Laptop: ఈ 7 తప్పులు మీరు చేస్తున్నారా..?

ల్యాప్‌టాప్‌/పీసీ ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసుల నుంచి ఆఫీస్ వర్క్‌ వరకు ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్న టూల్‌. వీటిని కొనేముందు అనేక రకాలుగా విచారించి కావాల్సిన ఫీచర్స్‌తో మనకు అనుకూలమై ధరలో నచ్చిన మోడల్‌ను ఎంచుకుంటాం. అయితే వాటిని సరిగా ఉపయోగిస్తున్నామా..లేదా అనేది దాని గురించి పెద్దగా ఆలోచించం... 

Published : 08 Jul 2021 13:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ల్యాప్‌టాప్‌/పీసీ ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసుల నుంచి ఆఫీస్ వర్క్‌ వరకు ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్న టూల్‌. వీటిని కొనేముందు అనేక రకాలుగా విచారించి కావాల్సిన ఫీచర్స్‌తో మనకు అనుకూలమై ధరలో నచ్చిన మోడల్‌ను ఎంచుకుంటాం. అయితే వాటిని సరిగా ఉపయోగిస్తున్నామా..లేదా అనేది దాని గురించి పెద్దగా ఆలోచించం. కొన్నిసార్లు నిర్లక్ష్యంతోనో లేదా అవగాహనలేమి వల్లనో వాటిని ఉపయోగించేప్పుడు మనకు తెలియకుండానే కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. అవి ల్యాప్‌టాప్/పీసీ పనితీరుపై ప్రభావాన్ని చూపిస్తాయి. దాంతో కొన్న కొద్ది రోజులకే వాటిలో సమస్యలు మొదలవుతాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మీ ల్యాప్‌టాప్‌/పీసీ పనితీరు మెరుగవుతుందనేది చూద్దాం.

1. 24/7 ఛార్జింగ్ అవసరమా 

చాలా మంది అవసరం ఉన్నా..లేకున్నా ల్యాప్‌ట్యాప్‌ ఛార్జర్‌ పవర్ ఆన్ చేసి ఉంచుతారు. ఇలా చేయడం మంచిది కాదంటున్నారు టెక్ నిపుణులు. 24/7 ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి ఉంచడం వల్ల ల్యాప్‌టాప్‌లోని కొన్ని లోపలి కాంపోనెంట్స్‌ కాలిపోయే అవకాశం ఉంది. అందుకే  గేమింగ్, వీడియో ఎడిటింగ్‌ చేసేప్పుడు మినహాయించి మిగిలిన సందర్భాల్లో ల్యాప్‌టాప్‌ ఆన్‌ చేసి ఉపయోగించకున్నా, స్లీప్‌ మోడ్‌లో ఉంచినా ఛార్జర్‌ తొలగించడం ఉత్తమం. దాని వల్ల మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఎక్కువ కాలం ఎలాంటి సమస్య లేకుండా పనిచేస్తుంది.   

2. ల్యాప్‌టాప్ ఎలా ఓపెన్ చేయాలంటే

ల్యాప్‌టాప్ కొన్న వెంటనే ఎంతో ఉత్సాహంగా దాన్ని ఓపెన్ చేస్తాం. అయితే ల్యాప్‌టాప్‌ను మనం సరైన పద్ధతిలో ఓపెన్ చేస్తున్నామా..లేదా అనేది ఆలోచించం. చాలామంది ల్యాప్‌టాప్‌ను సైడ్‌ కార్నర్ వైపు నుంచి ఓపెన్ చేస్తుంటారు. దాని వల్ల ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ ఒకవైపు మాత్రమే ఒత్తిడి ఏర్పడి డిస్‌ప్లే పాడయ్యే అవకాశం ఉంది. అందుకే ల్యాప్‌టాప్ తెరిచేముందు కీప్యాడ్ భాగం మీద ఒక చేతిని ఉంచి మరో చేత్తో  స్క్రీన్‌ మధ్య భాగంలో పట్టుకుని తెరవడం మంచిది. దానివల్ల ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదు.

3. కూలింగ్ పాడ్‌

చాలా తక్కువ మంది ల్యాప్‌టాప్‌లకు కూడా విడిగా కూలింగ్ పాడ్ ఉపయోగిస్తుంటారు. మరి ల్యాప్‌టాప్‌లకు కూలింగ్ పాడ్ ఉపయోగించాలా..వద్దా అంటే ఉపయోగించడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే..ల్యాప్‌టాప్‌ని టేబుల్  మీద ఉంచి ఉపయోగిస్తున్నప్పుడు కిందివైపున ఉండే వెంటిలేటర్స్ ద్వారా ఎయిర్‌ఫ్లో ఆగిపోయే అవకాశం ఉంది. దానివల్ల ల్యాప్‌టాప్‌లోని కొన్ని సున్నితమైన భాగాలు కాలిపోవచ్చు. అందుకే ల్యాప్‌టాప్‌లో ఎయిర్‌ఫ్లో నిరంతరాయంగా జరగాలంటే కూలింగ్ పాడ్‌ లేదా ల్యాప్‌టాప్‌ కింది భాగం గాలి తగిలేలా చిన్నపాటి స్టాండ్ ఏర్పాటు చేసుకోవడం మంచిది.  

4. ల్యాప్‌టాప్‌ ఎప్పుడు షట్‌డౌన్ చేయాలి

ఇంట్లో లేదా ఆఫీస్‌లో చాలా మంది తమ పని అయిపోయాక ల్యాప్‌టాప్‌/పీసీ షట్‌డౌన్‌ చేయకుండా స్లీప్‌ మోడ్‌ లేదా హైబర్‌నేట్‌ మోడ్‌లో వదిలేస్తుంటారు. ఎక్కువసేపు ఇలా చేయడం వల్ల మీ ల్యాప్‌టాప్‌ పనితీరు మందగించి మీరు షట్‌డౌన్‌ చేయాలనుకున్నప్పుడు ప్రాసెస్‌ ఆలస్యమవుతుంది. అందుకే మీ పని అయిపోయిన వెంటనే పీసీని షట్‌డౌన్ చేయమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీకు ప్రతిరోజూ షట్‌డౌన్ చేయడం సాధ్యం కాకుంటే వారంలో ఒక్కసారైనా షట్‌డౌన్‌ చేయడం అలవాటు చేసుకోమని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. 

5. వైర్లను సరిగా పెట్టుకోవడం

తీరికలేకనో..బద్ధకం వల్లనో చాలా మంది తమ వర్క్‌ టేబుల్‌పై ఉండే ల్యాప్‌టాప్‌, ఇతరత్రా వైర్ల గురించి పెద్ద పట్టించుకోం. వాటిని సర్దుకునేందుకు కూడా ఆసక్తి కనబరచం. కొన్నిసార్లు పని తొందరలో అటు ఇటు నడుసున్నప్పుడు మన కాళ్లకు తగలడం లేదా కుర్చీ కింద పడి వైర్లు పాడవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో వైర్లు తెగిపోతుంటాయి. అందుకే ల్యాప్‌టాప్ ఛార్జింగ్‌ వైర్‌ లేదా ఇతరత్రా వైర్లను వీలైనంత వరకు మీకు అడ్డంలేకుండా సర్దుకోండి. 

6. డిస్క్‌ పార్టిషన్స్‌

ల్యాప్‌టాప్ కొన్నప్పుడు చాలా మంది తెలియక హార్డ్‌డిస్క్‌ను వేర్వేరు భాగాలు చేయకుండా ఉపయోగిస్తుంటారు. దానివల్ల ఓఎస్‌, ప్రోగ్రాం ఫైల్స్‌తోపాటు మీకు సంబంధిచిన ఇతరత్రా ఫైల్స్‌ కూడా ఒకే చోట స్టోర్‌ అవుతాయి. మీకు అవసరమైన ఫైల్స్‌ను ప్రతిసారీ వెతికి తీసుకోవాల్సిందే. దీని బదులు మీ హార్డ్‌డిస్క్‌ను ఒకటి కన్నా ఎక్కువ భాగాలుగా విభజిస్తే ఓఎస్‌, ప్రోగ్రాం ఫైల్స్ ఒకదాన్లో, మీకు వృత్తిపరమైన, వ్యక్తిగత సమాచారం మిగిలిన వాటిలో సేవ్ చేసుకోవచ్చు. ఓఎస్‌ కోసం 60జీబీ నుంచి 70 జీబీ వరకు మెమొరీ కేటాయిస్తే సరిపోతుందనేది టెక్‌ నిపుణుల అభిప్రాయం.  

7. ఓఎస్‌ డ్రైవ్ బయటే

పైన సూచించినట్లు ఓఎస్‌ను ఒక ఫోల్డర్‌లో, మీకు అవసరమైన సాఫ్ట్‌వేర్లను మరో డ్రైవ్‌లో సేవ్‌ చేసుకోవడం ఉత్తమం. దానివల్ల మీ పీసీ ఫార్మాట్ చేయాలనుకున్నప్పుడు వాటిని మరో చోటికి సురక్షితంగా బదిలీ చెయ్యొచ్చు. అలానే ఫార్మాట్ చేసిన ప్రతిసారీ అవసరమైన సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేసుకోనక్కర్లేదు. పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ల్యాప్‌టాప్‌/పీసీ ఎక్కువ కాలం సమర్థవంతంగా పనిచేస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని