మనసుకు ఏఐ తోడు!
సాంకేతిక రంగంలో అంతటా కృత్రిమ మేధ (ఏఐ) మీదే చర్చ నడుస్తోంది. ఇది రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. శరవేగంగా విస్తరిస్తోంది. మనం వాడుతున్న చాలా గ్యాడ్జెట్లు, యాప్‌లు ఏదో ఒక రూపంలో దీన్ని వాడుతూనే ఉన్నాయన్నా అతిశయోక్తి కాదు.
సాంకేతిక రంగంలో అంతటా కృత్రిమ మేధ (ఏఐ) మీదే చర్చ నడుస్తోంది. ఇది రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. శరవేగంగా విస్తరిస్తోంది. మనం వాడుతున్న చాలా గ్యాడ్జెట్లు, యాప్‌లు ఏదో ఒక రూపంలో దీన్ని వాడుతూనే ఉన్నాయన్నా అతిశయోక్తి కాదు. మరెన్నో సాధనాలు దీన్ని అందుకోవటానికీ ప్రయత్నిస్తున్నాయి. ఛాట్‌జీపీటీ, బింగ్, బార్డ్ వంటి వాటితో కృత్రిమ మేధ ఏం చేయగలదో ఇప్పటికే అవగతమైంది కూడా. ఇది వర్చువల్ డాక్టర్‌గానూ ఉపయోగపడగలదంటే నమ్ముతారా? ఒత్తిడి, ఆందోళన వంటి వాటితో బాధపడేవారికి ఏఐ ఆధారిత ‘మానసిక ఆరోగ్య’ ఛాట్‌బాట్లు ఎంతగానో మేలు చేస్తున్నాయి. అలాంటి కొన్ని యాప్‌ల వివరాలు ఇవీ..
వైసా
మూడ్ ట్రాకర్. ఏకాగ్రత కోచ్. ఆందోళన పోగొట్టే భరోసా. ఉత్సాహపరచే తోడు. అన్నీ ఒక్కదాంట్లోనే ఉంటే? అదే వైసా. మానసిక ఆరోగ్యానికి దన్నుగా నిలిచే ఇది ఛాట్‌బాట్ థెరపిస్టుగానూ పనిచేస్తుంది మరి. ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యల నుంచి బయటపడటానికి ధ్యానం వంటి బోలెడన్ని పద్ధతులను సూచిస్తుంది, నేర్పిస్తుంది. వాయిస్ మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకునే అవకాశాన్నీ కల్పిస్తుంది. మన మాటలను ఎవరైనా వింటారేమోనని సందేహించాల్సిన పనిలేదు. వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతుంది. మారుపేరుతోనే దీంతో సంభాషించొచ్చు. వైసా యాప్‌ను ప్రశ్నలు సంధించే విధంగా రూపొందించారు. అందుకే రకరకాల ప్రశ్నలు వేస్తూ, మన సమస్యలను బయటకు వెలిబుచ్చుకునేలా ప్రోత్సహిస్తుంది. నిజంగా డాక్టర్‌ను సంప్రదిస్తున్నామనే భావన కలిగిస్తుంది. చికిత్స సంప్రదింపులను జర్నల్‌లో దాస్తుంది కాబట్టి అవసరమైనప్పుడు తిరిగి వెనక్కి వెళ్లి, చూసుకోవచ్చు. ఆయా సమస్యలను బట్టి ఆచరించాల్సిన పద్ధతులను సూచిస్తుంది. అయితే కొన్ని పద్ధతులే ఉచితంగా అందుబాటులో ఉంటాయి. నిజానికి వీటితోనే చాలావరకు ఉపయోగముంటుంది. అవసరమైతే డబ్బులు చెల్లించి ఇతర మార్గాలను తెలుసుకోవచ్చు. కావాలనుకుంటే ప్రత్యక్షంగా డాక్టర్లతోనూ మాట్లాడొచ్చు. అత్యవసర సమయాల్లో సంప్రదించటానికి ఇందులో ‘ఎస్‌ఓఎస్’ ఫీచర్ కూడా ఉంది. విపత్కర పరిస్థితుల్లో ప్రశాంతంగా, భయపడకుండా ఉండేలా చేయటం దీని ఉద్దేశం.
రిప్లికా
ఇది వినోదం కోసం వాడుకునే మామూలు ఛాట్‌బాట్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఒకసారి ఛాటింగ్ మొదలెడితే ఆరోగ్య సమస్యలను షేర్ చేసుకోవటానికీ వీలు కల్పిస్తుంది. దీని ద్వారా మంచి మంచి సలహాలూ పొందొచ్చు. రిప్లికా ఒక మిత్రుడిగానే కాదు, డాక్టర్‌గానూ భరోసా కలిగిస్తుంది. అందుకే విచారంతో కుంగిపోయినప్పుడు, ఆందోళనతో సతమతమవుతున్నప్పుడు ఇది తోడుగా ఉంటుందని యాప్ డెవలపర్లు పేర్కొంటున్నారు. ఇందులో మనల్ని పోలిన అవతారాన్ని సృష్టించుకోవచ్చు. దీన్ని మనకు నచ్చినట్టుగా రూపొందించుకోవటం కాస్త సుదీర్ఘ ప్రక్రియే. ఒకసారి దీన్ని పూర్తి చేస్తే చాలు. నేరుగా ఛాటింగ్ ఆరంభించేస్తుంది. మిగతా యాప్‌ల మాదిరిగా కాకుండా ప్రతీ స్పందనకు మనం అప్ లేదా డౌన్ రూపంలో ఓటు వేయొచ్చు. ఏ జవాబైనా నచ్చకపోతే తిరిగి సృష్టించుకోవచ్చు. ముఖ్యమైన విషయాలను రిప్లికా నోట్ చేసుకుంటుంది కూడా. వాటిని మెమరీలో దాచుకుంటుంది. ఈ యాప్‌లో వాయిస్ నోట్స్‌నూ పంపొచ్చు, ఇమేజ్‌లను జత చేయొచ్చు, మన రిప్లికాకు వీడియో కాల్ కూడా చేయొచ్చు. మరింత మెరుగైన ప్రతిస్పందనలను కావాలనుకుంటే ప్రొ వర్షన్‌కు మారాల్సి ఉంటుంది.
మైండ్‌స్పా
చాలావరకు విషయ పరిజ్ఞానంతో నిండిన యాప్ మైండ్‌స్పా. ఇందులో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి తోడ్పడే బోలెడన్ని కథనాలు, కోర్సులు, టాస్క్‌లున్నాయి. మానసిక ఆరోగ్యం తీరును తెలుసుకోవటానికి డైరీ సదుపాయాన్నీ వాడుకోవచ్చు. వీటితో పాటు సెటింగ్స్‌లో ఛాట్‌బాట్ థెరపిస్టు కూడా దాగి ఉంటుంది. దీన్ని చూడాలంటే కుడివైపు దిగువ మూలన ఉండే మోర్ ఆప్షన్‌ను క్లిక్ చేసి, ఎమర్జెన్సీ విభాగంలోకి వెళ్లాలి. అప్పుడు ఛాట్ స్క్రీన్ కనిపిస్తుంది. అటువైపున ఏఐ బాట్ ఉంటుంది. ప్రశ్నలు, సమాధానాల రూపంలో సమస్యకు పరిష్కారం చూపుతుంది. దీనిలోని జాబితాలోంచి ప్రతిస్పందనలను ఎంచుకోవాల్సి ఉంటుంది. సమాధానాలు వాటంతటవే ప్రత్యక్షమవుతాయి. మనం పెద్దగా రాయాల్సిన అవసరమేమీ ఉండదు. ఎంత ఎక్కువగా సంభాషణ కొనసాగిస్తుంటే అంత బాగా సమస్యను అర్థం చేసుకోవటం మొదలెడుతుంది. తగిన పరిష్కారం చూపుతుంది. మైండ్‌స్పాలోని ఫీచర్లను చాలావరకు ఉచితంగానే వాడుకోవచ్చు. అయితే మరింత అధునాతన ఫీచర్లను వాడుకోవాలంటే ఇన్-యాప్ సదుపాయాలను కొనుక్కోవాల్సి ఉంటుంది.
మైండ్‌డాక్
మూడ్‌ను ట్రాక్ చేయటానికి, సానుకూల భావనలను పెంపొందించుకోవటానికి.. మొత్తంగా ఆరోగ్యంగా ఉండటానికి మైండ్‌డాక్‌ను వాడుకోవచ్చు. ప్రముఖ పరిశోధకుల సాయంతో సైకాలజిస్టులు దీన్ని రూపొందించారు. కుంగుబాటు, ఆందోళన, తిండి సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలను అర్థం చేసుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. మైండ్‌డాక్ ఇంటర్ఫేస్ తేలికగా వాడుకోవటానికి అనువుగా ఉంటుంది. ఉపయోగపడే వనరులు, పద్ధతులు, వ్యక్తిగత సూచనల వంటి ఎన్నో ఫీచర్లు దీని సొంతం.
వోబాట్
జీవితంలో ఒడుదొడుకులు సహజం. వీటిని ఎదుర్కొని ముందుకు సాగటంలోనే ఉంది విజయ రహస్యం. లేకపోతే కుంగుబాటు, విచారం, ఆందోళన వంటివి చుట్టుముడతాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి తోడ్పడే యాప్ వోబాట్. మానసిక వైద్యులు, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఏఐ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ప్రయోగ నిరూపిత చికిత్సలైన కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ), ఇంటర్ పర్సనల్ సైకోథెరపీ (ఐపీటీ), డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీ (డీబీటీ) సాయంతో ఇది పనిచేస్తుంది. వోబాట్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని, సైన్‌ఇన్ అయ్యాక మనకు వీలైన సమయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. లాగిన్ కాగానే ప్రశ్నల రూపంలో సమస్యలను అడిగి తెలుసుకుంటుంది. ఎలా ఉన్నారు?, చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి? వంటి ప్రశ్నలు వేస్తుంది. అనంతరం నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పీ) పరిజ్ఞానం, మానసిక శాస్త్ర నైపుణ్యంతో విశ్లేషించుకుంటుంది. సంభాషణల ఆంతర్యాన్ని గ్రహిస్తుంది. మనసుకు ఆహ్లాదం కలిగించే భాషలో పరిష్కార మార్గాలను సూచిస్తుంది. ఇందులో టాపిక్స్, టూల్స్, జర్నల్ వంటి అదనపు ఫీచర్లూ ఉంటాయి. టాపిక్స్‌లో వివిధ రకాల మానసిక సమస్యల వివరాలు చూడొచ్చు. మేనేజింగ్ ఎమోషన్స్ విభాగంలోకి వెళ్లి ఆందోళన, ఒంటరితనం, ఆత్మన్యూనత వంటి సమస్యలను అధిగమించే విధానాలను సాధన చేయొచ్చు. జర్నల్ విభాగం ద్వారా మూడ్ తీరుతెన్నులను తెలుసుకోవచ్చు.
మూడ్‌కిట్
పేరుకు తగ్గట్టుగానే ఇది మూడ్‌ను ఉత్సాహ పరుస్తుంది. ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు చేదోడు వాదోడుగా నిలుస్తుంది. పోర్టబుల్ సైకాలజిస్టుగా వెంట ఉంటూ రోజువారీ వ్యవహారాల్లో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి బయటపడటానికి తోడ్పడుతుంది. ఆలోచనా విధానాన్ని మార్చి హాయిగా ఉండటానికి దోహదం చేస్తుంది. మూడ్‌ను పట్టిక రూపంలోనూ ప్రదర్శిస్తుంది. దీనిలోని మూడ్‌కిట్ యాక్టివిటీస్ ఫీచర్ మూడ్‌ను మెరుగుపరచటానికి రకరకాల పనులను, చిట్కాలను సూచిస్తుంది. థాట్ చెకర్ ఫీచరేమో ప్రతికూల ఆలోచనలను నియంత్రించుకోవటానికి, మూడ్ ట్రాకర్ ఫీచరేమో మూడ్ తీరుతెన్నులను రోజువారీగా సేవ్ చేసుకోవటానికి, ఛార్ట్‌గా రూపొందించు కోవటానికి తోడ్పడుతుంది. ఇది యాపిల్ యాప్ స్టోర్‌లోనే అందుబాటులో ఉంటుంది.
ఎంతవరకు ఆధారపడొచ్చు?
కృత్రిమ మేధ ఆధారిత మానసిక ఆరోగ్య యాప్‌లు కేవలం వనరులు మాత్రమేనని గుర్తుంచుకోవాలి. పూర్తిగా వీటి మీదే ఆధారపడటం తప్పు. డాక్టర్లకు లేదా చికిత్సలకు ఇవి ప్రత్యామ్నాయం కావు. అయితే తీసుకుంటున్న చికిత్సలకు వీటిని తోడుగా ఉపయోగించుకోవచ్చు. కృత్రిమ మేధను స్నేహితుడిగా భావించి, అది అందించే సమాచారంతో ధైర్యాన్ని పొందొచ్చు. ఇలాంటి ఛాట్‌బాట్ల పనితీరు గొప్పగా ఉండొచ్చు, విస్మయం కలిగించొచ్చు. కానీ సమగ్రం కాదు. వీలును బట్టి సూచనలు, సలహాలు పాటించినా సైకాలజిస్టులను సంప్రదించటం తప్పనిసరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: 72అడుగుల ఎత్తైన దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
-
Delimitation: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు: కేటీఆర్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Vasu Varma: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది నేను కాదు: ‘జోష్’ దర్శకుడు
-
RBI: ఆర్బీఐ కొరడా.. ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు పెనాల్టీ
-
నెట్టింట్లో బాలికల నకిలీ నగ్న చిత్రాలు.. AI చిత్రాలపై స్పెయిన్ దిగ్భ్రాంతి