాన్నె కాప్‌ (32; 30 బంతుల్లో 3x4) బాధ్యతాయుతంగా ఆడారు. ఆఖర్లో టీమ్‌ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి ఓ దశలో విజయం సాధించేలా కనిపించింది. కానీ, దక్షిణాఫ్రికా బ్యాటర్ల పోరాటంతో ఆ జట్టు విజయం సాధించింది. మిథాలీ సేన ఆశలపై నీళ్లు చల్లింది.

చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 7 పరుగులు అవసరమైన స్థితిలో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. తొలి బంతికి సింగిల్‌ సాధించిన దక్షిణాఫ్రికా.. రెండో బంతికి చెట్టీ (7) వికెట్‌ కోల్పోయింది. ఆమె రనౌటవ్వడంతో సమీకరణం నాలుగు బంతుల్లో 5 పరుగులుగా మారింది. దీంతో క్రీజులో ఉన్న మిగ్నాన్‌, షబ్నిమ్‌ (2) సింగిల్స్‌పై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఐదో బంతికి మిగ్నాన్‌ భారీ షాట్‌ ఆడి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చేతికి చిక్కినా అది నోబాల్‌గా నమోదైంది. దీంతో సంబరాల్లో మునిగిన భారత్‌కు నిరాశ మిగిలింది. చివరి రెండు బంతులకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు సింగిల్స్‌ తీయడంతో భారత్‌ ఓటమిపాలైంది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (71; 84 బంతుల్లో 6x4, 1x6), షెఫాలీ వర్మ (53; 46 బంతుల్లో 8x4)తో పాటు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (68; 84 బంతుల్లో 8x4) అర్ధ శతకాలతో రాణించారు. మరోవైపు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (48; 57 బంతుల్లో 4x4) త్రుటిలో అర్ధశతకాన్ని కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మసాబటా క్లాస్‌, షబ్నిమ్‌ ఇస్మైల్ చెరో రెండు వికెట్లు తీయగా.. క్లో ట్రియన్‌, అయాబొంగా ఖాకా తలో వికెట్‌ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని