టెక్నాలజీ దశ దిశ!
టెక్నాలజీ నిరంతర స్రవంతి. కొత్త పరిజ్ఞానాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూనే ఉంటాయి.
టెక్నాలజీ నిరంతర స్రవంతి. కొత్త పరిజ్ఞానాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతూనే ఉంటాయి. మన జీవన విధానం, పనితీరు, ఉద్యోగాలు, వ్యాపారాలు, విహారం, వినోదం.. ఇలా అన్ని రంగాల్లోనూ కొంగొత్త మార్పులు తీసుకొస్తాయి. సంక్లిష్ట సామాజిక, శాస్త్ర సమస్యలకూ పరిష్కారం చూపుతాయి. మరి రోజురోజుకీ అతివేగంగా మారిపోతున్న నేటి ఆధునిక యుగంలో ఈ సంవత్సరం ఎలాంటి టెక్నాలజీలు వెల్లువెత్తనున్నాయి? వీటిపై వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇటీవల ఒక నివేదిక రూపొందించింది. విద్యావేత్తలు, పారిశ్రామిక నేతలు, భవిష్యత్ అంచనా నిపుణుల సలహాలు, సూచనల మేరకు పది ప్రముఖ టెక్నాలజీలను ఇందులో చేర్చింది. అవేంటో చూద్దాం.
సుస్థిర విమాన ఇంధనం
రవాణా రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తు న్నప్పటికీ విమానాల్లో స్వచ్ఛ ఇంధనం అంతగా పురోగతి సాధించటం లేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో 2-3% విమానరంగం నుంచే వెలువడుతున్నాయి. మున్ముందు ఇవి భారీగానూ పెరగనున్నాయి. ఇతర వాహనాల మాదిరిగా విమానాల్లో ఛార్జింగ్ బ్యాటరీల వాడకం కుదరకపోవచ్చు. బ్యాటరీ బరువు-ఇంధనం నిష్పత్తి వీటికి పెద్ద సవాలుగా నిలుస్తోంది. ఉన్నట్టుండి కొత్తరకం విమానాలను ప్రవేశ పెట్టటమంటే మాటలు కాదు. ఇక్కడే సుస్థిర విమాన ఇంధనం (ఎస్‌ఏఎఫ్) ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇదో కృత్రిమ ఇంధనం. ఆహార వ్యర్థాలు, కార్బన్ డయాక్సైడ్ వంటి వాటితో దీన్ని తయారుచేస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విమాన వసతులతోనే దీన్ని వాడుకోవచ్చు. ఇప్పటికే కొన్ని సంస్థలు ఎస్‌ఏఎఫ్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. కొన్ని విమాన సంస్థలు వాడుకుంటున్నాయి కూడా. ప్రస్తుతం విమాన ఇంధన అవసరాల్లో ఒక శాతం వరకు ఇవి తీరుస్తున్నాయి. ఇది 2040 కల్లా 13-15% వరకు పెరగొచ్చని భావిస్తున్నారు. 2050 కల్లా విమానరంగం నికర ఉద్గారరహిత స్థితికి చేరుకో వచ్చనీ భావిస్తు న్నారు.
మొక్కలకు సెన్సర్ల్
రోజురోజుకీ ప్రపంచ జనాభా పెరిగిపోతోంది. ఆహార అవసరాలూ ఎక్కువవుతున్నాయి. జనాభా ఇలాగే పెరుగుతూ పోతే 2050 కల్లా ఆహార ఉత్పత్తిని 70% మేరకు పెంచాల్సి ఉంటుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) చెబుతోంది. దీన్ని సాధించటానికి పంటల పర్యవేక్షణ చాలా కీలకం. సంప్రదాయ మట్టి పరీక్షలు, ప్రత్యక్ష తనిఖీ వంటివి శ్రమతో కూడుకున్నవి. సమయమూ ఎక్కువే పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను తగ్గించటానికే ఉపగ్రహ సమాచారం, సెన్సర్లతో కూడిన డ్రోన్లు, ట్రాక్టర్ల వినియోగం పెరుగుతోంది. వీటికి తోడు ఇప్పుడు మొక్కలకు అమర్చే కొత్తతరం సెన్సర్లూ ఊపందుకుంటున్నాయి. సూక్ష్మ సూదుల పరిమాణంలో ఉండే ఇవి ఉష్ణోగ్రత, తేమ, పోషకాల స్థాయిలను ఎప్పటికప్పుడు పసిగడతాయి. ఇవి అందించే సమాచారం ఆధారంగా దిగుబడిని పెంచొచ్చు. నీరు, ఎరువుల వాడకం తగ్గించొచ్చు. చీడ పీడలను ముందుగానే గుర్తించొచ్చు.
సుస్థిర కంప్యూటింగ్
కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీలు బాగా ఊపందుకుంటున్నాయి. వీటికి మరింత భారీ, శక్తిమంత, విస్తృత డేటా సెంటర్ల సామర్థ్యం అవసరం. ఇందుకు విద్యుత్ కూడా ఎక్కువే అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో ఒక శాతం డేటా సెంటర్లకే సరిపోతోంది. డేటా వినియోగం రోజురోజుకీ ఎక్కువవుతున్న నేపథ్యంలో మహా డేటా సెంటర్లూ అవసరమవుతున్నాయి. దీంతో మున్ముందు విద్యుత్తు వినియోగం పెరగటమూ ఖాయమే. అందుకే డేటా సెంటర్లలో వేడిని తగ్గించటానికి డైఎలక్ట్రిక్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వంటి కొత్త టెక్నాలజీలు పురుడు పోసుకుంటున్నాయి. అలాగే ఈ అధిక వేడిని భవనాలను వెచ్చగా ఉంచటానికి, నీటిని కాచటానికి, పారిశ్రామిక అవసరాలకు మళ్లించే టెక్నాలజీలూ ఊపందుకుంటున్నాయి. కృత్రిమ మేధ వ్యవస్థల సాయంతో ఇంధనాన్ని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవటం, విశ్లేషించటం మీదా దృష్టి సారిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఉదాహరణకు- గూగుల్ డేటా సెంటర్లలో విద్యుత్ వినియోగాన్ని 40% వరకు తగ్గొచ్చు.
జనరేటివ్ ఏఐ
జనరేటివ్ కృత్రిమ మేధ నమూనాలు చాలా వేగంగా రోజువారీ జీవనంలో భాగమైపోతున్నాయి. దీనికి ఛాట్‌జీపీటీ చక్కటి ఉదాహరణ. బడులు, విశ్వవిద్యాలయాలు, కార్యాలయాల్లో విరివిగా వాడేస్తున్నారు. జనరేటివ్ కృత్రిమ మేధ నమూనాలు సంక్లిష్ట అల్గారిథమ్‌లతో డేటాలోని తీరులను వాడుకుంటాయి, గుర్తిస్తాయి. వీటిని సరిగా వాడుకుంటే ఉత్పాదకత, సృజనాత్మకత ఇనుమడిస్తాయి. ఇవి కేవలం టెక్స్ట్, చిత్రాలు, సంగీతం వంటివి సృష్టించటానికే పరిమితం కావటం లేదు. ఆయా జబ్బులకు ప్రత్యేక మందుల తయారీ, నిర్మాణ, ఇంజినీరింగ్ రంగాలకూ విస్తరిస్తోంది. ఉదాహరణకు- అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తేలికైన అంతరిక్ష వాహన పరికరాలను సృష్టించటానికి తోడ్పడే ఏఐ వ్యవస్థలను రూపొందిస్తోంది. ఇవి పరికరాల నాణ్యతకు తోడ్పడనున్నాయి.
ఫ్లెక్సిబుల్ న్యూరల్ ఎలక్ట్రానిక్స్
మెదడులో అమర్చే బ్రెయిన్-మిషన్ ఇంటర్ఫేసెస్ (బీఎంఐ) పరికరాలు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఇవి బయట కంప్యూటర్లకు లోపలి మెదడుకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని కల్పిస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ పరిజ్ఞానం గట్టి ఎలక్ట్రానిక్ పరికరాల మీదే ఆధారపడి నడుస్తోంది. అయితే ఇవి మెదడు కణజాలానికి అనుగుణంగా మారలేవు. కానీ ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయనున్నాయి. వీటిని మరీ లోతుగా కోత పెట్టకుండానే తలలో అమర్చొచ్చు. ఇప్పటికే బీఎంఐ రకం పరికరాలను మూర్ఛ బాధితులకు అమరుస్తున్నారు. కృత్రిమ కాళ్లూ చేతులకు కూడా జోడిస్తున్నారు. ఎలక్ట్రోడ్లతో కూడిన ఇవి నాడీ వ్యవస్థతో అనుసంధానమై పనిచేస్తాయి. జబ్బులతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తాయి. ఫ్లెక్సిబుల్ న్యూరల్ ఎలక్ట్రానిక్స్‌తో ఇవి మరింత ఊపందుకోవటం ఖాయం.
మానసిక ఆరోగ్యంలో మెటావర్స్
మెటావర్స్ మీద చాలా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రత్యక్షంగా అందుబాటులోకి రావటానికి ఇంకా సమయం పడుతుంది. మెటావర్స్ వర్చువల్ ప్రపంచంలో డిజిటల్ ప్రాంతాలను షేర్ చేసుకోవచ్చు. సామాజికంగా, ఉద్యోగాల పరంగా ఒకరితో ఒకరు కలిసి, చర్చించుకోవచ్చు. ఇదే మానసిక ఆరోగ్యంలో కొత్త పుంతలకు దారితీస్తోంది. దూర ప్రాంతాల నుంచే వైద్య సేవలకు ఆస్కారం కలిగిస్తోంది. జబ్బులను నిర్ధరించటం, చికిత్సలను అందించటం, నివారించుకోవటం దగ్గర్నుంచి వాటిపై అవగాహన ఏర్పరచుకోవటానికీ మార్గం సుగమం చేస్తోంది. ఇప్పటికే చాలా గేమింగ్ సంస్థలు కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నో ఆటలను సృష్టించాయి. ధ్యాస, ఏకాగ్రత పెరగటానికి ధ్యానం వంటి పద్ధతులతో ప్రోత్సహి స్తున్నాయి. కొత్తతరం వీఆర్ హెడ్‌సెట్స్ వంటి పరికరాలతో మున్ముందు ఇవి మరింత పుంజుకోవటం ఖాయంగా కని పిస్తోంది.
ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ
కొవిడ్-19 కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. మున్ముందు ఇలాంటి మహమ్మారులు వస్తే? వాటిని అంచనా వేయటం, తగు విధంగా సన్నద్ధం కావటం, ఇతరత్రా సవాళ్లను ఎదుర్కోవటం చాలా కీలకం. ఇందుకు వినూత్న ఏఐ ఆధారిత పరిజ్ఞానాలు, మెషిన్ లెర్నింగ్ టూల్స్ పుట్టుకొస్తున్నాయి. ఆరోగ్య సంక్షోభాలను దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కోవటానికి, వైద్యసేవలను మెరుగు పరచటానికివి ఎంతగానో తోడ్పడతాయి. వైద్య సదుపాయాల అందుబాటును బట్టి ఇవి చికిత్సల అవసరాల్లో మార్పులు చేర్పులు సూచిస్తాయి. దీంతో చికిత్సల కోసం వేచి ఉండే సమయమూ తగ్గుతుంది. ఎక్కువమందికి వైద్యం చేయటానికీ వీలు కలుగు
తుంది.
స్పేటియల్ ఆమిక్స్
మన శరీరంలో సుమారు 37.2 ట్రిలియన్ల కణాలుంటాయి. ఇవన్నీ కలిసికట్టుగా పనిచేస్తాయి. దీన్ని అర్థం చేసుకోవటానికి శాస్త్రవేత్తలు స్పేటియల్ ఆమిక్స్ అనే పద్ధతిని రూపొందించారు. ఇది అధునాతన డీఎన్‌ఏ విశ్లేషణ పద్ధతులు, ఇమేజింగ్ టెక్నిక్స్ కలయికతో కణస్థాయిలో జీవక్రియల పటాన్ని తయారుచేస్తుంది. దీని సాయంతో కణ నిర్మాణాన్ని, జైవిక క్రియలను సునిశితంగా పరిశీలించొచ్చు. ఇంతకుముందు వీటిని గమనించటం సాధ్యమయ్యేది కాదు. అందుకే స్పేటియల్ ఆమిక్స్ సరికొత్త టెక్నాలజీ తరంగంలా దూసు
కొస్తోంది.
డిజైనర్ ఫేజెస్
బ్యాక్టీరియా మీద వైరస్ బాణం. ఆశ్చర్యంగా అనిపించినా ఫేజెస్ ఇలాంటి పనే చేస్తాయి. బ్యాక్టీరియాలోకి తమ జన్యు సమాచారాన్ని పంపించి, వాటి పనితీరును మార్చేస్తాయి. ఇలా జబ్బులను తగ్గించేలా వైరస్‌లను మార్చేయొచ్చు. బయోఇంజినీర్లు ఇప్పుడు దీని మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
వంగే బ్యాటరీలు
ఎలక్ట్రానిక్ పరికరాల తీరు మారుతోంది. ఎటంటే అటు వంగే పరికరాల వెల్లువెత్తుతున్నాయి. వీటికి శక్తిని సమకూర్చటానికి వంగే బ్యాటరీల తయారీ పుంజుకుంటోంది. తేలికైన పదార్థాలతో తయారయ్యే వీటిని వంచొచ్చు, సాగదీయొచ్చు. కార్బన్ పోచలు, దుస్తుల వంటి కర్బన పదార్థాల మీద పొరగానూ వీటిని పరచొచ్చు. మడత కంప్యూటర్ స్క్రీన్లు, స్మార్ట్ దుస్తులు, శరీరానికి ధరించే పరికరాల వంటి కొత్త పరిజ్ఞానాలకివి దన్నుగా నిలుస్తు న్నాయి. వీటి రాకతో దృఢమైన, గట్టి బ్యాటరీలకు కాలం చెల్లనుందనీ భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు