మంచి నీటికి కొత్త మార్గం

తాగునీటి అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో సముద్రపు నీటిని మంచినీరుగా మార్చటమూ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ గువహటి శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న విధానం కొత్త ఆశలు రేపుతోంది.

Published : 18 Oct 2023 00:02 IST

తాగునీటి అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో సముద్రపు నీటిని మంచినీరుగా మార్చటమూ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ గువహటి శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న విధానం కొత్త ఆశలు రేపుతోంది. సాధారణంగా సంప్రదాయ పద్ధతుల్లో శిలాజ ఇంధనాలను మండించటం ద్వారా పుట్టుకొచ్చే వేడితో నీటిలోంచి ఉప్పును తొలగిస్తుంటారు. దీనికి ఖర్చు ఎక్కువవుతుంది. పర్యావరణానికీ చేటే. ఎండ సాయంతో వేడిని ఉత్పత్తి చేసే కాన్‌సన్‌ట్రేటెడ్‌ సోలార్‌ పవర్‌ (సీఎస్‌పీ) దీనికి మంచి పరిష్కారం. అయితే ఈ వ్యవస్థల నుంచి ఉత్పత్తి చేసిన వేడిని మంచినీటి తయారీ కేంద్రాలకు తరలించటమే పెద్ద సమస్య. కరిగించిన లవణాలు, కృత్రిమ నూనెల వంటి ద్రవాలను ఇందులో ఉపయోగిస్తారు. ఇవి అత్యధిక వేడిలో కరగటం, తక్కువ వేడిని పంపిణీ చేయటం వల్ల అంతగా ఫలితం కనిపించటం లేదు. పైగా వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావటం వల్ల ఖర్చూ ఎక్కువే అవుతుంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించటానికి ఐఐటీ గువహటి పరిశోధకులు నానోఫ్లూయిడ్లను (డీప్‌ యూటెక్టిక్‌ సాల్వెంట్‌(డీఈఎస్‌)లో తేలియాడే నానోపార్టికల్స్‌) ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. దీని ద్వారా గ్రాఫేన్‌ ఆక్సైడ్‌ ప్రత్యేక ఉష్ణ వాహకత, స్థిరత్వాన్ని విజయవంతంగా సాధించగలిగారు. ఈ ద్రావణం పర్యావరణ హితం కావటం గమనార్హం. గ్రాఫేన్‌ ఆక్సైడ్‌ను దాని అమైన్‌ పనితీరుతో మార్పు చేయటం ద్వారా నానోపార్టికల్స్‌ గడ్డకట్టకుండా చేయగలిగారు. సౌర విద్యుత్తుతో ఉత్పత్తి చేసిన వేడిని మెరుగ్గా పంపిణీ చేయటానికి నానోఫ్లూయిడ్లను సమర్థంగా వాడుకోవచ్చని దీంతో నిరూపించారు. దీని ద్వారా పెద్దమొత్తంలో సముద్రపు నీటిని మంచినీరుగా మార్చొచ్చని  చెబుతు న్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని