ఏఐయ్యారే!

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది.

Updated : 22 Nov 2023 03:32 IST

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. కథలు, కథనాలు, కవిత్వాలనూ రాసేస్తోంది. డాల్‌-ఇ వంటి జనరేటివ్‌ టూల్స్‌ ఆకట్టుకునే చిత్రాలను గీసేస్తున్నాయి. వీటితో సమానంగా మరెన్నో ఏఐ టూల్స్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రముఖ టెక్‌ కంపెనీలన్నీ వీటి సేవలను వినియోగించుకోవటానికి, అందించటానికి ముందుకు దూకుతున్నాయి.  ప్రస్తుతం అంతర్జాలంలో బోలెడన్ని ఏఐ టూల్స్‌, వెబ్‌సైట్లు  అందుబాటులో ఉన్నాయి. ప్రజెంటేషన్ల తయారీకి, ఆర్థిక వివరాలను వర్గీకరించటానికి, చివరికి పూర్తి వెబ్‌సైట్‌ను రూపొందించు కోవటానికీ తోడ్పడుతున్నాయి. ఏఐయ్యారే అనిపిస్తున్నాయి. అలాంటి కొన్ని టూల్స్‌ ఇవిగో..


ప్రజెంటేషన్లకు స్లైడ్స్‌గో

మంచి ప్రజెంటేషన్లు తయారుచేయటం కష్టంగా అనిపిస్తోందా? అది చేతకాని పనిగా తోస్తోందా? అయితే స్లైడ్స్‌గో (https://slidesgo.com) సాయం తీసుకోవచ్చు. ఇదో ఏఐ ప్రజెంటేషన్‌ మేకర్‌. పూర్తిగా ఉచితం. ప్రజెంటేషన్‌ దేని మీద రూపొందించాలని అనుకుంటున్నారో చెబితే చాలు. స్టైల్‌, టోన్‌ ఎంచుకుంటే దానంతటదే ప్రజెంటేషన్‌ను సృష్టించి ఇస్తుంది. కావాలనుకుంటే మరింత ఆకర్షణీయంగా కనిపించటానికి మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఇందులో ట్రెండింగ్‌లో ఉన్న ప్రజెంటేషన్‌ సెర్చ్‌లు, తాజా థీమ్స్‌, ప్రజాదరణ పొందిన థీమ్స్‌ కూడా ఉంటాయి. ప్రజెంటేషన్‌ ఎలా ఉండాలో నిర్ణయించుకోలేనివారు వీటిని ఎంచుకున్నా సిద్ధమైపోతుంది. మరీ అవసరమైతే ట్యాగ్స్‌ వారీగా బ్రౌజ్‌ చేసి చూసుకోవచ్చు. కిడ్స్‌, ఫుడ్స్‌, టెక్నాలజీ, ట్రావెల్‌, ఎనిమల్‌.. ఇలా బోలెడన్ని విభాగాలుంటాయి. ఇదొక్కటే కాదు.. స్లైడ్స్‌కార్నివల్‌, ప్యాడ్‌లెట్‌, కీనోట్‌, స్లైడ్‌ఎగ్‌ వంటి వివిధ టూల్స్‌నూ ప్రయత్నించి చూడొచ్చు.


విశిష్ట లోగో డిజైనర్‌ లూకా

ఏ వ్యాపారానికైనా లోగో ముఖ్యం. ఇదే ఒక బ్రాండ్‌ను సృష్టిస్తుంది. దీనికీ ఏఐ టూల్స్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. లూకా (https://looka.com) ఇలాంటి సాధనమే. దీంతో విశిష్టమైన, ప్రత్యేకమైన లోగోను సొంతగా సృష్టించుకోవచ్చు. డిజైనింగ్‌ నైపుణ్యాలేవీ అవసరం లేదు. కంపెనీ పేరును ఎంటర్‌ చేసి, లోగో స్టైల్‌, రంగు, సింబల్స్‌ వంటివి ఎంచుకుంటే చాలు. లూకాలోని ఏఐ ఆధారిత మేకర్‌ చిటికెలో లోగోను సృష్టిస్తుంది. దీన్ని ఎంచుకొని, కొనుక్కోవచ్చు. హైరెజల్యూషన్‌ పీఎన్‌జీ, వెక్టర్‌ లోగో ఫైళ్లను మనకు పంపిస్తుంది. దీన్ని ఆన్‌లైన్‌లో, బిజినెస్‌ కార్డులు, టీ షర్టులు.. ఇలా ఎక్కడైనా వాడుకోవచ్చు.


ఈమెయిల్‌ తోడుకు లావెండర్‌.ఏఐ  

ఇదొక వినూత్న ఈమెయిల్‌ అసిస్టెంట్‌. పనిలో నైపుణ్యాన్ని, కమ్యూనికేషన్‌ను మెరుగు పరుస్తుంది. లావెండర్‌.ఏఐ (https://www.lavender.ai) లోని ఏఐ సాధనాలు ఈమెయిళ్లను మరింత బాగా రాయటానికే కాదు.. వచ్చిన ఈమెయిళ్లను ఇంకాస్త బాగా అర్థం చేసుకోవటానికీ తోడ్పడతాయి. ఈమెయిల్‌ను పంపించినవారి కమ్యూనికేషన్‌ శైలినీ విశ్లేషిస్తుంది. అప్పటికప్పుడు దానికి సరిపోయే శైలిని సూచిస్తుంది. ఇలా సానుకూల ప్రతిస్పందన లభించేలా తోడ్పడుతుంది. అవతలివారి తీరుతెన్నులను పసిగట్టి ఈమెయిల్‌ పంపించటానికి ఏది మంచి సమయమో సూచిస్తుంది కూడా.


ఆర్థిక సలహాకు క్లియో

క్లియో ఓ ఆర్థిక నేస్తం.(https://web.meetcleo.com) ఇది లావాదేవీలను వర్గీకరించటం, బడ్జెట్‌ను ప్లాన్‌ చేయటం దగ్గరి నుంచి డబ్బును ఆదా చేసే మార్గాల గురించి వివరించటం వరకూ రకరకాల పనులు చేసి పెడుతుంది. ఒకరకంగా తండ్రి మాదిరిగా సలహాలు ఇస్తుందన్నమాట. మొదట్లో ఇది నస పెడుతున్నట్టుగా అనిపించినా వాడుతున్నకొద్దీ బడ్జెట్‌ చిట్కాల బంగారు గనిగా తోస్తుంది. క్లియో.కామ్‌ ద్వారా దీని సేవలను పొందొచ్చు. ఇది మనం ఖర్చు చేసే తీరును నిశితంగా పరిశీలిస్తుంది. రుణాలు తీర్చటానికి ప్రణాళికలు రూపొందిస్తుంది. అతిగా ఖర్చు చేస్తే ‘నేను చెప్పాను కదా, అలా చేయొద్దని’ అంటూ ముద్దుగా ‘తిడుతుంది’ కూడా.


విక్స్‌ ఏడీఐతో వెబ్‌సైట్‌ తయారీ

వెబ్‌సైట్‌ను రూపొందించటం అంత తేలికైన పనికాదు. కానీ ఏఐ సాయం తీసుకుంటే చిటికెలోనే పూర్తవుతుంది. దీనికి విక్స్‌ ఏడీఐ (https://www.wix.com) మంచి సాధనం. ఇది ఏఐ వెబ్‌సైట్‌ కాపీ, డిజైన్‌ వంటి వాటిని ఇట్టే చేసి పెడుతుంది.  ముందుగా వెబ్‌సైట్‌ తీరుతెన్నుల గురించి కొన్ని తేలికైన ప్రశ్నలు అడుగుతుంది. వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇస్తే చాలు. మొత్తం వెబ్‌సైట్‌ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. అవసరమనుకుంటే మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.


పదాలతోనే వీడియోలకు జెన్‌-1

లైట్లు, కెమెరా అవసరం లేదు. కేవలం పదాలే. క్షణాల్లో వీడియో ప్రత్యక్షం. ఆశ్చర్యంగా అనిపించినా కృత్రిమ మేధ ఇలాంటి విచిత్రాలెన్నో చేస్తోంది. కేవలం ఫొటోలే కాదు, వీడియోలనూ మాటల ఆధారంగా సృష్టిస్తోంది. ఇలాంటి సాధనమే జెన్‌-1 (https://research.runwayml.com/gen1).  ఇదో క్లౌడ్‌ ఆధారిత టెక్స్ట్‌-టు-వీడియో వేదిక. సోర్స్‌ వీడియోను అప్‌లోడ్‌ చేశాక.. ఎడిటింగ్‌, ఎఫెక్ట్‌ల కోసం టెక్స్ట్‌ ప్రాంప్ట్‌ అందిస్తే చాలు. కోరుకున్నట్టుగా వీడియోను రూపొందిస్తుంది. స్టోరీబోర్డ్‌ మాక్‌-అప్స్‌ నుంచి యానిమేషన్లనూ రూపొందిస్తుంది. వీడియోలో అవసరమైన మార్పులనూ చేసుకోవచ్చు.


మెషిన్‌ లెర్నింగ్‌ విద్యకు టెన్సర్‌ఫ్లో

కొత్తగా మెషిన్‌ లెర్నింగ్‌ నేర్చుకోవాలని అనుకునేవారికి టెన్సర్‌ఫ్లో  (https://www.tensorflow.org) మంచి సాధనం. మెషిన్‌ లెర్నింగ్‌ మోడళ్లు వేర్వేరు రకాలుగా ఎలా పనిచేస్తాయో తేలికగా అర్థం చేసుకోవటానికి, నేర్చుకోవటానికి ఇది తోడ్పడుతుంది. ఆరోగ్యం, ఆర్థికం, రవాణా వంటి రంగాల్లో విరివిగా వాడే డీప్‌ లెర్నింగ్‌, న్యూరల్‌ నెట్‌వర్క్స్‌, నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ వంటి పలు అంశాలు దీనిలో ఉంటాయి. సీపీయూ, జీపీయూ రెండింటితోనూ పనిచేసేలా, నైపుణ్యాన్ని మెరుగు పరచుకునేలా దీన్ని రూపొందించారు. డెవలపర్లు వేర్వేరు టెక్నిక్స్‌ సాయంతో మోడళ్లను తయారుచేయొచ్చు.


ఇన్‌బాక్స్‌ మీద పట్టుకు సేన్‌బాక్స్‌

రోజూ ఇన్‌బాక్స్‌లోకి బోలెడన్ని ఈమెయిళ్లు వచ్చి చేరుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు చూడటం కొన్నిసార్లు తలకు మించిన పనిగా మారుతుంది. ముఖ్యమైన మెయిల్‌ను సమయానికి చూడకపోతే ఎక్కడో కిందికి వెళ్లిపోతుంది. ఇలాంటి సమయంలోనే సేన్‌బాక్స్‌ (https://www.sanebox.com) ఉపయోగపడుతుంది. దీనిలోని ఏఐ ముఖ్యమైన మెయిళ్లను గుర్తించి, ప్రముఖంగా కనిపించేలా చేస్తుంది. మెయిళ్లను తనకుతానే వర్గీకరించి పెడుతుంది. శుభ్రంగా ఫోల్డర్లలో సర్దుతుంది. క్రమంగా మనం ఏయే మెయిళ్లను చూస్తున్నామో, చూడాలనుకుంటున్నామో అనేదీ నేర్చుకుంటుంది. ఆయా వ్యక్తులకు సంబంధించిన మెయిళ్లకు ప్రాధాన్యమిస్తుంది. అసలు ఎన్నడూ తెరవని మెయిళ్లను కంటపడకుండా దాచేస్తుంది. అలాగని అవేమీ డిలీట్‌ కావు. కాల్పనిక స్టోర్‌రూమ్‌లోకి చేరవేస్తుంది.


పాత ఫొటోల నవ్వుకు డీప్‌ నోస్టాల్జియా  

ఇంట్లో తాత, ముత్తాతలు, దూరపు బంధువుల పాత ఫొటోలున్నాయా? వారు కదులుతున్నట్టు చూడాలని ఉందా? అయితే డీప్‌ నోస్టాల్జియాshttps://www.myheritage.com deepnostalgia)

సాయం తీసుకోవచ్చు. ఇది ఫొటోల్లోని ముఖాలు నవ్వుతున్నట్టు, రెప్పలు ఆడిస్తున్నట్టు చూపిస్తుంది. వీటిని చూస్తుంటే అప్పట్లో వీడియోను రికార్డు చేసినట్టుగానే అనిపిస్తుంది. డీప్‌ నోస్టాల్జియాలో బోలెడన్ని డ్రైవర్లుంటాయి. ఒక్కో డ్రైవర్‌లో ఆయా కదలికలకు సంబంధించిన వీడియోలు నిక్షిప్తమై ఉంటాయి. ఇవి ఫొటో ముఖానికి అవసరమైన కదలికలను ఆపాదిస్తాయి. ఇలా ఫొటోలను వీడియో రూపంలో మలచి అందిస్తాయి.


జాస్పర్‌ ఓ కంటెంట్‌ క్రియేటర్‌

కంటెంట్‌ సృష్టించటానికి గంటలకొద్దీ పనిచేస్తున్నారా? అయితే జాస్పర్‌ (https://www.jasper.ai)  సాయం తీసుకోండి. ఇది ఏఐ సాయంతో మంచి నాణ్యతతో కూడిన కంటెంట్‌ను రూపొందిస్తుంది. కంటెంట్‌ క్రియేటర్లు, మార్కెటింగ్‌ నిపుణులు, వ్యాపార సంస్థలకు ఇది బాగా ఉపయోగ పడుతుంది. బ్లాగు కథనాలు, ప్రొడక్ట్‌ సారాంశాలు, ప్రమోషనల్‌ టెక్స్ట్‌, ఈమెయిళ్లు.. ఇలా ఎన్నింటినో జాస్పర్‌ చిటికెలో సృష్టిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని