‘ఎన్‌క్రిప్షన్‌ తొలగించం.. సమస్యకు పరిష్కారం’

ఒకవైపు ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ తీసుకురాబోయే ప్రైవసీ పాలసీకి వ్యతిరేకత వస్తోంది. కొంతమంది యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ పంచుకుంటోందని ఆందోళనలు రేగాయి...

Updated : 11 Mar 2021 06:41 IST

వెల్లడించిన వాట్సాప్‌ హెడ్‌ క్యాథ్‌కార్ట్‌

ఒకవైపు ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ ‘వాట్సాప్‌’ తీసుకురాబోయే ప్రైవసీ పాలసీకి వ్యతిరేకత వస్తోంది. కొంతమంది యూజర్ల డేటాను ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ పంచుకుంటోందని ఆందోళనలు రేగాయి. అయితే యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వాట్సాప్‌ చెబుతోంది. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌డ్‌ (e2ee) టెక్నాలజీని వినియోగిస్తుండటంతో మెసేజ్‌లను తాము కూడా చూడలేమని వాట్సాప్‌ స్పష్టం చేసింది.
 

మరోవైపు సామాజిక మాధ్యమాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. అసత్య ప్రచారం చేసే సోర్స్‌ వివరాలను ట్రాక్‌ చేసి మూడు రోజుల్లోగా తెలపాలని ఆదేశించింది. అయితే ఇది భావస్వేచ్ఛకు అడ్డంకిగా మారుతుందని సోషల్‌ మీడియా యూజర్ల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కేంద్ర మార్గదర్శకాలపై వాట్సాప్‌ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.. 

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని వాట్సాప్‌ వెల్లడించింది. భారత్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ నిబంధనలపై వాట్సాప్‌ హెడ్‌ క్యాథ్‌కార్ట్‌ స్పందించారు. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సాంకేతికతను తొలగించకుండా ట్రాకింగ్‌ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. వైరల్‌ అయిన సందేశాలను, వాటిని విస్తరించిన వారి వివరాలను బహిర్గతం చేయాలని గత రెండేళ్లుగా వాట్సాప్‌ను కేంద్ర ప్రభుత్వం అడుగుతూనే ఉంది. అయితే యూజర్ల ప్రైవసీకి సంబంధించి మెసేజ్‌ల ఎన్‌క్రిప్షన్‌ను వాట్సాప్‌ కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో పరిష్కార మార్గం అన్వేషిస్తున్నట్లు తొలిసారిగా వాట్సాప్‌ ప్రతినిధి వెల్లడించడం విశేషం. 

‘‘ఎన్‌క్రిప్షన్‌కు సంబంధించి భారత్‌ కోర్టుల్లో పోరాటం చేస్తున్నాం. ఎన్‌క్రిప్షన్‌ ఎందుకు పాటిస్తున్నామో ప్రభుత్వానికి వివరణ ఇచ్చాం. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ టెక్నాలజీని తొలగించకుండానే కేంద్ర ప్రభుత్వ సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుగొంటాం. సమాచారలోపం వల్లే ఆందోళనలు వస్తున్నాయి’’ అని వాట్సాప్‌ హెడ్‌ క్యాథ్‌కార్ట్‌ స్పష్టం చేశారు. కొత్త ఐటీ నిబంధనల దృష్ట్యా భారత్‌లో ఎన్‌క్రిప్షన్‌ను తొలగిస్తారా? లేకపోతే ఇక్కడి మార్కెట్‌ నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందా? అనే ప్రశ్నలకు క్యాథ్‌కార్ట్‌ సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్‌ను సంస్థ ఇంకా పూర్తిగా అధ్యయనం చేయలేదని, అంతేకాకుండా ఎన్‌క్రిప్షన్‌ను కొనసాగించడానికే మొగ్గు చూపుతామని, వెనక్కి వెళ్లేదేమీ లేదని పునరుద్ఘాటించారు.

అసలేంటి ‘ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (e2ee)’?

మెసేజింగ్‌ యాప్స్‌లో ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (e2ee) టెక్నాలజీ ఎంతో కీలకం. దీని వల్ల మెసేజ్‌లు, వీడియో కాల్స్‌ను కేవలం ఎవరైతే చాటింగ్‌ లేదా కాలింగ్‌ చేస్తున్నారో వారు మాత్రమే చూడగలరు. మెసేజింగ్‌ యాప్‌ల నిర్వహణ సంస్థలు కూడా చూసేందుకు వీలుండదు. ఈ సాంకేతికతతో యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని