ఎడ్జ్‌ తీసుకుంటున్నారా?

బ్రౌజర్‌ అనగానే అందరికీ ముందు గుర్తుకొచ్చేవి గూగుల్‌ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లే. ఎందుకనో మైక్రోసాఫ్ట్‌ ఎప్పుడూ  ఈ విషయంలో వెనకే ఉండిపోతుంటుంది. బ్రౌజర్‌ లోపాలను, కొరతను అధిగమించటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకూ పెద్దగా ఆదరణ లభించలేదు. మరో ప్రయత్నంలో భాగంగా ఎట్టకేలకు కాలం చెల్లిన ఎడ్జ్‌కు మంగళం పాడింది. దీన్ని విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ నుంచి తొలగించి, సరికొత్త ఎడ్జ్‌ను ప్రవేశపెట్టింది. తాజా విండోస్‌ 10 అప్‌డేట్‌తో పాటే ఇదీ అందుబాటులోకి వచ్చేసింది. నిజానికి ప్రధాన బ్రౌజర్‌గా ఎడ్జ్‌ను వాడేవారు చాలా తక్కువే అనుకోవచ్చు.

Published : 05 May 2021 00:42 IST

బ్రౌజర్‌ అనగానే అందరికీ ముందు గుర్తుకొచ్చేవి గూగుల్‌ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లే. ఎందుకనో మైక్రోసాఫ్ట్‌ ఎప్పుడూ  ఈ విషయంలో వెనకే ఉండిపోతుంటుంది. బ్రౌజర్‌ లోపాలను, కొరతను అధిగమించటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకూ పెద్దగా ఆదరణ లభించలేదు. మరో ప్రయత్నంలో భాగంగా ఎట్టకేలకు కాలం చెల్లిన ఎడ్జ్‌కు మంగళం పాడింది. దీన్ని విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ నుంచి తొలగించి, సరికొత్త ఎడ్జ్‌ను ప్రవేశపెట్టింది. తాజా విండోస్‌ 10 అప్‌డేట్‌తో పాటే ఇదీ అందుబాటులోకి వచ్చేసింది. నిజానికి ప్రధాన బ్రౌజర్‌గా ఎడ్జ్‌ను వాడేవారు చాలా తక్కువే అనుకోవచ్చు. కానీ వినూత్న ఎడ్జ్‌ను పరిశీలిస్తే ఎవరైనా మనసు మార్చుకోవాల్సిందే. ఇది క్రోమ్‌ కన్నా మెరుగ్గా పనిచేసున్నట్టు ప్రశంసలు పొందుతుండటం విశేషం.
అంతర్జాల విజ్ఞాన ప్రపంచంలో విహరించటానికి ప్రవేశ ద్వారం బ్రౌజరే. ఏం శోధించాలన్నా, ఏం సంగ్రహించాలన్నా ఇదే కీలకం. అలాంటి బ్రౌజర్‌ అధునాతనమైనదైతే, మెరుపు వేగంతో సమాచారాన్ని కళ్ల ముందు నిలిపేదైతే, తక్కువ మెమరీని తీసుకునేదైతే, ప్రాసెసర్‌ శక్తిని తక్కువగా వినియోగించుకునేదైతే, మరింత మెరుగైన గోప్యత సెట్టింగులతో కూడుకున్నదైతే ఇక చెప్పేదేముంది? అలాంటి ప్రయత్నంలో భాగంగా రూపొందించిందే ఎడ్జ్‌ బ్రౌజర్‌. మరి మీ కంప్యూటర్‌లో ఇది అప్‌గ్రేడ్‌ అయ్యిందా, లేదా అనేది తెలుసుకోవటమెలా? ముందుగా ఎడ్జ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి చూడండి. కుడివైపున అన్నింటికన్నా పైన అడ్డంగా ఉండే 3 చుక్కలను క్లిక్‌ చేయండి. తర్వాత ఆయా వివరాలను పరిశీలిస్తూ కిందికి రండి. హెల్ప్‌ యాడ్‌ ఫీడ్‌బ్యాక్‌ను ఎంచుకోండి. తర్వాత ‘అబౌట్‌ మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌’ను క్లిక్‌ చేయండి. ఒకవేళ తాజా వెర్షన్‌ కానట్టయితే తనకు తానే అప్‌గ్రేడ్‌ అవుతుంది. వినూత్నమైన ఎడ్జ్‌ను క్లాసిక్‌ బ్రౌజరనే అనుకోవచ్చు. క్రోమ్‌తో పోలిస్తే చాలా విషయాల్లో ముందుంటుందన్నా అతిశయోక్తి కాదు. మరింత మెరుగైన ప్రైవసీ సెట్టింగులు దీని సొంతం. కంప్యూటర్‌ పవర్‌, ప్రాసెసర్‌, మెమరీని తక్కువగానూ ఉపయోగించుకుంటుంది. క్రోమ్‌ బ్రౌజర్‌లో ఎన్నో ఎక్స్‌టెన్షన్లు వాడుకుంటుంటాం కదా. అవన్నీ ఎడ్జ్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, మరికొన్ని ఆసక్తికరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. అందువల్ల దీని విషయాలు, విశేషాలపై ఓ కన్నేద్దాం.

ప్రత్యేక సైడ్‌బార్‌

ఎడ్జ్‌ బ్రౌజర్‌లో కొత్తగా చెప్పుకోవాల్సింది సైడ్‌ బార్‌ సెర్చ్‌ ఆప్షన్‌ గురించి. ఓపెన్‌ చేసిన ట్యాబ్‌ను వీడకుండానే దీంతో అవసరమైన అంశాలను సెర్చ్‌ చేసుకోవచ్చు. వెబ్‌ పేజీలోనూ ఏదైనా అంశం గురించి మరింత బాగా తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని అనుకుంటే వాటిని హైలైట్‌ చేయొచ్చు కూడా. దాన్ని సెలెక్ట్‌ చేసుకొని రైట్‌క్లిక్‌తో సైడ్‌బార్‌లో సెర్చ్‌ చేసుకోవచ్చు. అదనపు సమాచారం సైడ్‌బార్‌లో డిస్‌ప్లే అవుతుంది. కంట్రోల్‌, షిఫ్ట్‌, ఇ బటన్లను ఒకేసారి నొక్కటం ద్వారా సైడ్‌బార్‌ సెర్చ్‌ను వాడుకోవచ్చు. బింగ్‌లోనైతే డిఫాల్ట్‌గానే ఎడ్జ్‌లో ఈ సెర్చ్‌ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు.

సైట్లు యాప్స్‌గా..

తరచూ సందర్శించే వెబ్‌సైట్లను షార్ట్‌ కట్‌ రూపంలో ఓపెన్‌ చేయటానికి తంటాలు పడుతున్నారా? ఎడ్జ్‌లో అలాంటి ఇబ్బందులు చాలావరకు తప్పించుకోవచ్చు. వెబ్‌సైట్లను యాప్స్‌గానూ మార్చుకోవచ్చు మరి. సెర్చ్‌ మెనూ లేదూ డెస్క్‌టాప్‌లో పిన్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎడ్జ్‌ ఓపెన్‌ చేసి యాప్‌గా మార్చుకోవాలనుకునే వెబ్‌సైట్‌ను తెరవాలి. బ్రౌజర్‌ కుడివైపున పైన ఉన్న మూడు చుక్కల మీద క్లిక్‌ చేయాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి, యాప్స్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. ఇన్‌స్టాల్‌ దిస్‌ సైట్‌ యాజ్‌ యాన్‌ యాప్‌ను ఎంచుకోవాలి. దీనికి ఒక పేరు పెట్టుకొని, ఇన్‌స్టాల్‌ బటన్‌ మీద క్లిక్‌ చేయాలి. అంతే. స్టార్ట్‌ మెనూలో వెబ్‌సైట్‌ ఐకాన్‌ క్రియేట్‌ అవుతుంది. దీన్ని డెస్క్‌టాప్‌ మీదికి తెచ్చుకొని షార్ట్‌కట్‌గానూ వాడుకోవచ్చు. కావాలంటే టాస్క్‌బార్‌కు పిన్‌ కూడా చేసుకోవచ్చు. అవనసరమనుకుంటే యాప్‌ను తొలగించుకోవచ్చు కూడా. విండోస్‌ సెట్టింగ్స్‌లో యాప్స్‌ విభాగంలో మేనేజ్‌ యాప్స్‌ ద్వారా తీసేసుకోవచ్చు. ఎడ్జ్‌ మూడు చుక్కల మీద క్లిక్‌ చేసి, యాప్స్‌ విభాగంలో మేనేజ్‌ యాప్స్‌ ద్వారానూ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

ఒకే సమయంలో ఎక్కువ ట్యాబ్‌లు

ఆయా పనులు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఒకే సమయంలో ఎక్కువ ట్యాబ్‌లు తెరవాల్సి రావొచ్చు. వాటిని మాటిమాటికి మార్చి మార్చి చూడాల్సిన అవసరముండొచ్చు. ఇది కంప్యూటర్‌ మెమరీని, ప్రాసెసర్‌ వేగాన్ని బాగా తినేస్తుంది. సాధారణంగా అన్ని బ్రౌజర్లు ట్యాబ్స్‌ను అడ్డంగా అమరుస్తుంటాయి. కానీ ఎడ్జ్‌ దీని రూపురేఖలనే మార్చేసింది. తెరచి ఉంచిన ట్యాబ్స్‌ను బ్రౌజర్‌కు ఒక వైపున నిట్ట నిలువుగా కనిపించేలా చేస్తుంది. అంతేనా? మెమరీ ఖర్చుకాకుండా ట్యాబ్స్‌ను దానంతటదే స్లీప్‌ మోడ్‌లోకీ మార్చేస్తుంది. ఇందుకోసం పైన కనిపించే మూడు చుక్కల మీద క్లిక్‌ చేయాలి. సెట్టింగ్స్‌లోకి, అక్కడ్నుంచి సిస్టమ్‌లోకి, దాని కింద ఉండే ‘సేవ్‌ రిసోర్సెస్‌’లోకి వెళ్లాలి. సేవ్‌ రిసోర్సెస్‌ విత్‌ స్లీపింగ్‌ ట్యాబ్స్‌ను ఆన్‌ చేయాలి. ఇందులో ట్యాబ్‌ ఎంతసేపు అచేతన స్థితిలో ఉండాలో కూడా ఎంచుకోవచ్చు. ట్యాబ్‌ మీద క్లిక్‌ చేసి తిరిగి యాక్టివ్‌గానూ మార్చుకోవచ్చు.

నిరంతరం ఆన్‌లోనూ..

సేవ్‌ రిసోర్సెస్‌లో మరో అదనపు ఆప్షన్‌ కూడా ఉంది. అదే వెబ్‌సైట్‌ను అసలు స్లీప్‌ మోడ్‌లోకి వెళ్లకుండా చూసుకోవటం. కొన్నిసార్లు వెబ్‌లో విహరిస్తున్నప్పుడు ఒకటి కన్నా ఎక్కువ వైబ్‌సైట్లను ఎప్పుడూ ఆన్‌లోనే ఉండేలా చూసుకోవాల్సిన అవసరముండొచ్చు. అలాంటి సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ట్యాబ్‌ మీద రైట్‌ క్లిక్‌ చేసి, కనిపించే మెనూలో పిన్‌ ట్యాబ్‌ ఎంచుకోవాలి. ఓపెన్‌ అయిన ఇతర ట్యాబ్స్‌కు ఇది అన్నింటికన్నా ఎడమవైపున.. అదీ అదృశ్య రూపంలో ఉండిపోతుంది. బ్రౌజర్‌ ఓపెన్‌ చేసిన వెంటనే ఏదైనా సైట్‌ను టాస్క్‌బార్‌కు పిన్‌ చేసుకునే వెసులుబాటూ ఉంది. వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేశాక పైన కుడివైపు మూడు చుక్కల మీద క్లిక్‌ చేసి.. మోర్‌ టూల్స్‌లోకి వెళ్లి టాస్క్‌బార్‌కు పిన్‌ చేసుకోవచ్చు. కావాలంటే వెబ్‌సైట్‌ పేరును మార్చుకోవచ్చు.

సురక్షిత కిడ్స్‌ మోడ్‌

ఎడ్జ్‌లో మరో సురక్షితమైన అంశం కిడ్స్‌ మోడ్‌. ప్రత్యేకించి 5-8 ఏళ్లు, 9-12 ఏళ్ల పిల్లలను దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించారు. ఇందులోని ‘గార్డ్‌రెయిల్స్‌’ బిల్టిన్‌ జాబితా సాయంతో పిల్లలను అనుచిత వెబ్‌సైట్ల నుంచి కాపాడుతుంది. తల్లిదండ్రులు రివ్యూ చేసి చూడొచ్చు. సెట్టింగ్స్‌ ద్వారా అనుమతించిన అంశాల్లో మార్పులు చేసుకోవచ్చు.

ఇలా కొత్త ఎడ్జ్‌లో శోధిస్తే మరెన్నో వినూత్న ఫీచర్లను చూడొచ్చు. కొత్త విండోస్‌ వాతావరణంలో వెబ్‌లో విహరించాలనుకునేవారికిది మంచి ప్రత్యామ్నాయమనటంలో ఎలాంటి సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని