Android 12:  అబ్బో ఎన్ని కొత్త ఫీచర్లో!

ఆండ్రాయిడ్‌ 12 ఫీచర్లంటూ అంతర్జాలంలో కొన్ని హల్‌చల్‌ చేస్తున్నాయి... అవేంటో చూసేద్దాం!

Updated : 17 Apr 2021 14:29 IST

ఆండ్రాయిడ్‌ ఫోన్లకు కొత్త ఆప్షన్లు, ఫీచర్లు జోడిస్తూ ఏటా కొత్త వెర్షన్‌ను రిలీజ్‌ చేస్తుంటుంది గూగుల్‌. అలా ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ 12 వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి డెవలపర్ల కోసం ఇప్పటికే రెండు బీటా వెర్షన్లు విడుదల చేశారు. తాజాగా మూడోది బయటకు వచ్చింది. వాటి ఆధారంగా ఆండ్రాయిడ్‌ 12 ఇలా ఉండొచ్చు అంటూ కొన్ని ఫీచర్లు అంతర్జాలంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అవేంటో చూసేద్దాం!


స్ప్లిట్‌ స్క్రీన్‌లో కొత్తగా

ఒకేసారి రెండు యాప్స్‌ మొబైల్‌ స్క్రీన్‌ మీద చూసుకునే విధంగా గతంలోనే ఆండ్రాయిడ్‌ స్ప్లిట్‌ స్క్రీన్‌ అనే ఫీచర్‌ తీసుకొచ్చింది. ఏదైనా యాప్‌ వాడుతున్నప్పుడు రీసెంట్స్‌ బటన్ క్లిక్‌ చేసి స్ప్లిట్‌ స్క్రీన్‌ ఎంచుకుంటే... స్క్రీన్‌ పై భాగంలో ఆ యాప్‌ వచ్చి చేరుతుంది. ఆ తర్వాత మీకు కావాల్సిన మరో యాప్‌ను‌ ఎంచుకుంటే, అది దాని కింద వచ్చి చేరుతుంది. అయితే దిగువ ఉన్న యాప్‌ స్క్రీన్...‌ పై భాగంలోకి వెళ్లాలంటే కుదరదు. కానీ కొత్త వెర్షన్‌ ఆండ్రాయిడ్‌లో ఈ ఆప్షన్‌ ఇస్తున్నారు. రెండు యాప్‌లను విడదీస్తూ మధ్యలో ఉండే గీత మీద డబుల్‌ ట్యాప్‌ చేస్తే వాటి ప్లేస్‌లు మారుతాయి. పాత తరం షావోమి మొబైల్స్‌లో ఈ ఆప్షన్‌ ఉండేది. 


విడ్జెట్స్‌ వెతుక్కునేలా...

మొబైల్‌లో చాలా యాప్స్‌ ఉంటుంటాయి. వాటిని మెనూ లిస్ట్‌లో వెతుక్కోవడం అన్ని సమయాల్లో సులభం కాదు. అందుకే ఆయా యాప్స్‌ విడ్జెట్స్‌ తయారు చేస్తుంటాయి. అంటే షార్ట్‌కట్‌లా అన్నమాట. ఆండ్రాయిడ్‌లో ఇలాంటి విడ్జెట్స్‌ చాలానే ఉంటాయి. అందులో మనకు కావాల్సిన యాప్‌కు సంబంధించిన విడ్జెట్‌ వెతుక్కోవడం కష్టమే. అందుకే విడ్జెట్స్‌ సెక్షన్‌లో సెర్చ్‌ ఆప్షన్‌ ఇస్తున్నారు. మీకు కావాల్సిన యాప్‌ పేరును సెర్చ్ చేసి, విడ్జెట్‌ను సులభంగా వెతుక్కోవచ్చు. అయితే ఆ యాప్‌ మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ అయి ఉండాలి.


గూగుల్‌ అసిస్టెంట్‌ పిలవడానికి...

స్మార్ట్‌ఫోన్లలో గూగుల్‌ అసిస్టెంట్‌ను యాక్టివ్‌ చేయడానికి కొత్త ఆప్షన్‌ రాబోతోంది. చాలా ఫోన్లలో ‘హే గూగుల్‌’, ‘ఓకే గూగుల్‌’ అంటే అసిస్టెంట్‌ యాక్టివ్‌ అవుతుంది. పిక్సల్‌ ఫోన్స్‌లో అయితే ఫోన్‌ను షేక్‌ చేయడం, బ్యాక్‌ ట్యాప్‌ చేయడం లాంటి ఇంకొన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా పవర్‌‌ బటన్‌ ఆప్షన్‌ను యాడ్‌ చేస్తున్నారట. పవర్‌ బటన్‌ను కాసేపు లాంగ్‌ప్రెస్‌ చేస్తే.. గూగుల్ అసిస్టెంట్‌ యాక్టివ్‌ అవుతుందట. అయితే ఎంతసేపు లాంగ్‌ ప్రెస్‌ చేయాలనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎక్కువసేపు లాంగ్‌ ప్రెస్‌ చేస్తే మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ అయిపోతుంది. 


స్క్రీన్‌షాట్‌ ఎక్స్‌పాండ్‌

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో స్క్రీన్‌షాట్‌ తీసుకోవడం చాలా సులభం. అయితే ఆ స్క్రీన్‌ షాట్‌ను విస్తరించడం (ఎక్స్‌పాండ్‌) చేయడం కుదరదు. అంటే ఏదైనా వార్త మొత్తం స్క్రీన్‌షాట్‌ తీసుకుందాం అంటే అవ్వదు. బిట్లుగా బిట్లుగా కట్‌ చేసుకోవాలి. అయితే క్యూరేటెడ్‌ (మార్పు చేసిన) ఓఎస్‌లు ఉండే మొబైల్స్‌లో ఈ ఆప్షన్‌ ఉంది. స్క్రీన్ షాట్‌ కొట్టాక... దిగువ ఎక్స్‌పాండ్‌ బటన్‌ నొక్కితే ఎంతవరకు కావాలంటే అంతవరకు స్క్రీన్‌ షాట్‌ ఎక్స్‌పాండ్‌ అవుతుంది. ఇప్పుడు ఈ ఆప్షన్‌ ఒరిజినల్‌ గూగుల్‌ ఓఎస్‌లో ఉండబోతోంది. స్క్రీన్‌ షాట్‌ కొట్టాక ‘క్యాప్చర్‌ మోర్‌’ క్లిక్‌ చేసి ఎక్స్‌పాండ్‌ చేయొచ్చు. 


ట్యాబ్స్‌కి ప్రత్యేకం

మొబైల్‌ స్క్రీన్‌ చిన్నగా ఉంటుంది కాబట్టి... హోం స్క్రీన్‌ మీద యాప్స్‌ పెట్టుకుంటే అన్నీ దగ్గరగా ఉంటాయి. అవసరమైనప్పుడు సులభంగా కావాల్సిన యాప్‌/ విడ్జెట్‌ను వేలితో టచ్‌ చేయొచ్చు. అదే ట్యాబ్స్‌లో అయితే అంత సులభంగా ఉండదు. పెద్ద స్క్రీన్‌ వల్ల యాప్స్‌ సులభంగా ఒక చేత్తో టచ్‌ చేయలేం. అందుకే ట్యాబ్స్‌ కోసం కొత్త ఆప్షన్‌ను తీసుకొస్తున్నారు. డ్యూయల్‌ ప్యానల్‌ పేరుతో వస్తున్న ఈ ఫీచర్‌లో స్క్రీన్‌  మధ్యలో సెపపరేషన్‌తో రెండు భాగాలుగా కనిపిస్తుంది. దాంతోపాటు దిగువ టాస్క్‌ బార్‌ ఒకటి వస్తుంది. దీంతో ఇబ్బంది లేకుండా యాప్‌/విడ్జెట్‌లను కావాల్సిన వైపు ఉంచుకోవచ్చు.


వీటితోపాటుగా...

* సెక్షన్ల లోడింగ్‌, యాప్‌ డ్రాయర్‌ ఓపెన్‌, యాప్‌ ఓపెన్‌ అయ్యే విధానంలో ఎఫెక్ట్‌లను మారుస్తున్నారు. ఈ ప్రక్రియలు గతంలో కంటే ఇప్పుడు వేగంగా,  సరళంగా ఉంటాయి.

* డివైజ్‌ కంట్రోల్‌ ప్యానల్‌  (ఆన్‌/ఆఫ్‌ టాగుల్స్‌ ఉండే స్క్రీన్‌) లో కూడా మార్పులు చేస్తున్నారు. బ్రైట్‌నెస్‌ స్లైడర్‌ను, వాల్యూమ్‌ అడ్జెస్ట్‌ స్లైడర్‌ను మార్చేశారు. దీంతోపాటు క్విక్‌ సెట్టింగ్స్‌ టైల్స్‌లోనూ మార్పులుంటాయి. 

* లొకేషన్‌ షేర్‌ చేసేటప్పుడు కొత్త ఆండ్రాయిడ్‌లో ప్రిసైజ్‌, అప్రాక్సిమేట్‌ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయట. అప్రాక్సిమేట్‌ అంటే మీరున్న ప్రాంతం సుమారుగా అవతలి వ్యక్తికి తెలుస్తుంది. ప్రిసైజ్‌ అంటే కచ్చితమైన సమాచారం అందుతుంది. 

* వైఫై, ఇంటర్నెట్‌ విభాగంలోనూ మార్పులు చేస్తున్నారు. ఇకపై వైఫై సెక్షన్‌ను ఇంటర్నెట్‌ అని పిలుస్తారట. వైఫై  నెట్‌వర్క్‌లో వైఫై 5, వైఫై 6 అనే టైప్స్‌ను తీసుకొస్తున్నారు. దీంతోపాటు ఎక్స్‌టెండ్‌ కంపాటబిలిటీ ఆప్షన్‌ కూడా వస్తోంది. వైఫై హాట్‌స్పాట్‌ను ఎక్కువగా వినియోగించేవారికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది.

* మొబైల్‌ స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ చాలా తక్కువగా ఉంటే బాగుంటుంది అనుకునేవాళ్ల కోసంం ఎక్స్‌ట్రా డిమ్‌ ఆప్షన్‌ ఇస్తున్నారు. ఇప్పుడు స్క్రీన్‌ డిమ్‌ చేస్తే... తగ్గే బ్రైట్‌నెస్‌ కంటే ఇది చాలా తక్కువట. రాత్రి వేళల్లో మొబైల్‌ వాడేవారికి ఈ ఆప్షన్‌ ఉపయుక్తం.

* కొత్త వెర్షన్‌ ఆండ్రాయిడ్‌లో సరికొత్త ఎమోజీలను తీసుకొస్తున్నారు. ఎమోజీ 13.1 ప్యాక్‌ను ఇందులో పొందుపరుస్తున్నారు. గతంలో ఉన్న ఎమోజీలకు ఇవి భిన్నంగా ఉంటాయట. 


ఎప్పుడొస్తుందంటే?

ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ 12 డెవలపర్‌ ప్రివ్యూ దశలో ఉంది. ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం మొదలైంది. వచ్చే నెలలో తొలి బీటా వెర్షన్‌ను రిలీజ్‌ చేస్తారు. బీటా వెర్షన్‌ టెస్ట్‌ జులై ఆఖరి వరకు ఉంటుంది.  ఈ క్రమంలో వచ్చే బగ్స్‌ని సరి చేసి, ఆగస్టు తర్వాత అందరికీ కొత్త అండ్రాయిడ్‌ అందుబాటులోకి తెస్తారు. బ్యాచ్‌ల వారీగా కొత్త వెర్షన్‌ అందరి మొబైల్స్‌కు అందబాటులోకి వస్తుంది. ఏ మొబైల్‌కి ఎప్పుడు వస్తుందనేది లాంచ్‌ సమయంలో ఆండ్రాయిడ్‌ ప్రకటిస్తుంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని